శరవణ భవాయ నమః

స్కంద అంటే జారివచ్చిన వాడు అని ఒక అర్థం. సృష్టికి అతీతమైనటువంటి శివశక్తి సృష్టియందు జారి వచ్చింది. మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక కనిపించని పరోక్షమైన ఆ దివ్యశక్తి అపరోక్షమైన విశ్వమంతా వ్యాపించి ఉండడమే జారి రావడమంటే. అదే స్కంద అనేదాంట్లో ఒక అర్థం. 
"గతి శోషణయోః" అనే మాట ప్రకారంగా స్కంద శబ్దానికి ఒక అర్థం ఏమిటంటే గమనము చేయువాడు అని ఒకటి. శోశింపజేయువాడు అని ఒక అర్థం. ఎటైనా గమనం చేయగలగడం అంటే ఆయనకి అవరోధం అనేది లేదు అని అర్థం. ఎవరూ అడ్డుకోలేరు ఆయనని. అందుకే సుబ్రహ్మణ్యుని ప్రతాపాన్ని ఎవరూ అడ్డుకొనలేరు. ఆయన అనుగ్రహాన్నీ ఎవరూ అడ్డుకోలేరు. అలాంటి అద్భుతమైన అప్రతిహత ప్రతాపము ఎవరూ అవరోధించలేని అనుగ్రహమూ కలవాడు కనుక స్కందుడు. ఇది ఒక అర్థం. శోషణయోః - శత్రు సేనలను ఎండింపజేయువాడు ఆయన. అంటే శత్రు సేనలనన్నింటినీ తపింపజేసి వాళ్ళని నిర్మూలిస్తాడు గనుక సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా యోధ దేవత. యుద్ధదేవతగా కూడా చెప్పబడుతున్నాడు. శత్రువులను నశింపజేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామి వద్ద ఉన్నది. పైగా దేవశక్తులకి విజయం కావాలి అంటే సుబ్రహ్మణ్యుని ఆరాధన కావాలి. దేవ శక్తులు అంటే లోక క్షేమంకర శక్తులు. లోకానికి మంచి కలిగించాలని కొందరు ప్రయత్నిస్తూంటారు. చెడు కలిగించాలని కొందరు ప్రయత్నిస్తూంటారు. అది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఈ విశ్వంలో. అయితే మంచికోసం ప్రయత్నించే వాళ్ళకోసం బలం ఇవ్వాలి. చెడు కలగాలని ప్రయత్నించే వాళ్ళకి బలం తొలగించాలి. ఇదే దేవాసుర సంగ్రామం అనేటప్పుడు. అయితే మంచి కలిగించే వాళ్ళకి బలం ఇవ్వడం అనేది భగవంతుని యొక్క కృత్యము. ఆ కృత్యమే సుబ్రహ్మణ్యుని రూపంలో ఉన్నది. అందుకే లోక క్షేమం కోసం అవతరించినటువంటి రామచంద్ర మూర్తికి సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైనటువంటి ఆ రఘురామునికి విశ్వామిత్రుల వారు ముందుగా సుబ్రహ్మణ్యుని కథను చెప్తారు. ఆ తరువాతే రామచంద్రమూర్తి అవతార కార్యములన్నీ నెరవేరుతాయి.
ఇంకొక చోట ప్రత్యేకించి మహాభారతంలో కూడా కృష్ణ తత్త్వానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య తత్త్వాన్ని కలిపి చూపిస్తారు. ఏవిధంగా అయితే కృష్ణుడు బాలకృష్ణుడై అసురసంహారం చేసి చిట్టచివరికి జ్ఞానోపదేశం కూడా చేశాడో అదేవిధంగా కృష్ణతత్త్వమూ, సుబ్రహ్మణ్య తత్త్వమూ ఒకేవిధంగా కనపడుతాయి. మనకి పురాణాలలో వివిధ రకాల పేర్లతో రకరకాల రూపాలతో దేవతలను చెప్తున్నా తత్త్వతః దేవతల మధ్య సమన్వయము ఉన్నది. అందుకే సుబ్రహ్మణ్య తత్త్వము రామకృష్ణుల అవతారములయందు సమన్వయింపబడుతోంది. లోకరక్షణ కోసం ప్రయత్నించే నారాయణుని యొక్క శక్తియే సుబ్రహ్మణ్య తత్త్వంగా స్పష్టమవుతోంది. అందుకే పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యుడు నారాయణ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే
"స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః" అని విష్ణుసహస్రంలో కూడా మనం చదువుతూ ఉన్నాం.
ఇక సుబ్రహ్మణ్య అనే శబ్దమే రెండు రకాలుగా చెప్పబడుతున్నది. బ్రహ్మము అంటే వేదము, యజ్ఞము, తపస్సు అని అర్థం. బ్రహ్మణ్యః అంటే యజ్ఞమును, తపస్సును, వేదమును, వేద ధర్మాన్ని దానిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వారిని కాపాడువాడు. "బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః" అని వేదవాక్యం మనకి కనపడుతున్నది. అందుకు బ్రహ్మణ్యుడు అన్నప్పుడు యజ్ఞమును, తపస్సును, వేదమును, దానిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మహాత్ములను కాపాడేవాడు బ్రహ్మణ్యుడు. అలాంటి బ్రహ్మణ్యుడే ఇటు యజ్ఞాన్ని, వేదాన్ని కాపాడడమే కాకుండా బ్రహ్మము అనగా బ్రహ్మ జ్ఞానము - ఆ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అందించేవాడు. ఎలా అందిస్తున్నాడు అంటే సుష్టుగా అందిస్తున్నాడు, సంపూర్ణంగా అందిస్తున్నాడు గనుక సుబ్రహ్మణ్యుడు అని చెప్పబడుతున్నాడు. అందుకు సుబ్రహ్మణ్య తత్త్వము అటు యజ్ఞ తత్త్వము, శక్తి తత్త్వము, జ్ఞాన తత్త్వము. ఇన్ని అద్భుతమైన తత్త్వములను కలబోసుకున్నది. ఒక్క సుబ్రహ్మణ్య ఆరాధన అటు శివశక్తుల ఇరువురినీ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. సర్వదేవతలనూ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. వేదములలో చెప్పిన సర్వయజ్ఞములనూ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ
శరవణ భవాయ నమః!!

No comments:

Post a Comment