''శ్రీరంగం" టెంపుల్

ఆళ్వారుల దివ్వ ప్రబంధాలకూ, రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం "శ్రీరంగం". "ఇండియన్ వాటికన్"గా పేరు పొందిన ఈ ఆలయం భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లోకెల్లా పెద్దది, సుందరమైనది. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైయున్న ఈ దివ్యక్షేత్రం.. తమిళనాడులోని తిరుచ్చికి ఆనుకుని ఉండే ఉభయ కావేరీ నదుల మధ్యన విలసిల్లుతోంది.
భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటైన శ్రీరంగం ఆలయం.. 6,31,000 చదరపు మీటర్లు (156) ఎకరాల విస్తీర్ణంతో.. 4 కిలోమీటర్ల పొడవైన ప్రాకారంతో భాసిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాంబోడియాలోగల అంగ్‌కోర్ వాట్ దేవాలయం నేడు శిథిలావస్థలో ఉంది కనుక.. ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం "శ్రీరంగం" ఆలయమేనని ఆలయ వెబ్‌సైట్ పేర్కొంటోంది.
కావేరీ నది, దాని ఉపనది కొలిదం మధ్యలో విస్తరించిన శ్రీరంగం ఒక ద్వీపంలా ఉంటుంది. శ్రీరంగ పట్టణంలో దేవాలయం ఉండడం కాక.. శ్రీరంగం దేవాలయంలోనే పట్టణం ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ అతిపెద్ద ద్రవిడ దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై పక్కకి వరిగి శయనించిన భంగిమలో దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం నాలుగు దశాబ్దాలపాటు అభివృద్ధి చెందింది.
ఈ ఆలయాన్ని మొదటిసారి పదో శతాబ్దంలో నిర్మించగా.. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుగా ఉన్నప్పుడు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. ఆ తరువాత 1771వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉండే రంగనాథ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నాయక రాజులు పునర్నిర్మించారు. దీని దక్షిమ మహాద్వారం 1987లో పూర్తి చేశారు.
శ్రీరంగంలో గర్భగుడి కేంద్రంగా ఎనిమిది దీర్ఘచతురస్రాకారపు ప్రాకారాలు ఒకదానిలోపల మరొకటి ఉన్నాయి. 15వ శతాబ్దందాకా ఈ ప్రాకారాలు ఏ కప్పూ లేకుండా ఉండేవి. లోపలి ఐదు ప్రాకారాలనూ ఆలయం లోపలి భాగాలుగా, బయటి మూడు ప్రాకారాలను నగరంగా, నివాస స్థలాలుగా తీర్చి దిద్దారు.
ఆలయంలోని అపూర్వ మంటపాలు, కట్టడాలు 17, 18 శతాబ్దాలలో నిర్మాణమయ్యాయి. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలుండగా.. తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్టించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూల స్థానంగా ప్రాచుర్యంలో ఉంది.

No comments:

Post a Comment