శ్రీ రామాయణము విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమని కోరుట-శ్రీ రామాయణం

"దశరథ మహారాజా! నీ వంశం చాలా గొప్పది. పైగా వసిష్ఠుడు నీకు గురువు. కనుక, ఇలాంటి మాట నీకే తగును. మరొకరెవరూ ఇలాంటి మాట యివ్వలేడు. నా హృద్గతమైన కార్యం చెబుతాను, అది చేసి సత్యవాక్య పరిపాలకుడవై మసలుకో. నేనొక సిద్ధికోసం యజ్ఞదీక్ష పట్టివున్నాను. దానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వాళ్ళలో ఒకడు మరీచుడు; రెండో వాడు సుబాహుడు. నా వ్రతం యిక పూర్తి అవుతూందనగా వచ్చి వాళ్ళు రక్తమాంసాలతో నా యజ్ఞవేది ముంచెత్తారు. అలాగ నా వ్రతం భంపడ్డం వల్ల నిరుత్సాహంపొంది యిలా వచ్చాను. అంత ద్రోహంచేసినా వాళ్ళని శపించడానికి నాకు బుద్ధిపుట్టడం లేదు. ఎందుచేతనంటే - ఆ వ్రతం చేస్తున్నంత సేపూ కోపం వహించకూడదు. కనుక, రాజా! నీ పెద్ద కొడుకైన రాముణ్ణి ఒక్కమాటు నాతో పంపు. నిజానికతడు బాలుడు. అయినా, అతను మహాశూరుడు, సత్యపరాక్రముడు, అతను ఈ పని తప్పక చెయ్యగలడు. విఘ్నకారులైన రాక్షసుల నిద్దరినీ సునాయాసంగా చంపగలడు. ఆ పని చేశాకా, త్రిలోకాలలోనూ గొప్ప ప్రతిష్ట పొందేటట్టు నేనతనికి బహువిధాల శ్రేయస్సు కలిగిస్తాను. రాముణ్ణి ఎదిరించి వాళ్ళెంత మాత్రమూ నిలువలేరు. రాముడు తప్ప వాళ్ళను సంహరించగలవాడు కూడా మరొకడు లేడు. సత్యపరాక్రముడైన రాముని సంగతి నాకు బాగా తెలుసు. మహాతేజశ్శాలి అయిన ఈ వసిష్ఠుడు, తక్కిన యీ మహర్షులున్నూ బాగా యెరుగుదురు. నీ మంత్రులూ, వసిష్ఠాది మహర్షులూ, ఇందు కంగీకరిస్తేనే రాముణ్ణి నాతో పంపు. నీకున్నూ అంగీకారం అయితేనే , యజ్ఞదీక్ష పది రాత్రులూ రాజీవలోచనుడైన రాముణ్ణి నా దగ్గర వుండడానికి పంపు. ఇంతకీ నాయజ్ఞ కాలం దాటిపోకుండా నువ్వి పని చెయ్యి. విచారించకు" అని చెప్పాడు.
మహాతేజశ్శాలి అయిన విశ్వామిత్రుడు ఇలాగ ధర్మార్థ సహితంగానే అన్నా, రాజు శోకించకుండా వుండలేక పోయాడు. భయభ్రాంతుడై సింహాసనం మీదనుంచి పడిపొయేటట్టు గడగడ వొణికిపోయాడు.
రాముణ్ణి పంపనన్నాడు దశరథుడు:
మునిశార్దూలుడైన విశ్వామిత్రుని మాట విని రాజు ఒక్కక్షణ కాలం రిచ్చపడివుండి, మళ్ళీ అంతలోనే తెలివి తెచ్చుకుని మెల్లగా ఇలా అన్నాడు.
"మహాత్మా! నా రాముడు పదిహేను సంవత్సరాలవాడు. రాక్షసులతో పోరాటానికి శక్తి చాలనివాడు. ఇదే నా చేతిలో ఒక అక్షౌహిని సేన వుంది. దానికి ప్రభువైన నే నున్నాను. ఆ సేనతో వచ్చి ఆ రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను. కనుక రాముణ్ణి తీసుకువెళ్లవద్దు. ధనుష్పాణినై, యుద్ధరంగంలో నిలిచి, ఈ బొందిలో ప్రాణాలున్నంత వరకూ నేనే రాక్షసులతో యుద్ధం చేస్తాను. నేనే నీతో వస్తాను. నీ వ్రతమున్నూ నిర్విఘ్నంగా నెరవేరుస్తాను. రాముడు బాలుడు. బలాబలా లెరుగడు. అస్త్రబలం కలవాడున్నూ కాడు. ఇంతేకాక రాముణ్ణి విడిచి నేను క్షణమయినా బతికివుండలేను. కాదు రాముణ్ణే తీసుకువెడతా నంటావా, అయితే చతురంగబలంతో నన్ను కూడా తీసుకువెళ్ళు. అరవైవేల సంవత్సరాలు గడిచాకా, వ్రతాలూ, ఉపవాసాలూ, యజ్ఞాలూ చేసి చేసి నేను రాముణ్ణి కన్నాను. నా కొడుకులు నలుగురిలోనూ రామునిమీదే నాకు ప్రీతి యెక్కువ. పైగా అతను నాకు జేష్ఠకుమారుడు. కనుక రాముణ్ణి తీసుకువెళ్ళ వద్దు. ఇదిలా ఉండగా...
ఆ రాక్షసులు ఎవరి కొడుకులు ? ఏ మాత్రం బలవంతులు? ఇదంతా నాకు వివరంగా చెప్పు."
అందుకు, విశ్వామిత్రుడు "పులస్త్యమహాముని వంశంలో పుట్టిన రావణుడనే రాక్షసుడున్నాడు. వాడు బ్రహ్మవల్ల వరం పొంది త్రిలోకాలనూ పీడిస్తున్నాడు. వాడు రాక్షసాధిపతి, మహాబలుడు, మహావీర్యుడూను. సాక్షాత్తూగా వాడు కుబేరునకు సోదరుడు. విశ్రవసుకొడుకు. రాక్షసుల కందరికిని చక్రవర్తి. నువ్వూ ఇది వినే వున్నావు. యజ్ఞాలు పాడుచెయ్యడానికి వీలు లేనప్పుడు ఆ రావణుడు ఆ పని చెయ్యడానికి మరీచుడు, సుబహుడు అనే యిద్దరు రాక్షసులను పంపుతూ వుంటాడు" అని చెప్పాడు.
దశరథుడు "మహానుభావా! ఆ రావణుణ్ణి యెదిరించగల శక్తి నాకు లేదు. కనుక , నా కొడుకు మీద అనుగ్రహం వుంచు. దురదుష్టవంతుణ్ణయిన నాకు నువ్వే దైవం. దేవతలూ, దానవులూ, గంధర్వులూ, యక్షులూ, నాగులూ కూడా రావణుణ్ణి యెదిరించి నిలువలేరు. ఎంతటి బలవంతుణ్ణయినా రావణుడు యుద్ధంలో సులభంగా వోడించగలడు. విడిగా నేనొక్కణ్ణయినా, చతురంగబలాలతో కూడి అయినా వాడితో యుద్ధం చెయ్యలేను. ఇలాంటి స్థితిలో యుద్ధతంత్రం యెరుగని బాలుడైన రాముణ్ణి నీతో నేను పంపలేను. నీ యజ్ఞం పాడుచేసే వాళ్ళు సుందోపసుందుల కొడుకులూ, యమునితో సమానులున్నూ కనుక రాముణ్ణి పంపలేను. మారీచుడు సుబాహుడు వీర్యవంతులూ, శిక్షపొందిన యోధులున్ను. వాళ్లతో నేను మాత్రం యెలాగ యుద్ధం చెయ్యగలను?" అన్నాడు. దానితో యజ్ఞంలో నెయ్యి పోస్తే అగ్ని విజృంభించేటట్టు , ఈ మాట వినగానే విశ్వామిత్రుడు ఆగ్రహామహోగ్రుడైనాడు.

No comments:

Post a comment