నందీశ్వరుడు

నిత్యం శివపరమాత్మ సుందర రూపాన్ని మనసులో నిలుపుకుని ధ్యానం చేసే భక్తులకు, ఆ పరమాత్మ దివ్యస్వరూపం వారి వారి మనసులో నిలిచిపోతుందని చెబుతుంటారు.
ఈ స్థితినే ‘శివసారూప్యాస్థితి’ అని అంటారు. ఇటు వంటి శివసారూప్యాస్థితిని పొందిన శివభక్త బృందాన్ని ‘నందిగణం’ అనంటారు. ఈ నంది గణానికి శివపరమాత్మ ఓ బాధ్యతను అప్పగించాడు. కైలాసంలోని పనులన్నింటిని సక్రమంగా నిర్వహింపజేయడమే వీరి పని. ఈ గణానికి అధికార నందీశ్వరుడు నేతృత్వం వహిస్తుంటాడు. ఈయన, శివదర్శనం కోసం కైలాసానికి వచ్చే సకల లోకవాసులను ఓ క్రమశిక్షణా పద్ధతి ప్రకారం, శివుని దగ్గరకు పంపిస్తుంటాడు. ఒకవిధంగా చెప్పాలంటే, ఏ దేవతలైనప్పటికీ, శివదర్శనం చేసుకోవాలంటే, ఈయన అనుమతిని తప్పక పొందాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఈ భూలోకంలో శివపరమాత్మ గర్భగుడులలో కొలువై ఉండి, భక్తులను కరుణిస్తూ, ఉత్సవ సమయాలలో అందరికీ సంతోషాన్ని పరిచేందుకై ఊరేగింపుగా వస్తుంటాడు. ఆ సమయంలో అధికార నందీశ్వరుడు ఉమాసహిత మహేశ్వరుని తన భుజాలపై ఎక్కించుకుని, అందరికీ ఆ స్వామి కరుణాకటాక్షాలు లభించేట్లు చేస్తున్నాడు. ఈవిధంగా చేతిలో ఎంత గొప్ప అధికారబలం ఉన్నప్పటికీ, అణుకువ అనేది ఉండాలని అధికార నందీశ్వరుడు మనకు చెబుతున్నాడన్నమాట. ఈ అధికార నందీశ్వరుడు శివసారుప్య స్థితిని పొందిన వాడవడం చేత, దాదాపు శివునివలెనే గోచరిస్తుంటాడు. శివపరమాత్మలాగా చేతులలో ఢమరుకాన్ని, జింకను పట్టుకుని కనబడుతుంటాడు. ఆయనవలేనే త్రినేత్రాలను కలిగివుండటమేకాక, నీలపురంగు కంఠముతో ఆ నీలకంఠేశ్వరుని గుర్తుకు తెస్తుంటాడు. జటాధారియై, తన స్వామివలనే ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని తిరుగాడుతుంటాడు. వృషభ (ఎద్దు) ముఖంతో, మానవదేహంతో కనబడే ఈ అధికార నందీశ్వరునికి, శిఖలో చంద్రవంక, గంగ లేవు.
అధికార నందీశ్వరుడు జ్ఞానస్వరూపుడు. నిత్యం జ్ఞానకరవాలాన్ని ధరించి ఉంటాడు. ఉమాసహితమహేశ్వరుని తన భుజాలపై మోస్తున్నప్పుడు మాత్రం తన జ్ఞానకరవాలాన్ని బొడ్లో దోపుకుంటాడు. చేతిలో బంగారపు బెత్తం! మరి, కైలాసానికి శివ దర్శనానికి వచ్చే దేవతలను వరుసక్రమంలో ఆయన దగ్గరకు పంపించాలి కదా!
“శివలింగంలో శివశక్తుల సంగమం జరగడం వలన ప్రచండమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంటుంది. దానికి ప్రతికూల ఫలితాలు కలుగకుండా ఉండేందుకై శివలింగంపై నిరతరం జలధార పడుతుండాలి.”
ఈ అధికార నందీశ్వరుడు శివదర్శనం కోసం కైలాసానికి వచ్చే దేవతలను క్రమబద్దీకరించడం గురించి ఓ కవి ఇలా చెబుతున్నాడు. “స్వామిని దర్శించుకోవాలని బయలుదేరిన దేవతలకు, ఆయన సన్నిధి దగ్గరవుతున్న కొలదీ ఆత్రుతపెరుగుతుంటుంది. ఇంకొంచెం తొందరగా ఆయన దర్శనభాగ్యం కలిగితే బాగుంటుందని మెల్లగా ఒకరినొకరు తోసుకోవడం మొదలుపెట్టి. ఆ తోపులాట తీవ్రరూపము దాల్చి, అక్కడ ఓ విధమయిన క్రమ శిక్షణారాహిత్యం ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడకు వచ్చిన అధికార నందీశ్వరుడు తన బంగారుబెత్తంతో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న ఆయా దేవతల తలలపై కొడుతుంటాడు. అప్పుడు ఆ దేవతల కిరీటాల నుంచి రాలిపడిన వివిధమణులతో, రత్నాలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంటుంది. స్వామి దర్శనాంతరం దేవతలంతా తమ తమ స్థావరాలకు వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రాంతాన్న శుభ్రం చేయడానికి వచ్చిన పరిచారికలకు ఒపలేనంత పనిభారం నెత్తిపై పడుతుంటుందట.” మరి శివుని దర్శనానంతరం ఇంతటి గందరగోళం ఉంటుంది.
ఈ అధికారనందీశ్వరుడే జ్ఞానస్వరూపిగా శివజ్ఞానాన్ని పంచే గురువుగా భాసిల్లుతున్నాడు. శివుని ద్వారా తాను గ్ర్రహించిన జ్ఞానామృతాన్ని శివభక్తులకు పంచే జ్ఞానాచార్యుల ఆదిగురువు ఈ అధికార నందీశ్వరుడు. అందుకే జ్ఞానోపదేశం చేయడానికి తగిన సమయమైన బ్రహ్మ ముహూర్తంలో, శివపరమాత్మను తన భుజాలపై మోస్తూ మనకు ఆ స్వామి జ్ఞానదర్శనాన్ని కలిగిస్తున్నాడు. ఈ పుణ్యభూమిలోని పలు శివాలయాలలో ఈ జ్ఞానదర్శనం జరుగుతుంటుంది. ఆ దర్శనం దొరికిన భక్తుల జన్మలు ధన్యమయినట్లేగా!
శివుని ఉమాదేవి సహితంగా తన భుజాలపై మోస్తున్న అధికార నందీశ్వరుడు ఎడమకాలును మడిచి, కుడిమోకాలును నేలపై ఆనించి, తలపై జటతో, చిన్న చిన్న కొమ్ములతో కనిపిస్తున్నాడు. నాలుకను ముక్కు రంధ్రం వరకు సాగదీసి, విశాలమైననేత్రాలతో, అధికారధోరణితో తలను ఓ ప్రక్కకు తిప్పి చూస్తున్నాడు. అందుకే ఈయన పేరు అధికారనందీశ్వరుడు. మడిచిన ఎడమకాలు ద్వారా స్థిరత్వాన్ని, నేలపై ఆనించిన కుడి కాలు ద్వారా అణుకువను తెలియపరుస్తున్న అధికారనందీశ్వరుడు, వివిధ ఆభరణాలతో, రుద్రాక్ష మాలలతో, కళ్ళూ చేతులకు కంకణాలతో, గట్టిగా బిగించిన ఉదరబంధంతో ఉమా సమేత మహేశ్వరుని మన ముందుకు తెస్తున్నాడు. ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు మనకు వెయ్యి కన్నులున్నా చాలవన్నది నిజం. స్వామి సేవలో పునీతుడవుతోన్న ఆ అధికార నందీశ్వరుని భాగ్యం ఎంతని చెప్పగలం?

No comments:

Post a Comment