సాయిబాబా గురించి.....


జననం: తెలియదు
జన్మస్థలం: తెలియదు
అసలు పేరు: తెలియదు
మరణం: అక్టోబరు 15, 1918
మరణ స్థలం: షిరిడీ, భారతదేశం
గురువు: వెంకూసా
వేదాంతం/తత్వం: అద్వైతం
ఉపదేశం: సబ్‌కా మాలిక్ ఏక్ హై
(అందరి ప్రభువు ఒక్కడే)
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కధనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు. ఈ రెండు కధనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.
తను షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.
ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.
షిరిడీలో నివాసం తన మసీదు వరండాలో సాయిబాబా1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చాడు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “దయ చేయుము సాయీ” అని పిలిచాడు. తరువాత ‘సాయి’ పదం స్థిరపడి అతడు “సాయిబాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి ‘మొహిదీన్ తంబోలీ’ అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే ‘కఫనీ’, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశాడు (మహా సమాధి చెందాడు). అతని దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే ‘సమాధి మందిరం’ నిర్మించబడింది.

No comments:

Post a Comment