శరవణభవుడు.- శ్రీ సుబ్రహ్మణ్యస్వామి

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు.
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.
ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి. ఈ పేర్లలో ఎంతో నిగూఢార్థం ఉంది.
షణ్ముఖుడు:
ఆరు ముఖాలుగలవాడు కనుక షణ్ముఖుడనబడుతున్నాడు. అదేవిధంగా షణ్ముఖుడు పంచభూతాల సంగమానికి సంకేతం. ఆయన ఈ సృష్టిలోని సమస్తంలో ఉన్నాడు.
సుబ్రహ్మణ్యస్వామి:
షణ్ముఖుని స్వరూపం జ్యోతిర్మయమైనది. పరమశివుని త్రికూటి నుండి వెలువడిన అగ్ని కీలలతో ఆరుముఖాల షణ్ముఖుడు ఉద్భవించాడు. ఆ జ్యోతి స్వరూపుడు మనలోని అజ్ఞానాంధకారాన్నిపారద్రోలి, మన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు. శూరపద్ముని ఆవరించియున్న మాయను తొలిగించి, అతనికి మోక్షమార్గాన్ని చూపినందుకే స్వామిని మనమంతా సుబ్రహ్మణ్యస్వామి అని కొలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు.
స్కందుడు:
స్వామి దగ్గరకు మనం మోకరిల్లితేనే చాలు మన ఊపిరి సుగంధపరిమళాలతో నిండిపోతుంది. ఈ విషయాన్ని ముందుగా స్వామి తల్లి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరు తామరపుష్పాలలో గమనించినపుడు తెలుసుకుని మురిసిపోయింది. అలాగే ‘స్కంద’ అంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే స్కందుడయ్యాడు.
శరవణభవ:
శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
గాంగేయుడు:
శివుని త్రినేత్రం నుండి వెలువడిన జ్యోతి కిరణాలు శరవణపోయ్ గై అనే నదిలో ఐక్యం అయిన తరువాత స్వామి ప్రత్యక్షమవడం వలన గాంగేయుడు అని పిలువబడుతున్నాడు. గాంగేయుడు అంటే గంగపుత్రుడు.
వేలాయుధుడు:
స్వామి ఆయుధం శూలం (వేల్ అని తమిళంలో అంటారు) ఈ వేల్ తోనే శూరపద్ముడు, అతని దుష్టపరివారమంతా సంహారించబడింది. వేల్ జ్ఞానశక్తికి ప్రతీక. స్వామి తన తన వేలాయుధంతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపికలను వెలిగిస్తున్న వేలాయుధుడు. ఇలా స్వామి యొక్క ప్రతినామంలో ఎంతో గూఢార్థం ఉంది. ఇక, హరిహరుల తత్త్వమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారి తత్త్వం.
పురుషో విష్ణురుత్యుక్తః శివోవా నామతః స్మృతః
అవ్యక్తంతు ఉమాదేవి శ్రీర్వాపద్మనిభేక్షణా!
తత్సం యోగాత్ సముధ్బూతః సహిసేనాపతి ర్గుహః
పురుషోత్తముడైన విష్ణువు లేదా పరమేశ్వరుడు అవ్యక్త శక్తి శ్రీమహాలక్ష్మీ లేదా పార్వతీదేవి వీరిరువురి సమన్వయ సమైక్యతా తత్త్వ మూర్తియే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని స్కంధ పురాణం తెలియజేస్తుంది.
వివరంగా చెప్పాలంటే శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీ నారాయణులను కలిపి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం. అదే హరిహరులు ఒక్కటేనన్న అద్వైత తత్త్వం.
అందుకనే తమిళనాడులో పళముదిర్ చోళై అనబడే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీమహావిష్ణు, శ్రీసుబ్రహ్మణ్యులు ఒకే ప్రాగణంలో వెలసియున్నారు.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్టపాణే
ఈ షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన. అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత. అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడు, అంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది.
వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ
స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరుంది. సేనాని అగ్నిభూః, గుహః అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది.
కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన. సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగా…ఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు.
సేనా విదారక స్కంధ మహాసేన మహాబల
రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే
రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం.
ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము.
“స్వామి” అన్న పదం అందరి దేవతలకు వర్తించినా, అది శ్రీసుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే అనువర్తిస్తుంది. అమరకోశంలో స్వామి అను పదానికి దేవసేనాపతి, శూరః, స్వామీ గజముఖానుజః అని శ్రీ సుబ్రహ్మణ్యుని గూర్చి పదాలలో ఉపయోగింపబడి ఉంది. స్వామి అన్న నామధేయం ఆయనదే.
ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై వుంచి, మరొక హస్తంతో అభయప్రదానం
చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు జ్యోతులలోకెల్లా జ్యోతియైన పరంజ్యోతి. ఆత్మ స్వరూపుడు. షణ్మతాలకు అధిపతి. గణపతిని ప్రధానంగా ఉపాశించునది గాణ పత్యము. సూర్యుని ఉపాశించునది సౌరము. అంబికను ఉపాశిస్తే అది శాక్తము. శివోపాసన శైవము. శ్రీమహావిష్ణు ఉపాసన వైష్ణవం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమాత్మ అని ఉపాశించడం కౌమారం.
శివశక్తులు కలిసి నందువల్లనే జ్ఞానజ్యోతి ఏర్పడింది. అట్లేర్పడిన జ్యోతిస్వరూపుడైన కుమారుడే శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు. లోకానుగ్రహార్థం మూర్తీభవించినపుడు శ్రీసుబ్రహ్మణ్యుడిగా విలసిల్లుతున్నాడు. ఆయన శివశక్తుల సమ్మేళనం వలన ప్రభవించిన జ్ఞానఫలం. అందువలన ఆయన తన దివ్యశక్తిచే మన బాహ్యాంతరములందలి అజ్ఞానాన్ని శాశ్వతంగా పోగొట్టి మనకు అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలుగజేస్తున్నాడు.
అరుణగిరినాధుడనే శ్రీ సుబ్రహ్మణ్య భక్తుడు తమిళగడ్డపై జన్మించాడు. ఆయననుణ కందరనుభూతి అనే గ్రంథాన్ని వ్రాశాడు. దానిలో వేర్వేరుగానున్న శివశక్తులు ఏకమై ఒకదివ్యశక్తిని ఉత్పాదించాయని, ఆశక్తి అనుగ్రహం వలన మనలోని ద్వైత భ్రమ తొలిగి ఏకత్వంలోకి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నాడని వివరించాడు. ఆయన తిరుపుగళ్ అనే తమిళ స్తోత్ర గ్రంథంలో కూడా శివశక్తులకు జన్మించిన శ్రీసుబ్రహ్మణ్యుని వైష్ణవ పరంగా కూడా కీర్తించడం విశేషంగా ఉంటుంది.
తమిళభాషలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ‘మురుగన్’ అని అంటారు. ఆమాటకు అందమైన వాడని అర్థం. ఆయనకు ‘మరుమగన్’ అని కూడ పేరున్నది. ఆ మాటకు అర్థం మేనల్లుడని. ఒక ఇతివృత్తం ప్రకారం శ్రీవల్లీ దేవసేనలిరువురు శ్రీమహావిష్ణువు కుమార్తెలే అని, వారిని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వివాహమాడిన కారణంగా, ఆయన శ్రీమహావిష్ణువునకు మేనల్లుడు, అల్లుడు అయ్యాడని తెలుపబడింది.
ఈ విధంగా శ్రీసుబ్రహ్మణ్యుడు శైవానికి, వైష్ణవానికి సబంధించినవాడని తెలుసుకోవాలి.
ఐతే, ఉత్తరభారతంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గృహస్థుడుగా కాక నిరంతర బ్రహ్మచారిగా వ్యవహరింపబడుతున్నాడు. అక్కడ ఆయనకు కార్తికేయుడు అన్న పేరే ప్రసిద్ధమైనది. కుమారస్వామి అన్న పేరు కూడా వారికి
విదియమైనదే. కాళిదాసు మహాకవి సంస్కృతంలో కుమార సంభవమనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రస్తావన మొదట వాల్మీకి రామాయణంలోనే వచ్చినది. బాలకాండంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కంధుని జన్మవృత్తాంతము తెలియజేస్తాడు. ‘కుమారా స్సంభవ శ్చైవ ధన్యః పుణ్యస్తధైవచ’ అని వ్రాయబడింది. వాల్మీకి మహామునికి సాధారణంగా రామాయణ సర్గల పారాయణానికి ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు. కాని, ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు. వాల్మీకి బాలకాండంలోనే ఉపయోగించిన కుమార సంభావమను రెండు పదాలను మహాకవి కాళిదాసు మంగళవాక్యంగా భావించి తన గ్రంథమునకు కుమార సంభవమను పేరు పెట్టాడు.
స్కందుడన్న పేరు కూడా శ్రీ స్వామి వారికి ప్రసిద్ధమైనది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు. స్కందుడను పేరును మనస్సులో ఉంచుకొని శ్రీవ్యాసులవారు స్కంద పురాణాన్ని రచించారు. ద్రవిడ భాషలో స్కందుడను పదమునకు వికృతి కందుడు.
మాతృదేవోభవ, పితృ దేవోభవ అనేవి వేద శానములు. శివ, శక్తులు మాతాపితలుగా వేర్వేరుగా కాక అర్థనారీశ్వర రూపంలో కలిసి ఉన్నారు. సత్ పరేమేశ్వరుడు కాగా చిత్ అంబిక. ఈ సత్ చిత్ రెండును ఏకము కాగా ఆనందం ఉద్భవించింది. ఆ సచ్చిదానందమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శివమనే మంగళం, అంబిక అనే కారుణ్యం కలిసిన రూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు.
శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభూవము గలడు. తిథులలో అరవది షష్టి. ఆయన జన్మతిథి కూడా అదే. షష్ఠి ప్రియుడు, షడాననుడు అనగా ఆరు ముఖములుగలవాడు. ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ”. ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది.
ఇట్టి విశిష్ట జ్ఞానస్వరూపుడగు శ్రీసుబ్రహ్మణ్యుని ఆరాధన సర్వానర్థాలను తొలగించి, సర్వాభీష్టసిద్ధిని కలిగించి జ్ఞానసంపన్నులను చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
శీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శివ శక్తులకు జన్మించిన తిథి మార్గశిరశుద్ధ షష్ఠి. మహనీయులు జన్మలు లోక కంటకులను నిర్మూలించి, సజ్జనులను కాపాడటానికేనన్న విషయం లోక విదితమైనదే. తారకాసుర, శూర పద్మాసురాది రాక్షసులను దునుమాడుటకై కార్తికేయుడు ఉద్భవించాడు. ఆ మహామహితాత్ముడు జన్మించిన రోజును శ్రీసుబ్రహ్మణ్యషష్ఠియని స్కందషష్ఠియని, సుబ్బారాయుడి షష్ఠి అని, కుమారషష్ఠియని వ్యవహరిస్తారు.
భవిష్యోత్తరపురాణం ప్రకారం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనాధిపతిగా 5 రోజులు భీకరమైన పోరాటం సాగించి ఆరవరోజు యుద్ధంలో తారకాసురాది రాక్షసులను సంహారించి పదునాల్గు భువనాలకు సంతోషాన్ని కలిగించాడు. ఆయన అసాధారణ శక్తి సామర్థ్యాలను త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు కొనియాడారు. శ్రీస్వామివారు లోక సంరక్షణార్థమునకు శాటి స్థాపనకు చేసిన కృషికి గుర్తింపుగా మార్గశిరశుద్ధషష్ఠి ఆయన జన్మదినంగా పరిగణించి, వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి షష్ఠి వరకు నిర్వహిస్తారు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు దేవసేనను షష్ఠి రోజునే పరిణయం చెసుకొన్నారు.
శ్రీవేదవ్యాసభగవానులు షష్ఠి ప్రాముఖ్యతను తెలియ జేస్తూ తస్మాత్ షష్ఠీ మహాతిథిః అని అన్నారు.
షష్ఠి రోజున ఉపవాసముండి షణ్ముఖూని పూజించి బ్రహ్మచారికి వస్త్రదానమిచ్చి భోజనం పెట్టి ఆనందింప జేయాలి. కొంతమంది శ్రీస్వామివారిని సర్పాకారంగా ఆరాధించి పుట్టలో పాలు పోస్తారు.
కుజదోషమున్నవారు ఆ రోజున ఉపవాసముండి, సర్పదేవతను ప్రార్థించి పుట్టలో పాలుపోసి తమ దోషాలను పోగొట్టమని శ్రీస్వామివారిని వేడుకొంటారు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చాలామంది సర్పాకారంలో పూజిస్తుంటారు. ఇందువెనుక కొన్ని జ్యోతిశ్శాస్త్ర అంశాలున్నాయి. ఈయన మేష లగ్నం, వృశ్చిక రాశిలో జన్మించాడు. వృశ్చికరాశి జలరాశి అని కూడా పేర్కొనబడినది. శరవణ తటాకంలో జన్మించాడు గదా! మేష రాశికి అధిపతి కుజుడు. పురుషత్వానికి ప్రధాన కారకుడు శ్రీస్వామి శివతేజంవల్ల జన్మించాడు కావున అగ్ని స్వరూపుడు. అగ్నిధరుడని కూడా అంటారు. కుజునకు అధిష్ఠాన దేవత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ఆయనను సేవిస్తే తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది.
ఇక, షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మన శరీరంలోని షట్ చక్రాలు. వృశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో శ్రీస్వామివారు కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగ భూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్ప రూపంలో పూజిస్తారు.
ప్రాణశక్తి మన శరీరంలో మూలాధారమనే చోట సర్పరూపంలో కేంద్రీకరింపబడి ఉంటుంది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది నిద్రిస్తున్న సర్పము వంటిది. దానిని తట్టి లేపుటకు అసాధారణమైన యోగసాధన అవసరం.
ఒక వ్యక్తి యోగాభ్యాసం చేస్తూ నేలపై కూర్చుండి యుండినపుడు అతని ఆకారం యోగ పరంగా గమనిస్తే పాము శరీరంలాగా ఉంటుంది. ఇలా కనిపించడంలో ప్రతిపక్షవ్యక్తి జ్ఞానపరంగా అభివృద్ధి చెంది, యోగాభ్యాసం చేసి తరించాలన్నది దానిలోని అంతరార్థం. మన శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఆరు ఉన్నట్లు యోగశాస్త్రం చెబుతుంది. ఈ ఆరింటిలో మూలాధార చక్రంలోనే ప్రాణశక్తి ఉంటుంది. అది సర్ప రూపంలో వుంటుంది. స్వప్నావస్థలో నున్నందున దాని శక్తి మనకు తెలియదు. యోగాభ్యాసం ద్వారా చేసే సాధనవల్ల మనం గొప్ప జ్ఞానశక్తిని సాధించి స్వప్నావస్థలోనున్న జ్ఞానశక్తిని లేపగల్గినపుడు అసాధారణ జ్ఞానం సిద్ధించి పరమానందం కలుగుతుంది.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ఆరు అంకెతో సంబంధముంది. ఆయన షణ్ముఖుడు. సహజంగా జ్ఞానస్వరూపుడు. యోగమూర్తి. పూర్వజన్మలో సనత్కుమారులుగ జన్మించిన బ్రహ్మమానసపుత్రుడు. నిరంతర తపస్సమాధిలో వుంటూ ఈ సృష్టిలోనే దేనినీ బేధభావంతో చూడక, వేదమూర్తిగా భాసించాడు. అదే ప్రవృత్తి ఈ జన్మలోనే సిద్ధించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిరంతరం జ్ఞాననిష్ఠలో వున్న భక్తులను రక్షిస్తూనే వుంటాడు.

No comments:

Post a Comment