శృంగి శాపం-శ్రీ మహాభాగవతము

ఒక రోజు పరీక్షిత్తు వేటకని వెళ్లి ఒక లేడి వెంటబడి చాలా దూరం వెళ్లాడు. దారి తప్పి, తిరిగి తిరిగి అలసి సొలసి పోయాడు.దాహం,ఆకలి బాధించ సాగాయి. అప్పుడు యెదురుగా ఒక ఆశ్రమం కనపడింది. అటు పరుగు పరుగున ఆశగా దారి తీసాడు. లోనికి వెళ్లి ఎవరేనా ఉన్నారా? అని కేక వేసాడు. జవాబు లేదు.
బయటకు వచ్చి కలియ చూసాడు. వెనుకన ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. అతను శ్వాసను బంధించి గాఢ సమాధిలో ఉండి, మన లోకంలో లేనేలేడు. అతని జుత్తు సంస్కారం లేక జడలు కట్టి ఉన్నది. లేడి చర్మం ధరించి ఉన్నాడతడు. పరీక్షిత్తు అతనిని దాహ మడిగాడు. ఆ ఋషి నుంచి జవాబు లేదు. మళ్ళీ మళ్ళీ అడిగి చూసాడు. ప్రయోజనం లేకపోయింది.
దప్పిక బాధలో, అహం మొలకెత్తింది. రోషం వచ్చింది. తను యేం చేస్తున్నాడో తనకే తెలియని స్ద్హితిలో, ఎదురుగా ఒక చచ్చిన పాము పడి ఉంటే, దానిని ఓ బాణంతో తీసి ఆ ఋషి మెడలో వేసి అక్కడ నుంచి పరీక్షిత్తు వెళ్లిపోయాడు. అంత జరుగుతున్నా, తపోనిష్ఠలో ఉన్న శమీక మహర్షికి యేమీ తెలియలేదు.
శమీకునికి శృంగి అనే కొడుకు ఉన్నాడు. వాడితో ఆడుకునే పిల్లలలో కొందరు వాడి దగ్గరకు వెళ్లి,"నీ తండ్రి పాముల శవాలని మోసేవాడు" అని హేళన చేస్తే, యింటికి వచ్చి , తపం చేసుకుంటున్న తన తండ్రి మెడలో ఉన్న చచ్చిన పాముని చూసాడు. ఉక్రోషం వచ్చింది. ముని కమారుడు కదా! దివ్య దృష్టితో చూడగా జరిగినది కనపడింది. వెంటనే, "ఓ కనులు నెత్తికొచ్చిన రాజా, నీకిదే శాస్తి . నేటికి వారం రోజులలో భయంకర నాగరాజు తక్షుకుడి కాటుతో చచ్చెదవు గాక " అని పరీక్షిత్తుని శపించాడు.
ఆ తరువాత తండ్రిని పట్టుకుని వల వల యేడ్వసాగాడు. అది తన తపోభంగం కావించింది కనుక శమీకుడు కనులు తెరిచి తన మెడలోని పాముని మెల్లగా పక్కకి పడేసి, "ఎందుకేడుస్తున్నావు బాబు " అని అడిగాడు. జరిగినది శృంగి చెప్పాడు. అది వినగానే తన కొడుకు మీద కోపం వచ్చి, "ఎంత మూర్ఖుడవయావు? ఆ రాజు ఎవరనుకున్నావు? మనలను పాలించే పరమ ధర్మమూర్తి . మంచి యోగ్యుడైన రాజు. అతడు కడుపులో ఉన్నప్పుడే ఆ మహా విష్ణువు రక్షను పొందాడు కనుకనే అతనికి విష్ణురత అనే పేరు వచ్చింది. నీ తొందరపాటు చేత ఇన్నాళ్ళూ కలి నుంచి ప్రజలనందరినీ కాపాడినవాడు అంతమవుతున్నాడు. పాపం దప్పిక భాదలో ఉంటూ నన్ను నీరు కావాలని అడిగాడు. నే పలుక లేదని వచ్చి చిలిపి రోషంలో యేదో ఒక చిన్న తప్పు చేసాడు. ఆ మాత్రానికే అంత ఘోరశాపం యివ్వాలా? "నువ్వీ తక్షణమే యిక్కడ నుంచి నిష్క్రమించి నీ మనసుని నిగ్రహించుకో గలిగే శక్తి పొందడానికి తపస్సు చేసుకో. నేనిప్పిడు కనీసం ఆ మహారాజుకి తనకు వచ్చే ముప్పును చెప్పి, అతను దానికి సిద్ధంగా ఉండేందుకు అవకాశమిస్తాను." అని తన కొడుకుని పంపించేసాడు.

No comments:

Post a Comment