ప్రశాంతతకు చిహ్నం "శ్రావణ బెళగొళ"


భక్తి's photo.


భక్తి's photo.


భక్తి's photo.

చంద్రగిరి, ఇంద్రగిరి అనే రెండు కొండల నడుమ ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ". ఇక్కడే అపర బలశాలి, సర్వసంగ పరిత్యాగి అయిన "బాహుబలి" నిలువెత్తు విగ్రహం నెలవై ఉంటుంది. కన్నడ భాషలో "బెళ్ళి" అంటే తెల్లని అని, "గొళ" అంటే నీటి గుండం అని అర్థం. జైనుల సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని విడచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజ్యులైన వారిని శ్రమణులు అని అంటారు.
అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో వారి శేషజీవితాన్ని గడిపి నిర్వాణం పొందేందుకు బెళగొళ పరిసర ప్రాంతాలలో నివసించేవారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను "శ్రమణ బెళగొళ" అనేవారు. అదే క్రమంగా "శ్రావణ బెళగొళ" వాడుకలోకి వచ్చింది. అయితే స్థానికులు మాత్రం బెళగొళ అనే పిలుస్తారు.
ఎలా వెళ్ళాలంటే...
రోడ్డు మార్గంలో అయితే, బెంగళూరు నుంచి హాసన్‌ మార్గంలో హిరిసావె నుంచి 11 కిలోమీటర్ల ప్రయాణిస్తే, శ్రవణబెళగొళను చేరుకోవచ్చు.ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రైలు మార్గంలో అయితే... హసన్ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక ఆకాశమార్గంలో అయితే, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరాల్సి ఉంటుంది.
లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా జైనతీర్థంకరుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి. గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు. ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజధాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకులకు రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.
భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టం వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు.
భక్తి's photo.
ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు బాహుబలి. ఇంద్రగిరి కొండపై ఆయన తపస్సు చేసి మోక్షం పొందారు. ఈ ప్రాంతంలోనే గోమఠేశ్వర ఆలయ నిర్మాణం జరిగినట్లు స్థానికులు భావిస్తుంటారు.
ఇక్కడ నెలవైన 58 అడుగుల "గోమఠేశ్వరుని" విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకీ పెద్దది. క్రీ.శ. 983వ సంవత్సరంలో "చాముండరాయ" అనే మంత్రి ఈ విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనినే గోమఠేశ్వర ఆలయంగా పిలుస్తుంటారు.
"బాహుబలి"గా పిలువబడే గోమఠేశ్వరుని విగ్రహం చెక్కడంలో శిల్పి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూసి తరించాల్సిందేగానీ, మాటల్లో వర్ణించలేనిది. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వాదానికి అద్దంపట్టేలా ఉంటుంది.
ధ్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు, బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు, వాటిచుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా తీర్చిదిద్దారు. మనం గనుక బాహుబలి విగ్రహం వద్ద నిలబడితే, ఆయన పాదం ఎత్తుకు సరిపోతాం.
ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం. ఈ అభిషేకం సందర్భంగా గోమఠేశ్వరుడికి క్యాన్లకొద్దీ తేనె, పెరుగు, అన్నం, కొబ్బరిపాలు, నెయ్యి, చక్కెర, బాదంపప్పు, కుంకుమపువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్...లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో పన్నెండు రోజుల పాటు నిర్వహించే అభిషేకాల్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

No comments:

Post a Comment