తులసీదాసు

ఆత్మరామ్‌ ఒక బీద బ్రాహ్మణ కుటుంబీకుడు. తని భార్య హులసి. దారిద్ర్యంలో ఆత్మరామునకు అతని భార్యయే ఒక సంతృప్తి. వారికి జన్మించిన బాలునికి జన్మ సమయమందే దంతములున్నాయి. అట్లు జన్మించుట మాతాపితరులకు గండమని జ్యోతిష్యులు చెప్పారు. వారన్నట్లే అనతి కాలంలో బాలుని తల్లి హులసి మరణించింది. ఆమె మరణంతో ఆత్మారామ్‌ కృంగిపోయాడు. ఈ పిల్లవాడంటే అతనికి అనురక్తి, ప్రేమ క్రమంగా తగ్గింది. ఇరుగు పొరుగువారి సహాయంతో ఆ పిల్లవాడు పెరిగాడు. కాని ఆ అభాగ్యుడు ప్రేమ ఆదరాలకు ఏ మాత్రం నోచుకోలేదు.
ఒకనాడు ఆ గ్రామనికి సన్యాసులు కొంతమంది వచ్చారు. వారిలో ఒకడు బాలుడైన తులసీదాసుని ఆప్యాయంగా పలుకరించాడు. అంతే తులసీదాసు వాని వెంట ప్రయాణమైనాడు. వారు కాశీ చేరారు. అక్కడ ఒక పండితుని వద్దకు తీసుకువెళ్ళి ఆ సన్యాసి తులసీదాసును అతనికి వప్పగించి విద్యాబుద్ధులు గరపమని కోరాడు. సజ్జనుడైన ఆ పండితుడు తన కుమారునితో తులసీదాసుకు విద్యను బోధించాడు. సూక్ష్మగ్రాహియైన తులసీదాసు అతని వద్ద సంస్కృతమును చక్కగా అభ్యసించాడు. చిన్ననాటినుండి బీజ రూపంగా అతనిలో నున్న రామభక్తి మొలకెత్తనారంభించింది. తులసీదాసుకు ఆ ఇంటిలోని వారందరూ ఎంతో ఆదరంతో చూడసాగారు. అతని స్నేహశీలతకు, సచ్చీలమునకు సూక్ష్మబుద్ధికి సంతసించి ఆ పండితుడు తన కుమార్తె రత్నావళిని తులసీదాసున కిచ్చి వివాహం చేసాడు.
రత్నావళి సౌందర్యవతి. శ్రీరాముని ఎడ భక్తి భావం కలది. భర్తను ప్రేమగా లాలించేది. ప్రేమంటే చిన్ననాటి నుండి ఎరుగని తులసీదాసు హృదయం పరవళ్ళు ద్రొక్కింది. ఆమె అతని ఆరాధ్య దేవత. ఆమెను విడిచి ఉండలేడు. ఒకనాడు తులసీదాసు మిత్రులతో విహారం వెళ్ళాడు. అదే సమయంలో రత్నావళి సోదరుడు వచ్చి ఆమెను తన ఊరు రమ్మన్నాడు. సన్నిహిత పరిచయం వలన అతని అనుమతికై వేచియుండక అతనికి ఒక జాబు వ్రాసి ఉంచి రత్నావళిని తన వెంట తీసుకువెళ్ళాడు. ఆనాటి సాయంత్రం ప్రొద్దుపోయిన తర్వాత తులసీదాసు ఇంటికి చేరాడు. భార్య ఇంటియందు లేదు. జాబు చూచుకున్నాడు. ఇంటివద్ద తానున్నచో ఆమెను పంపకుండెడివాడు. ఆమె లేని ఇల్లు అతనికి దుర్బరం. వెంటనే అతను కూడా బయల్దేరాడు. మార్గమంతా చీకటి. మర్గమధ్యం చేరేసరికి చీకటికి తోడుగా గాలివాన ప్రారంభమైంది. పొదలు ముళ్ళతో శరీరం గీచుకుపోయింది. బట్టలు తడిసిపోయాయి. బురదలో పడుతూ లేస్తూ గ్రామం చేరాడు. బావ మరిది ఇంటివద్దకు వెళ్లగా తలుపులు వేసి ఉన్నవి. అందరూ గాఢ నిద్రలో నున్నారు. అందరి నిద్రా భంగము చేయుట కాతని మనస్సు అంగీకరించ లేదు. రత్నావళి నిద్రించు గది అతడెరుగును. ఆ గది సమీపంగానున్న ప్రహరీగోడ వద్దకు చేరుకున్నాడు. అచట వ్రేలాడుచున్న తాడువంటిదానిని ఊతంగా అతడు ప్రహరిగోడ దుమికి తలుపు తట్టాడు. రత్నావళి తలుపు తెరిచి భర్తను చూచి చకితురాలైంది. "ఈ రాత్రివేళ గాలివానలో ఇక్కడకు వచ్చారా? లోపలకు ఎట్లా వచ్చారు?" అని ప్రశ్నించింది. అ ప్రశ్నలోని ఈసడింపు, వ్యంగ్యము అర్థమై అతని మనస్సు చివుక్కుమన్నది. తన బహిః ప్రాణంగా చూచుకుంటున్న తన భార్య అన్న మాటలకు అతని హృదయం గాయమైంది. ఐనప్పటికి "ప్రేయసీ! నా అగమనాభిలాషియై గదా నీవు ప్రహరీ గోడ వద్ద తాడును ఏర్పాటు చేసింది!" అని ప్రశ్నించాడు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. ఇద్దరూ దీపం తీసుకుని గోడవద్దకు వెళ్ళి చూచారు. ఆ వ్రేలాడునది తాడు గాదు - త్రాచుపాము. అతడు మ్రాంపడిపోయాడు. పొడి వస్త్రములు ధరించిన తర్వాత ఆమె అతనిని సుఖాసీనుని చేసి -
"స్వామీ! నా పై మీరు చూపిన ప్రేమలో ఒక వంతైనా జగద్రక్షకుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఎడ చూపినచో మీరు ఈ సంసార సాగరమును తరించెడివారు. నా జీవితము కూడ ధన్యమయ్యెడిది కదా! ఆ స్వామి కృపవలననే మీరు ఇంకనూ సజీవులైయున్నారు". అని నుడివెను. ఈ హిత వాక్యములు పల్కునపుడు రత్నావళి అతనికి సాక్షాత్తూ జగన్మాతగా గోచరించింది. ఆ మాటలు అతని హృదయమున గాఢముగా నాటుకొనెను. మారుమాటాడక అతడు నిద్రించెను. మరినాటి ఉదయముననే లేచి అతడు మౌనముగా కాళీ ప్రయాణమైనాడు. కాళీ యందు ఒక ప్రశాంత స్థలమున రామనామము జపించి - తర్వాత జగత్ర్పసిద్ధమైన "రామచరిత మానస్‌" అని రామాయణమును రచించెను.
అశాశ్వతమైన వస్తువులపై, మమకారముకన్న మోక్షప్రదాత శ్రీరామచంద్రుని ఎడ ప్రేమ మేలుగదా!


No comments:

Post a comment