భాస్కరారాధనమున ఎట్టి రోగాములైన పటాపంచలై ఆరోగ్యము ప్రాప్తించుననుట కెన్నో కథలు గలవు

పూర్వము భద్రేశ్వరుడను రాజు మధ్యదేశమును పాలించుచుండెను. అతని కుడిచేతియందు తెల్లకుష్టు జనించెను. అది గ్రహించిన ఆ నృపాలుడు ఇది నా పూర్వజన్మ కృత పాప ఫలమని తలచి మిక్కిలి విచారించి ఏదేని తీర్తమందు దేహత్యాగము చేసుకొనుటకు నిశ్చయించుకున్న సమయమున పండితులైన బ్రాహ్మణులు రాజుగారి సన్నిధిని జేరి నీవు ధర్మాత్ముడవు నీవంటి ఉత్తముడు దేశమును విడిచిపెట్టుట న్యాయము కాదు. అట్లు గావించిన ఈ ప్రజల దుస్థితి ఏమని చెప్పగలము?
కావున మీరు సంకల్పించిన దానిని విడిచిపెట్టి శ్రీ సూర్యభగవానునారాధింపుడు అని పలికిరి. అంతట ఆ రాజు వారివలన భాస్కరారాధన విధమును తెలుసుకొని ఒక సంవత్సరకాలము సూర్యునుపాసించెను. అప్పుడు తన కరమందలి కుష్టు మాయమగుట నృపతి విస్మయమొంది ఇకపై రవిని గొలుచుట విడువలేదు. రాజు సేవలకు గ్రహరాజు సంతోషమొంది ప్రత్యక్షమై వరకు కోరుకొమ్మనెను. ప్రభూ! భానుదేవా! నన్ను నీలోకములో నివసించునట్లు అనుగ్రహింపుము, అని వరమడిగెను. దివాకరుని కరుణ వల్ల భద్రేశ్వరుడు అవసాన కాలమున సపరివారముగ సవితృలోకమును జేరి సుఖమొందెను. భాస్కరారాధనమున ఎట్టి రోగాములైన పటాపంచలై ఆరోగ్యము ప్రాప్తించుననుట కెన్నో కథలు గలవు. పద్మపురాణాంతర్గతమిది

No comments:

Post a Comment