సృష్టికి ఆది, అనాది ఓంకారమని భారతీయులు ఏనాడో కనుగొన్నారు

సృష్టికి ఆది, అనాది ఓంకారమని భారతీయులు ఏనాడో కనుగొన్నారు. ఈ సత్యాన్ని విశ్వానికి చాటి చెప్పారు కూడా. "శబ్ద గుణకం ఆకాశం". శబ్దం ఆకాశం గుణం. అక్కడ నిరంతరం ధ్వనించేది ఓంకారమే. ఓంకారం నుంచే సమస్త శబ్దమూ ప్రభవించింది. ప్రపంచంలో ఏ దేశానికీ అక్షర జ్ఞానం కలుగాకముందే, ఈ రహస్యాలను భారతీయులు కనుగొన్నారు. వాటిని దాచుకోకుండా విశ్వానికి అందించారు. ఇంకా అనేకానేక విశేషాలను, వింతలను, విచిత్రాలనూ ప్రపంచానికి తెలియజేశారు. ఈ భూమిమీద సంచరించే మానవుడికీ, కాలానికీ గల సంబంధాన్ని కూడా స్పష్టంగా ఫలితాలకు సంబంధించిన వాస్తవాలను కనుగొన్నారు.
భారతీయుల దృష్టిలో క్యాలెండర్ అంటే కాల ప్రవాహానికి అంకెలు దిద్దడం మాత్రమే కాదు. ఏకాలంలో ఏ పనులు చేయాలో సూచించే మార్గదర్శి కూడా. ఖగోళశాస్త్రం నిజమే కానీ, జ్యోతిష్య శాస్త్రం తప్పని వాదించే వారు ఏ పరికరాలూ లేకుండానే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను, గ్రహణాలను మన పూర్వీకులు అంత నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ఎలా చెప్పగలిగారో ఊహించగలరా? అలాగే జ్యోతిష్య శాస్త్ర మూలాలను కూడా ఎవ్వరూ ఊహించలేదు.
శనైః చరః కలిపి శనైశ్చరః అంటే మందకొడిగా చరించేవాడు. నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. అందుకే శనికి మందుడు అని మరో పేరు కూడా ఉంది. భూ కేంద్రం ఆధారంగా చూసినప్పుడు సూర్యుడు సుమారు నెల రోజులలో 30 డిగ్రీలు కదిలితే, శని అంతే కోణాన్ని దాటడానికి రెండున్నరేళ్ళు పడుతుంది. ఇదంతా గణితబద్ధమైన శాస్త్రం. ఇక కథలోకి వస్తే సూర్యుడికి, ఛాయకు పుట్టిన వాడే శని అనీ, ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా దూరం ఉందని చెబుతారు. శని నల్లగా ఉంటాడు. అని చెప్పడానికి కారణం తెలుసా? సూర్యుడికి దూరంగా ఉన్న కారణాన సూర్యకిరణాలు తక్కువగా పడడం వల్ల కొంత ఛాయ కమ్ముతుంది. అందుకే నీలాంజనుడని శనిని వర్ణిస్తారు.
శని యోగించిన వ్యక్తికి జీవితం ఉజ్వలంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలనూ, సంస్థలనూ వ్యవస్థలనూ నిర్మించిన వారంతా శని అనుగ్రహ వీక్షణకు పాత్రులైన వారే. పెద్ద పెద్ద శాస్త్ర సత్యాలను కనుగొన్న వారూ, ఘన విజయాలను సాధించిన వారందరూ శని చల్లని చూపుతో ఉన్నతిని పొందిన వారే. ఉన్నత పదవులు వరించాలన్నా, అధికారం లభించి ప్రజాసేవతో శాశ్వత కీర్తిని గడించాలన్నా శని సానుకూలత తప్పనిసరి.
అయితే మనకు సంక్రమించే ఈ ఫలితాలకు శనిని కర్తగా భావించడమే చదువరులు చేసే తప్పు. అతడు ఎవరి కర్మఫలాలను వారికి నిష్పాక్షికంగా అందించే న్యాయమూర్తి. మన న్యాయమూర్తులు తప్పు చేసిన వారిని శిక్షించగలరు. సమాజానికి మేలు చేసిన వారిని సన్మానించే అధికారం వారికి లేదు. శనికి అలాంటి పరిమితులు లేవు. శిక్షనూ, సన్మానాన్ని రెండింటినీ సమానంగా అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. పాపులను క్షమించి, అధర్మాన్ని కాపాడడం, తన వైపునకు ఫిరాయిస్తే కానుకలను ఇస్తానని ఎరవేసి, మోసం చేయడం శనీశ్వరునికి తెలియదు.
భూగర్భ జలాన్ని తోడి ఓవర్ హెడ్ ట్యాంకులో నింపుతాము. తిరిగి వాటిని మనం వాడుకుంటాం. అలాగే కర్మలు కూడా మనం పోగుచేసుకున్నవే. వాటి ఫలితాలను ఎవరివి వారికి నిష్పాక్షికంగా తిరిగి ఇవ్వడమే శని కర్తవ్యం. అందువల్లనే ఎవరికైనా శని చెడ్డ చేస్తాడు అంటే అది ఘోరతప్పిదమే. శని ఒకరికి మంచి చేస్తాడు, మరొకరికి చెడ్డ చేస్తాడు అని అనుకుంటే అది తీవ్ర అపచారం కూడా. పరిశుద్ధుడు, పారదర్శకుడు శని. నిరంతరం ఓంకార స్మరణతో ఈశ్వర ధ్యానంలో ఉంటాడు శని. అతి గొప్ప యోగాలను ఇచ్చే శక్తి ఆయనకు కలగడానికి కారణం ఓంకార స్మరణమే. నేడు శని గ్రహంలో ఓంకార ధ్వని ప్రబలంగా వినవస్తోందని నాసా శాస్త్రాజ్ఞులు వెల్లడించిన సత్యం కూడా అదే. శని ధ్యానిస్తున్న ప్రణవాన్ని మనమూ ధ్యానించడం ద్వారా క్రమంగా కర్మ రాహిత్యాన్ని, మోక్షాన్ని పొందగలుగుతాము. ఈ సత్యాన్ని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కనుగొని ప్రపంచానికి వెల్లడించడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. కానీ, నాసా శాస్త్రజ్ఞులు కనీసం శనైశ్చరుని ప్రణవోపాసనను వెల్లడించడంతో, ప్రపంచానికి భారతీయులు ఏనాడో అందించిన సత్యాన్ని నెమరువేసుకునే అవకాశం లభించింది.


NASA Official Saturn Audio Recording 2003


No comments:

Post a Comment