మాఘస్నాన ఫలం-మాఘ పురాణంలో తొలి అధ్యాయంలోని కథ

మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ వరుసలోనే మాఘ పురాణంలో తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది. రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.
అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.
ఇది మాఘ పురాణంలో తొలి అధ్యాయంలోని కథ. ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఓ మాట చెప్పాడు. మాఘ స్నానం చెయ్యటం, తెలియని వారికి దాని విశేషం తెలియచెప్పి చేయించటం, ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందటం కూడా శ్రేయస్కరాలు అంటాడు సూతుడు. దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే. ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల, నియమ ప్రకారం ఉదయం కాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుంది.

No comments:

Post a Comment