శ్రీ వసుదేవుడు

వసుదేవుడు పరమభాగవతోత్తముడు. అతడు మహాపరాక్రమశాలియైన శూరసేనునికుమారుడు. దేవకుని ఏడుగురుబిడ్డలను ఇతడు వివాహమాడెను. రోహిణియు ఇతని భార్యయే. దేవకీదేవి దేవకుని చిన్నబిడ్డ. ఉగ్రసేనుని పెద్దకుమారుడు కంసుడు. అతని పినతండ్రి కూతురు దేవకి. దేవకీవసుదేవుల వివాహానంతరము కంసుడు వారిని తనరథముపై తీసుకొను వెళ్లుచుండెను. అప్పుడు మార్గమధ్యమున ఆకాశవాణి ఇట్లు పలికెను. "ఓరీ మూర్ఖుడా! కంసా! నీ చెల్లెలిని మిక్కిలి ప్రేమతో రథముపైగొని పోవుచున్నావు. ఆమె యొక్క ఎనిమిదవ సంతానమే నీపాలిట మృత్యువగును". అజ్ఞానికి చావుఅనిన మిక్కిలి భయముగదా! కనుక కంసుడు ఆకాశవాణి పలుకులు వినగానే కంపించిపోయెను. వెంటనే అతడు తనఖడ్గమును పైకెత్తి దేవకిని చంపబోయాడు.
అప్పుడు వసుదేవుడు అతనికి నచ్చజెప్పుచు ఇట్లు నుడివెను. 'ఓ రాజకుమారా! నీవు భోజవంశమున జన్మించినవాడవు. నీవు నీవంశముయొక్క కీర్తిప్రతిష్ఠలను పెంపొందింపజేయగల సమర్థుడవు. గొప్పగొప్ప వీరులు, శూరులుగూడ నీ గుణములను కొనియాడుచుందురు. ఈమె ఒకఅబల, పైగా నీచెల్లెలు, ఈ శుభసమయమున ఈమెను వధించుట నీకు శ్రేయస్కరముగాదు. జన్మించినవాడు మరణించుట సహజము. నేడుగాకపోయిననూ, వందసంవత్సరముల తరువాతనైనను ప్రతివ్యక్తియు మరణించుట తథ్యము. దీనిని ఎవ్వరునూ ఆపజాలరు. మానవులు తనకు అపకీర్తినితెచ్చిపెట్టెడి ఏ పనినీ చేయరాదు. నీకు ప్రమాదము ఏర్పడుట దేవికీ పుత్రులవలననే గాని, దేవకివలన కాదుకదా! కావున ఈమెకు కలిగిన ప్రతిసంతానమును నీకు అప్పగించెదనని వాగ్దానము చేయుచున్నాను". వసుదేవుని మాటలపై కంసునకు విశ్వాసము కుదిరెను. అందువలన అతడు దేవకిని చంపెడి ప్రయత్నమును విరమించుకొనెను. కాని అతడు ఆ దంపతులను చెఱసాలలో పెట్టించెను.
వసుదేవుడు తాను మాటఇచ్చిన ప్రకారము దేవకీదేవికి కలిగిన మొదటి సంతానమును కంసునకు అప్పగించెను. వసుదేవుని సత్యనిష్ఠకు మెచ్చుకొని, కంసుడు ఆ శిశువును ఆయనకే తిరిగిఇచ్చెను. కాని నారదుని ప్రేరణతో అతడు మఱల ఆ బాలునితీసికొని సంహరించెను. ఆ దంపతులకు వరుసగా కలిగిన ఆఱుగురుశిశువులను అట్లే కంసుని క్రూరత్వమునకు బలియైరి. ఏడవసారి దేవకీగర్భస్థశిశువైన బలరాముని యోగమాయ రోహిణీగర్భమున చేర్చెను. దేవకీదేవియొక్క అష్టమగర్భమున జగద్రక్షకుడైన శ్రీకృష్ణభగవానుడు జన్మించెను. భగవానుని ఆదేశముతో వసుదేవుడు ఆ శిశువును వ్రేపల్లెలోని నందుని భవనమునకు చేర్చెను. అచటినుండి యశోదకు జన్మించిన శిశువును( బాలికను) దీసుకొని చెఱసాలకు చేరెను. కంసుడు ఆ బాలికను చంపబోగా ఆమె అతని చేతులనుండి తప్పించుకొని ఆకాశమున నిల్చెను. ఆమె అష్టభుజరూపమును ధరించి "ఓరీ! కంసా! నిన్ను చంపెడి వాడు మఱియొకచోట పెరుగుచున్నాడు". అని పలికి అంతర్ధానమయ్యెను.
వ్రేపల్లెలోనున్న శ్రీకృష్ణ బలరాములను తుదముట్టించుటకు కంసుడు చేసిన ప్రయత్నాలు అన్నియును నిష్పలములాయెను. చివరకు శ్రీకృష్ణుని చేతిలో కంసుడు మృతిచెందెను. భగవంతుని పునరాగమనమునకై నిరీక్షించుచున్న దేవకీవసుదేవుల దీర్ఘకాలికసాధన ఫలించెను. శ్రీకృష్ణుడు తనతల్లిదండ్రుల చేతులకు గల సంకెల్లను తొలగించి, వారి పాదములకు ప్రణమిల్లెను. చిరకాలమునుండి తనకు దూరమైనపుత్రులను కలిసికొని దేవకీవసుదేవులు మిగుల సంతసించిరి. భగవంతుని ప్రేమమయమైన పలుకులను విని వసుదేవుడు తనభాగ్యమునకు ఎంతయు సంతసించెను. వారిని తన హృదయమునకు హత్తుకొనెను. బలరామకృష్ణులును సర్వదా ఆయనను ఆదరించుచుండిరి. నిత్యము ప్రాతః కాలమున నిద్రనుండి లేవగానే ఆయనకు పాదాభివందనమును ఒనర్చుచుండిరి. ఋషులు కురుక్షేత్రరణరంగమున వసుదేవునితో "ఓ మహానుభావా! శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా పరబ్రహ్మము". అని పల్కిరి. ఆ కృష్ణభగవానుడు తనతండ్రియైన వసుదేవునకు తత్త్వజ్ఞానమును ఉపదేశించెను. చివరకు ఆ పరమాత్మ ప్రభాసతీర్థమున తనఅవతారమును చాలించునప్పుడు వసుదేవుడుగూడా ఆ స్వామితో పరంధామమునకు చేరెను.

No comments:

Post a comment