వివాహము - తల్లితండ్రుల బాధ్యత

ప్రతి తల్లి, తండ్రి వాళ్ళ పిల్లల వివాహాల విషయంలో బాధ్యత వహించి యుక్త వయసు వచ్చిన తరువాత వారి వారి పిల్లలకు చక్కటి సంబంధాలు వెతికి వివాహము చేయడానికి పూనుకోవాలి.
అబ్బాయిల విషయంలో అతనికి యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహము అన్నా చేసుకోవాలి లేదా అతను సన్యాసం అన్నా స్వీకరించాలి, అంతే కాని వివాహం కాకుండా అలా బ్రహ్మచారిగా ఉండడానికి వీలులేదు. సన్యాసం స్వీకరించడం అంటే అది ఎవరో కొంతమంది మహానుభావులకు తప్పితే అన్యులకు సాధ్యము కాదు. కాబట్టి ప్రతివారు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం ద్వారా ధర్మ, అర్ధ, కామములను, ధర్మ బద్ధమైన బంధంతో వాటిని అధిరోహించి తద్వారా మోక్షాన్ని పొందాలి అని శాస్త్రాలు బోధిస్తున్నాయి.
ఏ ఇంటనయితే అబ్బాయిలు వివాహం కాకుండా ఉంటారో అతనిని ఆయజ్ఞ్యయ అని పిలుస్తారు. అతను ఒక ధర్మం చెప్పటానికి కాని, వేదికలమీద ఉపన్యసించడానికి కాని, ఒక దైవకార్యం చేయడానికి కాని అర్హుడు కాదు. ఈ కుటుంబంలోని పెద్దలు ఎంత పుణ్యాత్ములైనప్పటికి వారిని ఊర్ధ్వలోకాలలో తిరగతిప్పి కట్టి కొడతారు. మీయింట ఒకడు వివాహం చేసుకోకుండా ఉన్నాడు. అందుకని మీకీ శిక్ష, అని. అతను వివాహం అన్నా చేసుకోవాలి లేదా సన్యాసం అన్నా తీసుకోవాలి.
మరి అమ్మాయి విషయంలో కూడా శాస్త్రం ఇలాగే చెప్పింది. అమ్మాయికి యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేయాలి అని ప్రతి తల్లి, తండ్రి అనుకోవాలి. అనుకోవడమే కాకుండా అమ్మాయికి సూచన ప్రాయంగా తెలియచేస్తూ ఉండాలి. అమ్మా, నీకు కన్యాదానం చేయాలని అనుకుంటున్నాను. అమ్మా, నేను కన్యాదానం చేస్తుంటే నా పితృదేవతలు అందరూ సంతోషిస్తారు. అందుకని నీకు తొందరగా కన్యాదానం చేయాలని అనుకుంటున్నాను, అని చెపుతూ ఉండాలి.
ఇలా చెప్పడం వలన ఆ అమ్మాయి కూడా, ఓహొ, మా నాన్నగారు నాకు కన్యాదానం చేయాలనుకుని ముచ్చట పడుతున్నారు. ఆ మాట అనుకుంటూనే ఇంత ఆనంద పడుతున్నారు. నిజంగా కన్యాదానం జరిగే సమయంలో మా నాన్నగారి ఆనందానికి అవధులు ఉండవు. మా నాన్నగారిని అలా చూడాలి అని ఆ అమ్మాయి కూడా అనుకోవడం వలన ఆ అమ్మాయి యుక్త వయస్సు ప్రభావం వలన ఏ బలహీనతలకు లోను కావాలనుకున్నా కూడా లోను కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి వారి నాన్నగారి ముచ్చట తీర్చాలన్న కోరిక ఉంటుంది కాబట్టి తప్పటడుగు వేసే అవకాశం ఉండదు.
పిల్లల వివాహ విషయంలో తల్లితండ్రులిద్దరు కూడా సమానమైన హక్కు, బాధ్యత ఉన్నప్పటికీ, బాధ్యత విషయంలో పురుషుడికే పెద్ద పీట వేశాయి మన శాస్త్రాలు. భర్త వివాహం చేస్తాను అంటే భార్య మారు మాట్లాడటానికి వీలులేదు. కొంతమంది తల్లులు ఇప్పుడే అమ్మాయి వివాహానికి తొందరేముంది, ఇంకా రెండేళ్ళు ఆగుదాము అనడానికి వీలులేదు. కొన్ని సందర్భాలలో పిల్లలు వివాహం చేయడం అన్నది వారి వ్యక్తిగత సమస్యగా కాక కొన్ని సందర్భాలలో అది సమాజానికి కూడా ఒక సమస్యగా పరిణమించే అవకాశం ఉంది.
మన సమాజంలో బాద్యత లేని తల్లితండ్రులు ఒకవేళ ఏ కారణం చేతనైన పరిస్థుతుల ప్రభావం చేత ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాని పాపం అంతా ఆ ఇంటి యజమాని అయిన ఆ కన్న తండ్రికే వస్తుంది. ఒక ఆడపిల్ల తప్పు చేస్తే పితృదేవతలు కూడా ఎంత పుణ్యాత్ములైనప్పటికి వెనుక పది తరాలు, ముందు పది తరాలు పాపం చేసిన శిక్షకు గురికావలసి ఉంటుంది.
ఏ తల్లి, తండ్రి అయితే యుక్త వయస్సు వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆ అమ్మాయి వివాహ ప్రస్తావన చేయకుండా వారు ఆనందంగా ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారో అటువంటి తండ్రికి మన శాస్త్రం ప్రకారం తన కూతురి ఋతుస్రావపు రక్తము మూడు రోజులు మూడు దోసిళ్ళు తాగినటువంటి మహాపాపం ఆ తండ్రి ఖాతాలో వేస్తారు. తప్పుకుంటాడేమో అని బాధ్యతని ఇంత చక్కగా గుర్తు చేసింది శాస్త్రం.
కాబట్టి ప్రతి తల్లి, తండ్రి కూడా తమ పిల్లలకి వివాహాలు సకాలంలో చేయాలి. పిల్లల చదువు, ఉద్యోగం అన్నప్పటికీ వివాహం చేసుకున్న తరువాత కూడా మీరు ఇవన్నీ సాధించవచ్చు. కావలిస్తే మీ వెనుక మేము అండగా ఉన్నాము అని భరోసా ఇస్తూ వివాహాల బాధ్యతలను ఏ ఇతర కారణాల వల్ల విస్మరించకూడదు.
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

No comments:

Post a Comment