శ్రీ వైష్ణవాలయాలలో ఉత్సవమూర్తులు

శ్రీవైష్ణవాలయాల్లో ఏటా నిర్వహించే భగవదుత్సవమూర్తుల ఊరేగింపులో వాహనాలది విశిష్టస్థానం. భక్తులు స్వామివారిని ఊరేగిస్తూ పుణ్యఫలాన్ని పొందుతారు.
వాహనాలు అంటే ఏమిటి?
పెరుమాళ్ళ సన్నిధిలో జరిగే తిరునాళ్ళలో ఊరేగింపు వీధ్యుత్సవ సమయాన ఉత్సవమూర్తిని వహించు గరుడ, ఆశ్వ, రథాదివివిశేషాన్ని ఆగమపరిభాషలో వాహనమంటారు.
ఉత్సవమూర్తికి ఎన్నెన్నో వాహనాలు
ఉత్స్వప్రారంభాసమయాన బలిప్రదానం, భేరితాండనం అయ్యాక సకలదేవతలనూఆహ్వానిస్తారు. దేశ గ్రామ వాసులయిన మానవులనూ ఆహ్వానిస్తారు. ఈ తంతును అర్చకులు సంస్కృతంలోని మంత్ర, సూక్త, శ్లోక, గద్యాడులను పటిస్తూ చేస్తారు. ఆయా దేవతలందరకూ వాహనాలుంటాయి. ఉదాహరణకు బ్రహ్మకు హంస, గరుడునికి వాయువు, అనంతునికి కూర్మం, కందర్పునికి శుకం; అష్టదిక్పాలకులలో ఇంద్రునికి ఐరావతం, అగ్నికి మేషం, యమునికి మహిషం, వాయువుకి మృగం (జింక), కుబేరునికి నారా, ఈశ్వరునకు వృషభ వాహనాలుంటాయి. దేశ, గ్రామవాసులయిన మానవులకు కూడా వారి వారి స్థాయిని బట్టి వాహనాలుంటాయి. ఉత్సవానికి విచ్చేసిన దేవతలకీ మానవులకీ మొదలయినవారందరకూ వాహనాలున్నపుడు, ప్రముఖమైన ఉత్సవామూర్తికి కూడా వాహనం ఉండాలి, ఉంటుంది. తన్మూర్తి జగన్నాయకునకు ప్రతీక కాబట్టి, ప్రతిరోజూ విశిష్టమైన వాహనము వుంటుంది. ఎన్నెన్నో వాహానాలుగల ఇందిరారామణుని అన్నమాచార్యులవారు ఒక సంకీర్తనలో ఇలా కీర్తించారు –
‘ఎట్టు నేరిచితివయ్యా యిన్ని వాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా’
అన్ని వైష్ణవ క్షేత్రాలలో భగవన్మూర్తుల వాహనాలు ఒకే రకానికి చెందినవై ఉండాలనే నియమం ఎక్కడా లేదు. ప్రస్తుత వైష్ణవ క్షేత్రాలలో వాడుకలో ఉన్న వాహనాల పేర్లు అకారానుక్రమంలో ఇవి – ఆశ్వ, కల్పవృక్ష, గజ, గరుడ, గోవర్థన, చాతక, చంద్రప్రభ, పద్మ, పల్లకీ, పుష్పక, పొన్న, మయూర, మనుష్యాందోళిక, మౌక్తిక, మంగళగిరి, రథ, రాజుథిరాజ, వైకుంఠవిమాన, శేష, సమరభూపాల, సర్వభూపాల, సూర్యప్రభ, సింహ, హునుమాద్, హంస వాహనాలు. గోవర్తనాది భేదాలు వాహన విశేషాలు కాదు. అయినా వాటిని వాహనవిశేషాలుగానే వ్యవరిస్తున్నారు.
అశ్వవాహనం
గుర్రం, తురగం, హయం మొదలయిన పర్యాయ పదాలతో కూడా ఈ వాహనాన్ని పిలుస్తారు. అనేక వైష్ణవ క్షేత్రాలలో జరిగే మహోత్సవాలలో ఈ వాహనం ఉపయోగించబడుతోంది.
కల్పవృక్ష వాహనం
ఈ వాహానాన్ని కల్పద్రుమ మొదలయిన పర్యాయ పదాలతో కూడా పిలుస్తారు. తిరుమల బ్రహ్మోత్సవంలో ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
గజవాహనం
ఏనుగు, కరి, దంతావళ, దంతి, మదావాళ, వేదండ, సంధుర, హస్తి పేర్లు ఈ వాహనానికి వాడుకలో ఉన్నాయి.
గరుడవాహనం
ఖగ, గరుటాలమంత, తార్క్ష్య, పన్నాగరి, వైనతేయ, సువర్ణ మొదలయిన పర్యాయపదాలతో కూడా ఈ వాహనాన్ని వ్యవహరిస్తారు. వైష్ణవక్షేత్రాలలో జరిగే ‘గరుడ సేవ’ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని వైభవంగా నిర్వహించబడుతుంది. సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రాలన్నింటిలో జరిగే మహోత్సవాలలో గరుడసేవ ఉంటుంది. వాటిలో ‘కంచి గరుడసేవ’ బాగా పేరుపొందింది. ఆళ్వార్ తిరునగరి – నవతిరుపతులలో తొమ్మిది గరుడసేవాలు ఒకే పర్యాయం నిర్వహించబడతాయి. తిరునాంగూరు దివ్య దేశంలో కూడా తైమాసం – అమావాస్యకు ఒకే పర్యాయం పదునొకండు గరుడసేవాలు నిర్వహించబడతాయి. ఆళవందారులు “స్తోత్రరత్నం” లో గరుడుడు పెరుమాళ్ళకు సలిపే వివిధ కైంకర్యం కూడా పేర్కొనబడింది. ‘దాసశ్చసఖ ఆహనం ఆసనం ధ్వజోయక్తే విధానం వ్యాజనం’ అని స్తోత్రరత్నంలో గరుడుడు చేసే సేవలు పేర్కొనబడినవి.
గోవర్ధనవాహనం
మన్నరుగుడి (తమిళనాడు) ఫాల్గుణమాసం – బ్రహ్మోత్సవంలో నాలుగవనాడు శ్రీస్వామివారు బాల భూషణునిగా బాలగోపాలుడై గోవర్ధనవాహనారూడుడై వీధ్యుత్సవానికి వేంచేస్తారు.
చాతకపక్షివాహనం
తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామివారు గరుడవాహనులు కాగా, వారి దేవేరులు ఒకరు హంసవాహనులు మరొకరు చాతకపక్షి వాహనులు కావటం తిరుమల తిరుపతిదేవస్థానపు శిలాశాసనాలు తెలుపుతునాయి.
చంద్ర ప్రభవాహనం
దీనికి ‘చంద్రమండల వాహనం’ అని కూడా వ్యవహారం. తిరుమల బ్రహ్మోత్సవంలో ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
పద్మవాహనం
ఈ వాహనం మనారుగుడిలోజ్యేష్ట మాసం – ప్లవోత్సవంలో ఐదవనాడు ఉపయోగించబడుతుంది.
పల్లకీవాహనం
అందలం, ఆందోళిక, చతురంతయానం, పల్యంకిక, పల్లయన్ – తులాం, పాలకీ, శిబిక మొదలయిన పర్యాయపదాలతో ఈ వాహనాన్ని పిలుస్తారు. ఉత్సవాలు నిర్వహించే ప్రతి వైష్ణవాలయంలోనూ పల్లకీ వుంటుంది. పూలపల్లకి, బంగారు పల్లకి తిరుచ్చి, మనుష్యాందోళిక మొదలయిన భేదాలు కూడా ఉన్నాయి. శిబిక అంటే పల్లకి. దాని రూపాంతరం చిబిక. తిరు శ్రేష్టవాచకం విశేషణ పూర్వపదంగా చేరి ‘తిరిచ్చిబిక’ అయింది. కాలగమనంలో ‘తిరుచ్చి’ మాత్రం మిగిలింది. ఇది సాధారణమైన పల్లకివలేగాక విశేషంగా ఉంటుంది. పల్లకీలన్నీ మనుషులే మోసినా ‘మనుష్యాందోళిక’ అనే మరో పెద్దవాహనం వుంది. దీనిని అన్నమాచార్య ‘తిరుడండెల వాహనం’ గా పేర్కొన్నారు.
పుష్పకవాహనం
మన్నరుగుడి బ్రహ్మోత్సవంలో పుష్పకవాహనం ఉపయోగించబడుతుంది.
పొన్నవాహనం
అంతర్వేది నృసింహక్షేత్రంలో జరిగే మహోత్సవంలో ఈ వాహనం ఉపయోగిస్తారు.
మయూరవాహనం
శ్రీకురుమూర్తి వేంకటేశ్వరబ్రహ్మోత్సవంలో ఈ వాహనం ఉపయోగిస్తారు.
మౌక్తికవాహనం
దీనికి ముట్టుపండల్, ముత్యాల పందిరి అని కూడా వ్యవహారం. తిరుమల బ్రహ్మోత్సవ సమయంలో ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
మంగళగిరి వాహనం
దీనిని తిరుమల బ్రహ్మోత్సవంలో ఉపయోగిస్తారు.
రథం
మహోత్సవాలలో రథోత్సవం చాల వైష్ణవాలయాలలో జరుగుతుంది. పురాణాలలో విష్ణువు / విష్ణ్వవతారవిశేషం – రావణవిజయం, అయోధ్యాపయనం, నరకాసురవధ, సాందీప పుత్ర రక్షణ, రుక్మిణీరక్షణ, పౌండ్రక వాసుదేవ నిగర్హణ, జరాసంధ హంస డిభకులను జయించటం, పార్థసారధ్యం మొదలైన సందర్భాలలో రథారూడుడైనట్లు చెప్పబడింది. స్వరూపాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి ఆదీనాన్ని బట్టి రథానికి ఉండే విశేషణాలు మారుతుంటాయి. ఉదాహరణకు కళ్యాణరథం, దివ్యరథం, పైడిరథం, పుష్పరధం మొదలయినవి నిర్మాణానికి సంబంధించినవి. కాగా ఇంద్ర / దేవేంద్ర, విష్ణు, వేంకటేశ, హరీ, బ్రహ్మరథాల పేర్లు వ్యక్తినామాలతో ప్రసిద్ధమయ్యాయి. రథానికి తేరు అని కూడా వ్యవహారం. కనకపు తేరు, గోణిగెలతేరు, తిరుతేరు, పైడితేరు, బందికండ్ల తేరు, ముత్తేలతేరు, మేటితేరు, మేలుకట్లతేరు, శిఖరపుతేరు, సింగారపు తేరు అనేవి నిర్మాణానికి సంబందించినవి. ఈ పేర్లను అన్నమాచార్యులు తన సంకీర్తనలలో ప్రయోగించారు.
రాజాధిరాజ వాహనం
అంతర్వేది నృసింహస్వామి క్షేత్రంలో జరిగే మహోత్సవంలో ఈ వహానాన్ని ఉపయోగిస్తారు.
వైకుంఠవిమానరాధం
దీనికి పుణ్యకోటివిమానం, విమాన వాహనం అని వ్యవహారం. తిరుమల బ్రహ్మోత్సవంలో దీనిని ఉపయోగిస్తారు.
శేషవాహనం
దీనికి తిరువనంతాళ్ వాహనం అని పేరు. అనంత, ఆదిశేష, ఫణీంద్ర, భోగీంద్ర మొదలయిన పర్యాయ పదాలతో ఈ వాహనం పిలువబడుతుంది. వైష్ణవాలయాలలో ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
సమరభూపాలవాహనం
మేలుకోటి శ్రీవైరముడి మహోత్సవంలో తిరునాళ్ళు మొదటిరోజున ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
సర్వభూపాలవాహనం
తిరుమల బ్రహ్మోత్సవం నాలుగావరోజు రాత్రి ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
సూర్యప్రభావాహనం
 

దీనికి సూర్యమండలవాహనం అని పేరు. తిరుమల మొదలయినచోట్ల జరిగే బ్రహ్మోత్సవాలలో దీనిని ఉపయోగిస్తారు.
సింహవాహనం
తిరుమల బ్రహ్మోత్సవం మూడవరోజు ఉదయం ఈ వాహనం ఉపయోగించబడుతుంది.
హనుమద్వాహనం
అంతర్వేది నృసింహక్షేత్ర మహోత్సవంలో పంచముఖ ఆంజనేయవాహనం ఉపయోగించబడటం విశేషం.
హంసవాహనం
దీనికి నాణ్జివాహనం అనివ్యవహారం. మరాళాది పర్యాయపదాలతో ఈ వాహనాన్ని వ్యవహరిస్తారు. తిరుమల, కురుమూర్తి, మొదలయిన క్షేత్రాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో రెండవరోజు ఈ వాహనం ఉపయోగించబడుతుంది.

No comments:

Post a comment