తిరుప్పాణాళ్వార్

పరంధాముని దివ్య అనుగ్రహాన్ని పొందడానికి జాతి, కుల, మత భేదాలు ఏవీ అడ్డురావు. అంత్సకులంలో అవతరించి తరించిన మహానుభావులు తిరుప్పాణాళ్వారు కవి యుగం 162 దుర్మతి నామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ రోహిణీ నక్షత్రమున శ్రీరంగమునకు దగ్గరగా వున్న ఉరైయూరు (చూళాపురం)లో వరి పొలంలో వరి వెన్ను నుండి శ్రీవత్సాంశమున అయోనిజుడుగా జన్మించినట్లు, ఏబది సంవత్సరములు జీవించినట్లు తెలుయుచున్నది.
ఒకనాడు వరి పొలాల ప్రక్కనుండి వెళ్లుచుండగా ఒక మహాభక్తుడైన మాతదాసు అనే మాలదాసరి ఒక వరి వెన్నులో బాల సూర్యునివలే ప్రకాశిస్తున్న శిశువును జూచాడు. ఆశిశువును జూచి బిడ్డలు లేని తమకు ఈ శిశువు భగవత్ప్రసాదమని, భక్తితో, ఆప్యాయంగా, ఆదరంతో ఆశిశువును ఎత్తుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈ శిశువు తనజాతి స్త్రీల స్తన్యములను గ్రోలలేదు. గోక్షీరమివ్వగా శిశువు ఆప్యాయంగా త్రాగాడు. శిశువును ఆవుపాలతోనే పెంచారు.
మాలదాసరి యింట పెరుగుచున్న ఈ శిశువుకు బాల్యమునుండి విశేషమైన భక్తి అలవడింది. విష్ణుమూర్తి యందు అనురక్తి, ఇతరవిషయములందు విరక్తి పెంపొందించుకొనుచుండగా, విష్ణుమూర్తి ఆజ్ఞపై విష్వక్సేనునిచే బాలకునికి పంచసంస్కారములు జరిగినవి. దానితో బాలకుడు సర్వార్థములు ఎరిగిన వాడయ్యెను. నారదుని వలె నిరంతరము వీణాపాణియై భగవన్నామ సంకీర్తనలు ప్రారంభించాడు. చేతియందు నిరంతరం వీణ ధరించి యుండుటచే వీరికి తిరుప్పాణన్‌ అను నామము సార్థకము అయింది.
శ్రీరంగము చేరి ప్రతి దినమూ కావేరీ నదిలో స్నానమాచరించి దాసరి యింట పెరిగినందున శ్రీరంగనాథుని దేవాలయము విమానమునకు ఎదురుగా నిలబడి సంకీర్తన చేయ మొదలుపెట్టాడు. భగవద్గుణానుభవము చేయుచు భగవంతుని లీలలు గూర్చి పాడెడివాడు. ఇసుక తిన్నెలందు ఆక్షేత్రాన్ని చిత్రించి వీణాగానం చేస్తూ శ్రీరంగనాథుని తన అమరగానంతో ముంచెత్తేవాడు.
ఆ గానము సొబగులను సంతరించుకుంది. అది అపాకృత దివ్య గానమయింది. పశు పక్ష్యాదులు కూడ చెవినొక్కి వినేవి. అంతరిక్షము నుండి గంధర్వులు, యక్షులు గూడ విన మొదలు పెట్టారు.
బ్రాహ్మణులు స్నానమునకు కావేరీనదికి వెళ్తూ త్రోవలో నున్న ఈతనిని దూరమునకు తొలగమని అనేవారు. గానములో పరవశుడై భగవధ్యానములో యెడ లెరుగని స్థితి ఏర్పడింది. జనులు రాళ్లను రువ్వినా చలించనంత ధ్యాన పరవశత ఏర్పడింది.
ఒక రోజున శ్రీరంగనాథుని తిరుమంజనానికి తీర్థం కావేరీ నదినుండి తేనవసరమైంది. ఆలయ ప్రధానర్చకులు సారంగయోగి కావేరీ నదికి వెళ్ల ప్రయత్నించారు. బాహ్యస్మృతిని మరిచిన తిరుప్పారాళ్వారు వీరిని వీరి బృందమును గమనించలేదు. కన్నులు తెరవలేదు. ధ్యానంలో పరవశతతో ఉండిపోయి వారి గమనమునకు అడ్డంకి అయ్యాడు. పట్టరాని కోపంతో సారంగయోగి అనుచరులు రాళ్లను రువ్వి తిరుప్పాణాళ్వారును గాయపరిచారు. నెత్తురు ధారగా పడ మొదలుపెట్టింది. అప్పుడు తిరుప్పాణికి స్పృహ కలిగి తాను వారికి అడ్డముగా నుండి భగవతాపచారము చేసితినని బాధతో ప్రక్కకు తొలిగాడు. అంతేకాని సారంగయోగి అతని అనుచరులపై ఎట్టికోపమును తిరుప్పాణిలో కలుగలేదు.
సారంగయోగి ఆలయమునకు ప్రవేశించగా శ్రీరంగనాథుని నుండి రక్తం ధారగా వచ్చుచుండుట చూసి చలించిపోయారు. రాత్రి కలలో శ్రీరంగనాథుడు సారంగయోగికి కనపడి - అతని గానమునకు వశుడనై అంతటా వ్యాపించివున్నాను. మీ అనుచరులు ఆకృత్య ఫలితమే మీరు చూచింది అని చెప్పారు. ఆరాళ్లచే నేను కొట్టబడ్డాను అన్నారు.
శ్రీ రంగనాథుని దేవేరి రంగనాయకి ఈ గానమునకు ముగ్ధురాలై తన నాధుని చేరి " తిరుప్పాణి భక్తాగ్రగణ్యుడుగా నున్నాడు. చిరకాలము నుండి తన గానముచే మనలను రంజింపచేయుచున్నాడు. ఈతనిని మన సన్నిధికి రప్పించుకుని ఆయన గానమును వినవలె నని తహతహలాడుచున్నాను" అని మనవి చేసింది.
శ్రీరంగనాథుడ్నూ మురిసిపోయి సారంగయోగికి స్వప్నమున కనిపించి నా భక్తుడైన తిరుప్పాణిని తక్కువ కులమువాడని సందేహించక అతనిని నేను నా దగ్గరకి రమ్మంటిని అని చెప్పుము. అతడు సందేహించిన యెడల అతనిని బలవంతముగా భుజముపై నెక్కించుకొనియైనా కొనిరమ్ము అని ఆదేశించాడు.
సారంగయోగి మరునాడు తిరుప్పాణిని చేరి, సాష్టాంగ పడి, మిమ్ములను " శ్రీరంగనాథుడు తన సన్నిధికి రమ్మని కోరుచున్నాడు" అని చెప్పాడు. దానికి తిరుప్పాణి నేను పంచముల యింట పెరిగితిని. ఈ పావన క్షేత్రమున నేనెట్లు కాలిడుదును? అని తన సందేహము ఎరిగించాడు. సారంగయోనగి ఇది రంగనాథుని ఆజ్ఞ. మీరు రావలసినదే అని చెప్పాడు. తిరుప్పాణి బదులు పలుకలేదు. సారంగయోగి ఇది కాదని తిరుప్పాణిని తన భుజములపై నెక్కించుకొని శ్రీరంగనాథుని ఆలయమునకు బయలుదేరాడు. ముందర దివ్యప్రబంధములను శ్రీ వైష్ణువులు అనుసంధించుచుండగా వేద పఠన మింకొక ప్రక్క జరుగుచుండగా, వైభవంగా తిరుప్పాణిని సారంగయోగి శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకునివెళ్లాడు. శేషతల్పశాయి అయిన శ్రీరంగనాథుని తిరుప్పాణి దగ్గర నుంచి చూచి చలించిపోయాడు. ముఖమండలము నుండి తిరువడి వరకు దేవదేవుని సకలవయవముల సౌందర్యమును తిలకించి, అనుభవించి, అత్యుత్సాహంతో పది పాశురములతో ప్రబంధముగ శ్రీరంగనాథుని కీర్తించాడు. అదే అమలనాదపిరాన్‌. సారంగయోగి తన భుజములపై తీసుకుని వెళ్లినందున యోగివాహనుడు అని పిలువ బడ్డాడు. తన యందు అపారభక్తిని చూపిన భక్త్వమృతమును వెదజల్లిన తిరుప్పాణిని అపార అనుగ్రహముతో శ్రీరంగనాథుడు తనలో లీనము చేసికొనినాడు.
నీలమేఘ నిభ మంగళగాత్రుడు గోపకులము నందు అవతరించిన, వెన్నను ఆరగించిన అధర పల్లవము గలవాడు, నా హృదయ సీమనుగూడ అపహరించిన చతురుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ లోకానికే ఆభరణమైన శ్రీరంగమున శేషశయనుడై వుండు అతృప్తామృతమైన శ్రీరంగనాథుని సేవించిన నా కన్నులు ఇతరులను చూడవు. ఇది ముమ్మాటికి నిశ్చయము.
ఇక నా నేత్రములకు అమృతమువలె అతి భాగ్యమైన ఈ దర్శనమహాభాగ్యం తప్ప మరేమీ వద్దు అని చెప్పుకుని ఉత్తరక్షణములో శ్రీరంగనాథునిలో లీనమైపోయారు.

No comments:

Post a Comment