భీష్మ ఏకాదశి .


మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.

భీష్మ పితామహునకు సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకధలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మపితామహుడు. ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి, శౌరసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్రవిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు.
వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు . చక్కటి కధల రూపంలో వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీమహాభారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కధలను ధర్మరాజుకు చెబుతున్నసమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు. రాజ సూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించేభాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు.
అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేసించింన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాల్కుల మీద నానుతూనే ఉన్నయి. ఆదిశంకరాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగిఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్నిగురించి తెలుసుకోవటానికి. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్శకుడుగా నిలిస్తున్నారు.
అన్నిటికంటే మించిన విశేషమేమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు. పిల్లలూ లేరు. కానీ ఇలా అపుత్రకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. అందరికీ అలా ఆయన పితామహుడు (తాతా) లాంటి వాడయ్యారు. ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన, పితృ భక్తి, సత్ శీల సంపద వలనే లభించాయి

No comments:

Post a Comment