విష్ణు సహస్రనామ స్తోత్రము

 విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన vedic ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
స్తోత్ర ఆవిర్భావము
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.
అంపశయ్యపైనున్న భీష్ముడు
అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.

No comments:

Post a Comment