శ్రీ దేవకీమాత

దేవకీదేవి దేవకుని కూతురు. అతడు మధురాధిపతియగు ఉగ్రసేనమహారాజు యొక్క సోదరుడు. దేవకీదేవి ఉగ్రసేనుని కుమారుడైన కంసునకు చెల్లెలు. కనుక అతనికి ఈమెపై మిక్కిలిప్రేమానురాగములు కలవు. దేవకుడు ఈమెను శూరసేనుని కుమారుడైన వసుదేవునకు ఇచ్చి వైభవోపేతముగా పెండ్లి చేసెను. ఈ సందర్భమున అతడు తనగారాల పట్టియైన దేవకికి పెక్కుకానుకలు ఇచ్చెను. కంసుడు ఈ నూతనదంపతులను తనరథముపై ఎక్కించుకొని స్వయముగా తీసుకొనిపోవుచుండెను. ఆ సమయమున ఆకాశవాణి ఇట్లుపలికెను. "మూర్ఖుడా! ఓ కంసా! నీవు నీ చెల్లిలిని ప్రేమతో తీసుకొనిపోవుచున్నావు. ఇమెకు కలిగిన ఎనిమిదవసంతానము నీపాలిటి మృత్యువగును". ఆకాశవాణి పలుకులు వినగానే కంసునకు దేవకీదేవిపై గల ప్రేమ ద్వేషముగా మారెను. అతడు క్రోధావేశముతో ఖడ్గమును దీసుకొని చెల్లెలిని చంపుటకు సిద్ధపడెను. వసుదేవుడు కంసుని శాంతపరుచుచు ఇట్లు నుడివెను. "బావా! అబలయైన ఈ స్త్రీని చంపుట నీవంటివానికి తగదు. నీకు ఈమెపుత్రులవలనగదా భయము. ఈమెకు కలిగినపుత్రులను అందరిని నీకు అప్పగించెదనని మాటయిచ్చుచున్నాను. ఈమెను విడిచిపెట్టుము". కంసుడు వసుదేవుని పలుకులను విశ్వసించి, ఆమెను చంపుట మానుకొనెను. పిమ్మట వారినిద్దరిని చెరసాలలో బంధించెను.
దేవకీదేవికి వరుసగా అరుగురుపుత్రులు జన్మించిరి. వసుదేవుడు తాను ఇచ్చిన మాటప్రకారము వారినందరినీ కంసునకు అప్పగించెను. దుష్టుడైన కంసుడు వారిని అందరిని సంహరించెను. ఏడవవాడుగా దేవకీగర్భస్థుడైన బలరాముని యోగమాయ భగవంతుని ఆదేశముతో వ్రేపల్లెలోని రోహిణీగర్భమున జేర్చెను. ఎనిమిదవ సంతానముగా సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడు చతుర్భుజరూపముతో దేవకీవసుదేవులకు దర్శనమిచ్చెను. ఆయన తన చేతులతో శంఖమును, చక్రమును, గదను, పద్మమును ధరించియుండెను. దేవకిప్రార్థనపై ఆయన శిశువుగా మారెను. భగవానుని ఆదేశముతో వసుదేవుడు ఆ శిశువును వ్రేపల్లెలోని నందుని ఇంటికి చేర్చెను. అచటినుండి యశోదకు జన్మించిన యోగమాయను మధురకు చేర్చెను. కంసుడు ఆ బాలికను చంపబోగా ఆమె ఆయనచేతులనుండి తప్పించుకొని, అకాశమునకు ఎగిరెను. పిమ్మట కంసునితో "నిన్ను చంపెడివాడు వేరొకచోట పెరుగుచున్నాడు". అని పలికి అంతర్ధానమయ్యెను.
శ్రీకృష్ణభగవానుడు పెరిగి పెద్దవాడయ్యెను. దేవకీదేవి తన తనయుని జూచుటకై ఉబలాటపడుచు నిరీక్షించుచుండెను. కంసుని చంపిన పిదప శ్రీకృష్ణబలరాములు తమ తల్లిదండ్రులను దర్శించుటకు వచ్చిరి. తనప్రియమైనకుమారులను చూచుటతో దేవకీమాతకు కన్నులనుండి ఆనందశ్రువులు స్రవించెను. వారిని తనవొడిలోనికిచేర్చుకొని ముద్దులలో ముంచెత్తెను.
శ్రీకృష్ణభగవానుడు మథురనువీడి, ద్వారకకు చేరినప్పుడు దేవకీమాతయు ఆయనవద్దనే యుండెను. శ్రీకృష్ణుడు అవతారపురుషుడేయైనను, అమె ఆయనను తనసుతునిగనే భావించెను. శ్రీకృష్ణుడును ఆమె మాతృప్రేమకు తగినట్లుగ అన్నివిధములుగా ఆమెకు సేవలుచేయుచుండెను. శ్రీకృష్ణుడు తనగురువు గారి మృతపుత్రుని సజీవునిగాజేసి, తీసుకొని వచ్చిన సంగతి విని, దేవకీమాత కంసునిచేచంపబడిన తన ఆరుగురు సుతులనుగూడ చూడగోరెను. శ్రీకృష్ణబలరాములు మృతులైన తమసోదరులను పాతాళమునుండి సజీవులుగా దీసుకొనివచ్చి, తల్లికప్పగించిరి. పునరుజ్జీవితులైన ఆ ఆరుగురును శిశువులుగనే ఉండుటచూచి ఆమెకు స్తన్యము పొంగిపొరలెను. ఆమె వారిని తనవడిలోనికి చేర్చుకొని వారికి స్తన్యమునిచ్చెను. శ్రీకృష్ణునకు పాలిచ్చిన ఆదేవిస్తనములనుండి పాలుగ్రోలి ఆ శిశువులు దేవలోకములకు వెళ్లిరి.
అప్పుడు దేవకీదేవికి జ్ఞానోదయమయ్యెను. 'శ్రీకృష్ణుడు సామాన్యబాలుడు కాడు. ఈ చరాచరజగత్తునకు స్వామి. సమస్త విశ్వమునకు అధిష్ఠానదైవము' అని ఆమె గ్రహించెను. యదువంశము అంతరించినపిమ్మట శ్రీకృష్ణడు పరంధామమునకు చేరెను. అనంతరము దేవకీమాతయు ప్రభాసతీర్థమునకు చేరి తన పాంచభౌతిక దేహమును త్యజించి, భగవత్సన్నిధికి ఏగెను.

No comments:

Post a Comment