శ్రీకృష్ణుని మిత్రుడు ఉద్ధవుడు

ఉద్ధవుడు వృష్టివంశము వారిలో ప్రముఖుడు. అతడు సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడు. మిక్కిలి బిద్ధిమంతుడు. మథురకు రాగానే అతడు శ్రీకృష్ణునకు అంతరంగికుడైన మంత్రియయ్యెను. ఒకనాడు శ్రీకృష్ణభగవానుడు తన ప్రియసఖుడైన ఉద్ధవుని ఏకాంతమున పిలిచి ఇట్లు వచించెను. "ఉద్ధవా! నీవు బృందావనమునకు వెళ్లి, నందునకును, యశోదామాతకును, గోపికలకును నా సందేశమును వినిపింపుము. వారు నాయెడబాటు కారణముగా మిగుల దుఃఖితులైయున్నారు. యథార్థముగా వ్రజభూమి యందలి గోపికలకు తనపై గల అనన్య (సాటిలేని)భక్తిని ఉద్ధవునకు తెలియజెప్పుటకే శ్రీకృష్ణుడు అతనిని బృందావనమునకు పంపెను.
ఉద్ధవుడు బృందావనము చేరగానే నందుడు అతనిని కలిసికొని మిక్కిలి ఆనందించెను. అతనిని ఆలింగన మొనర్చుకుని తన స్నేహమును తెలిపెను. అతిథి సత్కారములను ఒనర్చిన పిమ్మట నందుడు అతనితో "దేవకీవసుదేవుల, శ్రీ కృష్ణబలరాముల క్షేమ సమాచారములను అడిగెను. శ్రీకృష్ణుని యెడ యశోదానందుల గాఢానురాగమును జూచి, ఉద్ధవుడు ఆనందమున మునిగిపోయెను. ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును తీసికొనివచ్చినట్లు విని, గోపికలు ఏకాంతమున అతనిని కలిసికొనిరి. పిదప ఆ శ్యామసుందరుని సమాచారమును అడిగిరి. ఉద్ధవుడు వారితోఇట్లు పలికెను. "ఓ గోపికలారా! శ్రీ కృష్ణభగవానుడు సర్వవ్యాపి. మీ హృదయములలో ఉన్నట్లే అతడు సమస్త చరాచరములయందును వ్యాప్తమైయున్నాడు. కనుక మీకు అతనితో ఎడబాటు ఎన్నడును జరుగదు. సర్వవ్యాపకుడైన ఆకృష్ణుని అనన్య భక్తితో మీరు సాక్షాత్కారింపజేసికొనగలరు". గోపికలు ఆయనతో ఇట్లనిరి. "ఓ ఉద్ధవా! ఈ ప్రపంచమున దేనినీ ఆసించకుండుట వలననే గొప్ప సుఖముండునని మాకు తెలియును. కాని శ్రీకృష్ణుడు తిరిగి ఇచటికి వచ్చునను ఆశను మాత్రము మేము వదలుకొనలేకున్నాము. ఆయన తిరిగివచ్చునను ఆశవలననే మా ప్రాణములు నిలిచియున్నవి. ఇచటి ప్రతి ప్రదేశము ప్రతి ధూళికణము శ్యామసుందరుని పాదచిహ్నములతో ముద్రితమైయున్నది. మా ప్రాణములు పోయినను ఆ స్వామిని మాత్రము మరువలేము." గోపికల అలౌకిల ప్రేమను జూచినపిమ్మట ఉద్ధవునిలోగల జ్ఞానాహంకారము తొలగిపోయెను. అపుడు అతడు ఇట్లు అనుకొనసాగెను. 'నేను ఈ గోపికల పాదధూళికి నమస్కరించుచున్నాను. వీరు గానముచేసిన ఈ శ్రీహరి కథ ముల్లోకములను పవిత్రమొనర్చును. ఈ భూమండలమున జన్మించినవారిలో గోపాంగనలే ఎంతయు ధన్యులు. ఈ వ్రజభూమియందు ఏదైనా ఒక వృక్షముగనో, లతగానో, కడకు గడ్డిపోచగనో ఉండవలెనని నా దృఢమైన వాంచ. దాని వలన ఈ గోపికలపదధూళి నన్ను పవిత్రునిగా జేయగలదు '.
శ్రీకృష్ణభగవానుడు ద్వారకను నిర్మించినప్పుడు ఉద్ధవుడు గూడ ఆయనతో అచటికి వెళ్లెను. ఆ స్వామి ఎల్లప్పుడును ఉద్ధవుని తనతోడుగా ఉంచుకొనెడివాడు, రాజ్యకార్యమునందు ఆయన సహకారమును తీసొకొనెడివాడు. శ్రీ కృష్ణభగవానుడు తన పరంధామమునకు చేరుటకు ముందు ఉద్ధవునకు తత్త్వజ్ఞానమును (ఉద్ధవగీతను) ఉపదేశించెను. పిమ్మట ఆయనను 'బదరికాశ్రమమున ఉండుము' - అని ఆదేశించెను. భగవంతుడు తనధామమునకు చేరిన పిమ్మట ఉద్ధవుడు మధురకు వచ్చెను. అచట ఆయనను విదురుడు కలిసికొనెను. ఉద్ధవుడు భగవంతుని ఆజ్ఞానుసారము తన ఒక స్వరూపముతో బదరికాశ్రమమునకు వెళ్లెను. మరొక సూక్ష్మరూపముతో గోవర్ధనగిరి యొద్ద లతలలో పొద్లలో దాగికొని నివసింపసాగెను. శాండిల్యమహర్షి చేసిన ఉపదేశమును పాటించి, వజ్రనాభుడు గోవర్ధనగిరి సమీపమున సంకీర్తన మహోత్సవమును జేసెను. అప్పుడు ఉద్ధవుడు లతల పొదల నుండి ప్రకటితుడాయెను.
ఉద్ధవుడు శ్రీకృష్ణుని పత్నులకు ఒక నెలపాటు శ్రీమద్భాగవత కథను వినిపించెను. తనతోపాటు అందరిని బృందావనమునకు తీసికొనిపోయెను. శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలుకచుండెడివాడు. "నేను ఈ లోకమున నా లీలావతారమును చాలించిన పిమ్మట ఉద్ధవుడు అతనికి నేను ఉపదేశించిన జ్ఞానమును లోకమునకు అందించును. అతడు సర్వసద్గుణములలో నాకంటెను ఏమాత్రము తీసిపోడు. అర్హతగల వారి కందరికిని అతడు ఉపదేశమును ఇచ్చుచుండును."

No comments:

Post a Comment