వ్యాసుని తపస్సు - శివుని ప్రత్యక్షం-శ్రీ దేవీ భాగవతం

శౌనకాది మహర్షులు తిరిగి ఇలా ప్రశ్నించారు.

"సూతమహర్షీ! మేరు పర్వత శిఖరానికి తపోనిమిత్తం వెళ్లిన వ్యాస భగవానుని గురించి తెల్పుతూ, మధ్య - మధ్య ప్రసక్తాను ప్రసక్తంగా వచ్చే ఉపాఖ్యానాలనూ రసవత్తరంగా వినిపిస్తున్నందుకు మాకు మహదానందంగా ఉంది. తిరిగి ముఖ్యకథా భాగమయిన వ్యాస తపోదీక్షావృత్తంతాన్ని వినిపించు" అని కోరారు.

రోమ హర్షణుడు ఈ ప్రకారం చెప్పసాగాడు.

"దేవతలకు క్రీడారంగం, మునులకు తపోవన భూమి అనదగిన మేరు పర్వత శిఖరంపై అత్యద్భుతావహమైన - సుందర సుమనోహర దృశ్యాలకు నెలవైన ఒక వనం ఉంది. అది అశ్వినులు, రుద్ర గణాలు, ఆదిత్యులు, మరుత్తులు, బ్రహ్మవాదులగు ముని పుంగవులకు నెలవు - నారద ఉపదేశానుసారం, పుత్రకామియైన వ్యాసమహర్హి మహా మాయా స్వరూపిణి అయిన పరశక్తి వాగ్బీజం అయిన ఏకాక్షరీ మంత్రజపం సాధనంగా చేసుకొని, నూరు సంవత్సరాల కాలం మహాదేవుని గురించి ఘోరమైన తపమాచరించాడు. ఆ తపోనిధి శరీరం శుహ్కించింది. తపోవేడిమికి లోకాలే తల్లడిల్లాయి. "మహాదేవా! వ్యాసమౌని తపస్సుకు లోకాలు ప్రకంపిస్తున్న కారణంగా నిన్ను రక్షణనర్థిస్తున్నాము. పాహిమాం !" అంటూ దేవతలను వెంటనిడుకొని దేవరాజు ఇంద్రుడు గౌరీపతిని వేడాడు.

శంకరుడా శచీపతిని భయము వలదని చెప్పి, "సురేంద్రా! ఎవరు ఘోర తపస్సు చేసినా, వారు నీ పదవికి ఎసరు పెడతారేమోనని భీతి చెందడం నీకు అలవాటే! కాని ఈ తాపస శ్రేష్ఠునికి నీ పదవిపై ఇసుమంతైనా ఆశలేదు. సంతానార్థియై ఆ మహర్షి సత్తముడు చేసే తపస్సునకు ప్రతిగా నేడే అతని మనోరధమీడేర్చనున్నాడు" అంటూ ఇంద్రుని వీడ్కోలిపి, వ్యాసునికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఇష్టకామ్య సిద్ధిగా - ' సర్వులకు పూజ్యుడు, సత్త్వసంపన్నుడు, సత్యశీలుడు, జ్ఞాని, కీర్తిమంతుడు, గుణ ప్రపూర్ణుడు అయిన పుత్రుని బడయగలవు" అని ప్రసన్న వదనుడై వరమిచ్చాడు కైలాసపతి. వ్యాసుడు శివునికి నమసుమాంజలించి, ఘటించి నిజాశ్రమానికి చేరుకున్నాడు.

దేవ వేశ్య ఘృతాచి తారసపడుట :

వ్యాసమౌని ఆశ్రమమున కొంత విశ్రాంతి తీసికొని, అగ్నికార్యం నిమిత్తం అరణిని మధించసాగాడు. అరణి స్థానంలో ఒక కులకాంతను ఊహిస్తూ "స్త్రీ పురుషుల సంయోగం లేనిదే పుత్ర సంతానం ఏరీతి ప్రాప్తించగలదు? ఈ అరణిని మధించినట్లే, దండముతో ఉత్తమకుల సంజాత, రూపయవ్వన సంపన్న పతివ్రత అయిన స్త్రీని కూడి సుఖించాలి కదా! కానీ, కన్యను వరించడం - భార్యగా తెచ్చుకోవడం అంటే...నాకు నేనే కోరి బంధాల్లో చిక్కుకోవడం కాగలదు. గార్హస్థ్య జీవితం లేకుండా సంతాన ప్రాప్తి సంభవమా? ప్రణవ స్వరూపుడైన పరమేశునికే ప్రణయిని పార్వతిని కూడక తప్పని స్థితి. మరి నాకు ఏది సాధనం ?" అని తీవ్రంగా ఆలోచించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో...

ఆకాశామార్గాన సంచరిస్తూ దివ్యకామిని అచ్చరలేమ ఘృతాచి వ్యాసునికి తారసిల్లింది. ఆ దేవవేశ్య మన్మధరూపం, తనువిలాసం ఎంతటి జితేంద్రియులనైనా ఆరడి బెట్టగలవనడానికి సందేహించనక్కరలేదు. అమరులకు అందుబాటులో ఉండేవేశ్య..."ఈమె నన్ను ధర్మబద్ధమైన కామానికి రా - రమ్మని ఆహ్వానించిన, నేను అంగీకరించడం ఎంతవరకు సమంజసం? సుఖ సంభోగ నిమిత్తం భ్రాంతుడినై, ఈ తేజవ్వని వెంట నేను పడితే - మునిలోకపు అవహేళనకు నేను గురికావలసి వస్తుంది. అదీగాక - నవమాసాలు మోసి పుత్రుని కని ఇచ్చునా? ఇంతా జేసి వేశ్యసంతానమా? పుత్రప్రాప్తి స్థితి వరకూ ఆమెని తీసుకెళ్లగల్గినా కీర్తిహాని తథ్యం! కనుకనే గణిత, అగణిత రతి సౌఖ్యమిచ్చినా, అట్టి కామం సకామం కానేరదు. దూష్యమే కాగలదు" ఇదీ ఘృతాచిని చూసిన తక్షణం వ్యాసుని మదిలో చెలరేగిన భావపరంపర.

అంతలోనే వ్యాసునికి ఊర్వశీ - పురూరవుల గాథ జ్ఞప్తికొచ్చి "అంతటి మహారాజు పురూరవునికే, దేవవేశ్య ఊర్వశి వల్ల పరాభవం తటస్థించింది. వేశ్యాలంపటం ఒక ఆరని చిచ్చు కదా! నారదుని వల్ల ఈ గాథ లెస్సగా విన్న నాకు దేవవేశ్యల పొందు విముఖత కల్గించాలి గాని, గుణపాఠం నేర్వకపోగా, పైగా గోతిలో పడటం విజ్ఞత కాదు కదా" అని వేశ్యాగమనాభిలాషను అణచుకున్నాడు.

"పౌరాణికగాథలను నీ వాగమృతంతో మరింత మధుర సంధాయకంగా మార్చగల వచో నిపుణ శ్రేష్ఠా ! సూత మహర్షీ! పురూరవుడెవరు? దేవవేశ్య ఊర్వశితో అతనికి పొత్తు ఎలా సంభవం ? సావధానంగా వినిపించ గోరుతున్నాం" అని శౌనకాదులు ప్రశ్నీంచగా, వ్యాస మహామహుని గాథను అక్కడికి ఆపి, పురూరవ చరితాన్ని అందుకున్నాడు సూత పౌరాణికుడు.

No comments:

Post a comment