పూజ మందిరం లో శివలింగం పెట్టి పూజించ వచ్చాఈశ్వరునికి ప్రతీక ఈ లింగం. భూమికి ప్రతీక ఈ లింగం. మనలో ఉండే ప్రాణశక్తికి ప్రతీక ఈ లింగం. అయితే అందరూ పూజామందిరంలో పెట్టుకొని అర్చించవచ్చునా అంటే కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎవరైనా ఆఫీసర్ ఇంటికి వస్తే ఎంతో మర్యాదలు చేస్తాం. అలాంటిది దేవదేవుడే ఇంటికి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి? శివలింగం పెట్టుకున్నాం అంటే సాక్షాత్తు శివుడే ఇంట్లో ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి కదా! అంటే దేహంలో ఆత్మలో పరమేశ్వరుడున్నాడు అన్న యెరుక గలవాళ్ళు యోగులు. చాలా పవిత్ర భావనలతో జీవించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆహారపు అలవాట్లనుంచి మొదలుపెట్టుకుంటే వ్యవహారం, నడవడిక సర్వమూ కూడా ప్రతీకాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. అలా కాకుండా వ్యవహారం వ్యవహారమే దేవుడు దేవుడే అంటే ఎలాగ?
ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అంటే అనేక నియమాలు పాటించాలి. ఈనాటి కాలంలో మాసిక నియమంలో ఉండేటటువంటి స్త్రీలు స్వేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఋతుకాల సంబంధిత నియమాదులు అంతగా పాటింపబడడం కాస్త తక్కువైన కాలం ఇది. అలాగే అర్చన సమయంలో కూడా కాలనియమాన్ని అనుసరించి సంపూర్ణ కాలం కేటాయించగలుగుతున్నామా? నైవేద్యాదులు పాటించగలుగుతున్నామా? పరీక్షలు వ్రాయాలంటే అటెండెన్స్ ఉండాలి, ఫీజ్ కట్టాలి అనే కాలంలో ఉపనయనం చేసుకుంటే గానీ వేదాధ్యయనం ఎందుకు అని ప్రశ్నించే ఈరోజులలో శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అంటే మన ఇంటికి 230వాల్టుల కరెంటు ఉంటే చాలు. శివలింగం అంటే వీధిలో ఉండే జంక్షన్ అనే చెప్పుకోవాలి. జంక్షన్ లో పెట్టే లైట్ ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత వెలుతురు? ఎంత నియమం? ఇవన్నీ పాటించాలి కనుక లింగం ఇంట్లో పెట్టుకోవచ్చును కానీ అమితమైన అనంతమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. మనకి పటం చాలు, ఆలయం చాలు అర్చకులు చాలు కాదండీ అంటే నియమాలన్నీ తెలుసుకొని పాటించాలి.

No comments:

Post a comment