దశావతారములు

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము
చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు (శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
====================================================================
శ్రీహరి దశావతారములు
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
1. మత్స్యావతారము :
వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి… నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు “నీవెవరవు?” అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. “శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?” అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. “రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును” అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
2.కూర్మావతారము:
దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము క్రింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులును, అమృతమును పుట్టెను.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
జయ విజయులు:
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.
౩.వరాహావతారము:
శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు.
మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు.
అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. “దేవా… సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, భూమిని తీసుకొని నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు…. అని బ్రహ్మ వివరించాడు.
ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.
రణ రంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.
అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.
4.నృశింహావాతారము :
దశభుజ పంచముఖ నరసిమ్హుడు
సోదరుని హిరణ్యాక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు – “కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును” అని వారికి అభయమిచ్చాడు.
హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.
గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి – నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు “సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు” అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి – “గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి.” అని వివరించాడు.
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.
క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి – నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా
అప్పుడు ప్రహ్లాదుడు “చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు” అని చెప్పాడు.0ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను. అయితే “ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?” అని రాజు ప్రశ్నించాడు. “బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. “సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?” అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. “మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.
మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.
“స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు” అని కోరాడు ప్రహ్లాదుడు. “నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి” అని ఆశీర్వదించాడు స్వామి.
హిరణ్యకశిపుని వధానంతరం భీకర రౌద్రపూరితమైన నృసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింప చేయలేకపోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడి శాంతించాడు. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.
5.వామనావతారం :
బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
6.పరశురామావతారం :
శ్రీహరి తన అంశముతో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరుబది యొక్క సారులు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.
7.శ్రీరామావతారం :
రావణకుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతాలక్ష్మనులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొని పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణాది రాక్షసులను సంహరించెను. అయోధ్యకు వచ్చి పట్టము గట్టుకొనెను. లోకాపవాదమునకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రయమునకు జేరెను. అప్పటికే గర్భవతియైన సీత అక్కడ లవకుశులు అను ఇద్దరు కుమారులను కనెను. రాముడు పదునోక్కవేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీత సమేతుడై అయోధ్య పురవాసులతో సహా పరమపదమునకు వేంచేసేను.
8.బలరాముడుగా అలంకరించారు. అనంతరం రామయ్యను కల్యాణ మంటపంలోని ప్రత్యేక వేదిక వద్దకు మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ తోడ్కొని వచ్చి ఆశీనులను చేశారు
9.శ్రీకృష్ణావతారం :
ఇరువది యెనిమిదవ ద్వాపరయుగములో అధర్మప్రవ్రుత్తులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారము నెత్తెను. దేవకీవసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్యక్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షషులను సంహరించెను. మధురాపురమునకు బోయి కంసుని సంహరించి, మాతామహుని రాజమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిన్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరకుని జంపి 16౦౦౦ మందిని వాని చెరనుండి విడిపించెను. ద్వారక నగరమును నిర్మించి భార్యాపుత్రబంధుమిత్ర పరివారముతో నూటపాతిక యేండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మాపరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించుచుండగా ముసులము వంకతో వారిని గూడ సంహరించి తానూ పరమపదమునకు చేరెను.
10.కల్క్యావతారము:
బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తించురు. ప్రజలు కూడ అన్యాయ ప్రవర్తనులై వేదకర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగంలో విష్ణుయశునుడికి శ్రీహరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును.
ఓం నమో పరమాత్మయే నమః

No comments:

Post a Comment