ఉత్తర క్రియలు- శ్రీ విష్ణు పురాణము

శ్రద్ధతో శ్రాద్ధం చేసేవాడు బ్రహ్మేంద్రాది దేవతలతో పాటుపితృగణాలను, సమస్త భూత గణాలను సంతోషపరచిన వాడవుతాడు.శ్రాద్ధమునకు తగిన ద్రవ్యం, విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తించేలా చూసుకొని శ్రాద్ధం పెట్టాలి. ఒక అభిప్రాయం ప్రకారం పితృతర్పణాదులకు నియతకాల విధులు అన్నవి లేవు.సూర్యచంద్రులు సమరీతిగా వెలుగొందే విషువత్‌ దినాల్లో గాని, మేషవృషభాది సంక్రమణ పుణ్యకాలాల్లో గాని, సూర్యగ్రహణాది సమయాల్లోగాని, కొత్తపంటలొచ్చేకాలంలోగాని, ఇచ్ఛాశ్రాద్ధాలు చేయ్యొచ్చు!వీటివల్ల పితృదేవతలకు గొప్ప ఆనందం కలుగుతుంది.పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు, అనూరాధ, విశాఖ, స్వాతి, ధనిష్ఠ, పూర్వభాద్ర, శతభిషానక్షత్రాలు అమావాస్యతో కూడి రాగా వచ్చినపుడు పెట్టేశ్రాద్ధం పితృదేవతలకు ఇంకా అధికంగా తృప్తినిస్తుంది. పితృభక్తుడైన థైలుడు అడగ్గా సనత్కుమారముని అడిగిన మరోరకమైన శ్రాద్ధం చెప్తాను.
సనత్కుమారుడిలా చెప్పాడు...
వైశాఖశుద్ధ తదియ, కార్తీక శుద్ధ నవమి, భాద్రపద కృష్ణ త్రయోదశి, మాఘ బహుళ ఆమావాస్య.... ఈ 4 తిథులు గొప్పపవిత్రమైనవి. ఈ విషయం పురాణోక్తం. సూర్యచంద్ర గ్రహణాదులప్పుడు, తిస్రోష్టకాలు వచ్చినపుడు, దక్షిణాయనం - ఉత్తరాయణం ప్రవేశించేటపుడు పుణ్యకాలాల్లోను మంచినీరు - నువ్వులతో కలిపి అయినా పితృదేవతల కోసం నియమంగా తర్పణాలు విడవాలి. అలాచేస్తే పితృదేవతలు దేవకాలమానం ప్రకారం వేయి సంవత్సరాలు తరిస్తారు.ధనిష్థ పౌర్ణమితో కలిసినపుడు, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేలసంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది.భాద్రపదంలో ఆర్ద్రానక్షత్రంతో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధావిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకు పుణ్యలోకగతులు కలుగుతాయి.మాఘ బహుళ అమావాస్య శతభిషానక్షత్రంతో కలిసి వచ్చినపుడు శ్రాద్ధావిధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.
పితృదేవతలకు పిండోదకాలు వదలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేష ఫలితాలు కల్గుతాయి.పితృదేవతల చేత పాడబడిన ఈ గీతం వినురాజా! వారి కోరిక ప్రకారం నువ్వు జరిగించి ధన్యుడివి కమ్ము! పితృదేవతలు ఇలా భావిస్తారట -'మన వంశంలో ఉండీ లేదనుకొనే పిసినారి తనం (విత్తశాఠ్యం) వల్ల మనకు పిండప్రదానం చేయనివాడు పుట్టకుండుగాక! సంపదగల్గి మనల్ని ఉద్దేశించి బ్రాహ్మణులకోసం అన్న వస్త్ర ధన భోగాదులు ఇచ్చేవాడు పుట్టుగాక! నువ్వు గింజలతోనైనా జలాంజలి ఇచ్చేవాడు పుట్టునా? అదీ సాధ్యంకాకుంటే, ఆవుకింత పిడికెడు గడ్డిని మా తృప్తి కోసం ఇచ్చేవాడు పుట్టునా? అదీ చేయశక్తిలేనివాడు, కనీసం మనకు నమస్కరించి తృప్తి పడమనే వాడు పుడతాడా?' అని గానం చేస్తుంటారట.ఔర్యుడిలా అన్నాడు...."కలిమి లేములను బట్టి ఏది చెయ్యబడినా పై వాటిలో పితృదేవతా ప్రీత్యర్థమవుతుందని వారిచేతనే ఇది పలకబడింది. శక్తి ఉన్నదా? లేదా తర్కించుకుని ఎవరికి వారే పైన చెప్పినట్లు ఆచరించవచ్చు".
శ్రాద్ధ భోక్తలు
శ్రాద్ధమునకు భోజనాదికాలు ముఖ్యం గనుక, ఎటువంటి భోక్తలను నియమించాలో ఔర్యుడు చెప్తూన్నాడు..
బ్రాహ్మణార్థం పిలవదగిన బ్రాహ్మణునికి కనీస పాండిత్యంగా కృష్ణయూర్వేదంలోని మూడు అనువాకములైన చదివిన వాడై ఉండాలి. వేదాధ్యయనశీలి - వేదసారాన్ని నిజజీవితంలో ఆచరించగలిగిన వాడు అయి ఉంటే ఇంకా శ్రేష్థం! ఎన్నెన్నో యజ్ఞాలను చేయించినవాడు, తపోనిష్ఠుడు, మాతాపితరుల పట్ల శ్రద్ధగలవాడు అర్హుడు.
స్వంతబంధువర్గంలోనైనా సరే! శ్రాద్ధాభోక్తగా నిమంత్రణానికి అర్హులైనవారిలో మేనల్లుడు, కూతురి కొడుకు, తనకు అల్లుడు, మామగారు, ఇష్టుడైన శిష్యుడు, మేనమామ...వీరంతా అర్హులే!

No comments:

Post a comment