నాచికేతుడు

ఉద్ధాలకుని కొడుకు ఔద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు. ఒకనాడు ఔద్దాలకి ఏటి రేవులో కుశలు, సమిధలు, కమండలువు, పూలూ అన్నీ మరచిపోయి ఇంటికి వచ్చి వాటిని నాచికేతుడిని తీసుకొని రమ్మని పంపాడు. అతడు ఏటి వద్దకు పోయేసరికి ఏరుపొంగి వాటిని తనలో కలుపుకొన్నది. నాచికేతుడు వాటిని కానక ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో ఆ సంగతి చెప్పాడు. ఔద్దాలకి కోపంతో కొడుకును 'యముడి వద్దకు పొమ్ము' (చావుము) అని తిట్టాడు. నాచికేతుడు తండ్రిని క్షమించుమని కోరుతూ ఉండగానే నేలపై పడి ప్రాణాలు కోల్పోయాడు. దానిని గమనించి ఔద్దాలకి పుత్రుడి శవం మీద పడి కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగాడు. ఒక పగలు రాత్రి అట్లా గడిచిపోయాయి. తండ్రి కన్నీటితో తడిసిన కొడుకు శవం ఆ తరువాత చైతన్యవంతమైనది. అతడి శరీరం సుగంధయుతమై ఇంపు గోలిపింది. కొడుకు బ్రతికేసరికి తండ్రి ఆహ్లాదంతో అతడిని జరిగిన సంగతి గురించి అడిగాడు. నాచికేతుడు తండ్రికి నమస్కరించి ఇట్లా చెప్పాడు. 'నీ ఆనాటితో నేను అందమైన యముడి పట్టణానికి వెళ్ళి సమున్నత సింహాసనం మీద ఉన్న యమధర్మరాజును దర్శించాను. ఆయన నేను చావలేదనీ, నీ ఆజ్ఞప్రకారం యముడిని దర్శించాననీ, తిరిగి వెళ్ళుమనీ తెలిపాడు. నేను ధర్మమూర్తి అయిన ఆయనను పుణ్యలోకాలను చూపుమని అడిగాను. ఆయన ప్రీతితో ఒక రథం మీద నన్ను ఎక్కించుకొని పుణ్య లోకాలన్నీ దర్శింపజేశాడు. 'ఈ పుణ్యలోకాలు ఎవరికీ లభిస్తాయి? అని నేను అడుగగా 'అవన్నీ గోదానం వలన కలిగే ఫలా'లని పేర్కొన్నాడు. గోవులు అంటే సూర్య కిరణాలు కాబట్టి గోదానం చేసిన వారు సూర్యుడివలె ప్రకాశిస్తారన్నాడు. నన్ను తిరిగి పంపాడు' అని చెప్పి తండ్రికి పరమానందాన్ని కలిగించాడు నాచికేతుడు.

No comments:

Post a Comment