నదులలో పారే నీటికి హారతి పడతాం. ఎందుకిలా అని అనేకమంది ప్రశ్నిస్తారు

రక్షించిన వారిని అమ్మగా చూడాలనిచెబుతుంది భారతీయ సంస్కృతి.నదులు ఎన్నిరకాలుగా ఉపయోగపడతాయో, నిజానికి అందులో పదోవంతు కూడా ఒకమనిషి మరో మనిషికిఉపయోగపడడం లేదు. కానీ, వీరందరికీ నదీమతల్లులు ప్రాణాలను నిలుపుతున్నాయి. ఆహారంతో పోషిస్తున్నాయి. ఇతర దేశాలలోని వారు నీళ్ళను నీళ్ళుగా మాత్రమే చూస్తారు. కానీ మనం! గంగానదిని గంగామాత అంటాం. కృష్ణా నదిని కృష్ణమ్మ తల్లి అంటాం. ఏ నదినీ మనం తక్కువ చేసి చూడం. ఆ నదులలో పారే నీటికి హారతి పడతాం. ఎందుకిలా అని అనేకమంది ప్రశ్నిస్తారు. సమాధానం సుస్పష్టమే. ఈ భూమిపై ప్రసరించే సౌరశక్తిని మానవులు, జంతువులూ, నదీనదాలు స్వీకరిస్తాయి. అయితే, మానవులు ఈ శక్తిని కేవలం తమకోసం మాత్రమె స్వీకరిస్తారు. చెట్లు సౌరశక్తిని తమతో పాటు మానవులకు, జంతువులకూ కూడా ఉపయోగపడే స్థాయిలో స్వీకరిస్తాయి. ఇక నదులు స్వీకరించే సౌరశక్తిని మానవులు, పశుపక్ష్యాదులు, జంతుజాలం, చెట్టూచేమా, భూమి అన్నీ వినియోగించుకుంటాయి. ఇక పూర్ణిమ రోజున సూర్యుడి శక్తి చంద్రుడి ద్వారా నదులకు పూర్తీ స్థాయిలో లభిస్తుంది. అలాంటి నదీమ తల్లులకు హారతి పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ నదీ జలాన్ని మనం స్పరించక మానం. సూర్యచంద్రుల నుంచి లభించే ఈ అద్వితీయ శక్తిన్ ఆ నదులు మనకు అందించేందుకు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ఏతావాతా ఒక్క కార్తిక పూర్ణిమ రోజునే కాకుండా ప్రతి పూర్ణిమకూ నదులను సేవించవలసిన అవసరం మనకుంది. ఈ విషయాలన్నింటిని బట్టి భారతీయుల విజ్ఞతను ప్రపంచంలోని వివేకవంతులందరూ గుర్తిస్తున్నారు.
నాసిక్ నుంచి అంతర్వేది వరకు ప్రవహించే గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 6జిల్లాల భూమాతకు స్నానం గావిస్తున్నాయి. 10కోట్లమంది ప్రాణాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. ఈ నదులను ఏడాది పొడవునా పవిత్రంగా కాపాడుకోవలసిన అవసరాన్ని ఈ హారతి చాటి చెబుతుంది. నదీమతల్లికి హారతి ఇవ్వడమంటే ప్రత్యక్షంగా పర్వావరణ పరిరక్షణకు తోడ్పడటమే. పూజించే దానిని మనం పవిత్రంగా చూసుకుంటాం. అందుకే ఇది కేవలం వ్యక్తులు చేస్తే సరిపోదు. ప్రభుత్వమే ఈ కార్యాన్ని చేపట్టాలి. సుదీర్ఘ చర్చలు, తీవ్ర వత్తిడులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు రాష్ట్రంలోని అన్ని నదీజలాలకూ హారతి పట్టాలంటూ ప్రభుత్వ ఉత్తర్వును జారీచేయడం హర్షణీయం. ఈ ఏడాదిలో అటు గోదావరి, ఇటు కృష్ణా నదులకు హారతులు పట్టే కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇది ఎంతో సంతోషకరమైన పరిణామం. ఈ హారతులను కేవలం కార్తిక పూర్నిమకే పరిమితం చేయకుండా, ప్రతి పూర్ణిమ నాడు నదులకు విశేష హారతినిచ్చేలా ప్రభుత్వ ఉత్తర్వులను పొడిగించాలి.

1 comment: