ద్వాదశాదిత్యులు - యమాదిత్యుడు:

ఒకసారి పాశము ధరించిన యమధర్మరాజు తన సేవకులతో "జగత్తునందు సూర్య భగవానుని భక్తుల సమీపమునకు మీరు ఎప్పటికినీ వెళ్ళరాదు. వారికి యమలోకమందు స్థానము లేదు. సూర్య భక్తుల హృదయము సూర్యునియందే ఉండును. సూర్యదేవుని నిరంతరమూ పూజించువారికి మీరు నమస్కారము చేసి తొలగిపోవలెను. భాస్కరునికి నిత్య నైమిత్తిక యజ్ఞములను చేయువారిని మీరు కంటితో కూడా చూడరాదు. మీరు సూర్య భక్తులను తాకిననూ, యమలోకమునకు తీసుకొని వచ్చు ప్రయత్నము చేసిననూ, మీ గతి ఆగిపోవును. పుష్ప, ధూప దీపాదులతో సూర్యుని పూజించువారిని మీరు పట్టుకోనరాడు. వారు ణా తండ్రికి (సూర్యునికి) ఆశ్రిత జనులు. సూర్య మందిరమును పరిశుభ్రము చేయువారిని, సూర్యుని మందిరమును నిర్మించు వారిని, మూడి తరముల వరకు విడిచి పెట్టవలెను. నా తండ్రి సూర్యుని అర్చించువారి వంశస్థులను దూరము నుండియే వదలి పెట్టవలెను" అని ఆజ్ఞాపించెను.
యమధర్మరాజు ఇట్లు ఆజ్ఞాపించిననూ ఒకసారి యమదూతలు మరచి సూర్యభక్తుడైన సత్రాజిత్తు రాజును సమీపించిరి. సత్రాజిత్తుని తేజస్సునకు యమకింకరులు మూర్ఛితులై పడిపోయిరి. యముడు వారి అపరాధమును క్షమింపవలెనను ఉద్దేశ్యముతో కాశీయండు యమాదిత్యుని స్థాపించి కఠోరమైన తపస్సు చేసెను. అప్పుడు ఆదిత్య భగవానుడు ప్రత్యక్షమై అనేక వరములిచ్చెను.
యమేశ్వరునికి పడమర, ఆత్మా వీరేశ్వరునికి తూర్పున సంకటా ఘాట్ పై యున్న యమాదిత్యుని దర్శించు వారికి యమలోక దర్శనముండదు.
మంగళ వారము చతుర్దశి యందు స్నానము చేసి, యమేశ్వరుని యమాదిత్యుని దర్శించు మానవులు సర్వపాపా విముక్తులగుదురు.
యమునిచే స్థాపింపబడిన యమేశ్వరునికి, యమాదిత్యునికి ప్రణామము చేయువారికి యమలోక యాతనలు ఉండవు.
యమ తీర్థమందు శ్రాద్ధము పెట్టి యమాదిత్యుని పూజించిన పితృఋణ విముక్తులగుదురు.

No comments:

Post a comment