శివరాత్రినాడు చేయవలసిన విధులు

1. ఉపవాసం - భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.

2. జాగరణం - బాహ్యంగా పరమశివుడు మహావిషాన్ని సేవించిన రోజు శివరాత్రి. విషం మ్రింగి నిదురపోతే శరీరమంతా త్వరగా వ్యాపించి, సమస్త భువన మండలాలకు వ్యాపిచి, ప్రళయం సంభవిస్తుంది. అందువలన భక్తులందరు శివస్తుతులతో ఆ పరమ శివుణ్ణి మేలుకొనేటట్లుగా చేసిన, సమస్త లోకాలకు మేలు చేకూరుతుంది. అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనో-బుద్ధి-అహంకార-చిత్తములనే అంతఃకరణల్ని శివభావాత్మకాలుగా జాగృతం చేసి, జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో ఐక్యం చెయ్యాలి. అంటే, కామ-క్రోధాది అరిషడ్వర్గ బంధనాలనుంచి 'జీవాహంత'ను విడిపించి, 'విశ్వ అహంత' అయిన శివతత్వంలోనికి ఐక్యం చెయ్యటమే జాగరణ.

3. అభిషేకం - పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో సంభవించిందని పురాణాలు చెబుతున్నవి. అందుచేతనే అర్ధరాత్రి సమయంలో అభిషేకవిధిని నిర్వహిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికి ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు మరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

No comments:

Post a comment