ద్వాదశాదిత్యులు - సాంబాదిత్యుడు

ద్వారకయందు శ్రీకృష్ణ భగవానునకు పుత్రులుండిరి. వీరిలో సాంబు అందరికంటే గుణవంతుడు, రూపవంతుడు.
ఒకనాడు దేవర్షి నారదుడు శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము ద్వారకకు వచ్చెను. వీనిని గాంచిన యాదవ కుమారులందరూ ప్రణామములాచరించి పూజించిరి. కాని సాంబు తన సౌందర్య గర్వముతో మునికి నమస్కరించలేదు. పైగా వాని వేషము చూసి నవ్వెను. ఇది నారదునకు నచ్చలేదు. ఈవిషయమును శ్రీ కృష్ణునకు చెప్పెను.
మరొకమారు నారదుడు ద్వారకకు వచ్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల మధ్య కూర్చొని యుండెను. అప్పుడు నారదుడు వెలుపల ఆటలాడుచున్న సాంబునితో "వత్సా! శ్రీ కృష్ణ భగవానునకు నేను వచ్చినట్లు చెప్పు"మనెను. సాంబుడు ఇట్లనుకొనెను. "ఒకమారు ప్రణామము చేయలేదని ఇతనికి కోపము కలిగెను. నేడునూ ఇతని మాట విననిచో ఇంకనూ కోపమెక్కువగును. అచట తన తండ్రి ఏకాంతమున మాతృమండల మందుండెను. ఇట్టి సమయమున నేనచటికివెళ్ళుట ఎట్లు? ఏమి చేయుదును? వెళ్ళిన తండ్రికి కోపము, వెళ్ళకున్న మునికి కోపము. ముని కోపమున కన్న తన తండ్రి కోపమే మేలని భావించి అంతఃపురమునకు వెళ్ళి దూరముగా నిలబడి తండ్రికి నమస్కారము చేసి నారదుని ఆగమన వార్త వినిపించెను. సామ్బుని వెనుకనే నారదుడునూ అక్కడికి వచ్చెను.
నారదుడు గోపికల మనోవికారమును గ్రహించి భగవానునితో "సాంబుని అతులనీయ సౌందర్యమునకు మోహితులైన కారణమున వీరిలో చంచలత్వము గలిగే"నని చెప్పెను.
సాంబు తల్లులందరినీ తన తల్లి జాంబవతిని చూచినట్లే చూచెడివాడు. అయిననూ దుర్భాగ్య వశమున శ్రీకృష్ణ భగవానుడు సామ్బుని కుష్ఠురోగిని కమ్మని శపించెను. సాంబుడు శ్రీకృష్ణుని ప్రార్ధించసాగెను. శ్రీ కృష్ణ భగవానుడు తన పుత్రుడు నిర్దోషియని గ్రహించి దైవ వశమున ప్రాప్తించిన ఈ రోగ విముక్తికి సాంబుని కాశీకి వెళ్ళి సూర్యుని ఆరాధించుమని చెప్పెను. సాంబుడు కాశీకి వెళ్ళి సూర్యభగవానుని ఆరాధించ సాగెను. అచట ఒక కుండమేర్పరచుకొనెను.
సూర్యుని ఆశీర్వాదముతో సాంబుడు కుష్ఠురోగ విముక్తుడయ్యెను. సప్తమి, ఆదివారము నాడు సాంబు నిర్మించు కొనిన కుండమందు స్నానమాడి సాంబాదిత్యుని పూజించిన వారు రోగ విముక్తులగుదురు.
మాఘమాస శుక్ల సప్తమి ఆదివారము సూర్యగ్రహణముతో సమానమైన పర్వదినమని చెప్పబడినది. ఆ దినము అరుణోదయ కాలమున సాంబాదిత్యుని పూజించుట విశేషము.
చైత్రమాస సప్తమి ఆదివారము నాడు సాంబాదిత్యునకు వార్షిక యాత్ర జరుగును. ఆ దినము అశోక పుష్పములతో సాంబాదిత్యుని పూజించు వారికి ఎప్పటికినీ శోకము కలుగదు.
సాంబాదిత్యుని మందిరము కాశీలో సూర్యకుండ ముహల్లేయందు కుండ సమీపమున కలదు.

No comments:

Post a Comment