హరుడు నెలవై వున్న అరుదైన కొన్ని క్షేత్రాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంది.

శివరాత్రి పర్వదినాన ఆ హరుని నామస్మరణ... ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుందంటారు. అలాగే హరహర మహాదేవ నమఃశివాయ అంటూ ఈ రోజున హరుని దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందంటారు. ఆ హరుడు నెలవై వున్న అరుదైన కొన్ని క్షేత్రాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంది.
నందిలేని శివాలయం...
నంది లేని శివాలయం గురించి తెలుసా? శివాలయం అనగానే ఎదురుగా నంది వుంటుంది. కానీ అనంతపురం జిల్లా అమరాపురం హేమావతి గ్రామంలోని సిద్ధేశ్వరాలయం.... శివుడి ఎదురుగా నంది లేని శివాలయం. ఇక్కడ శివుడు ఉగ్ర రూపుడిగా దర్శనమిస్తాడు. దక్షయజ్ఞం జరిగిన సమయంలో భర్త వద్దన్నా తండ్రి చేసే యాగానికి బయల్దేరి వెళ్తుంది సతీదేవి. ఆ సతీదేవి వెంట తన వాహనమైన నందిని కూడా తోడుగా పంపుతాడు శివుడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలను అర్పిస్తుంది. సతిని కోల్పోయిన శివుడు ఉగ్రతాండవం చేశాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకి కనిపించేది. ఈ ప్రాంతాన్ని పాలించిన శివభక్తుడు నాళంబరాజు కట్టించిన ఆలయం ఇది. సతి వెంట నంది వెళ్ళినందున ఈ శివాలయంలో నంది విగ్రహం వుండదు.
ఆరు నెలలు మాత్రమే తెరిచే శివాలయం
ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరచి వుండే శివాలయం గురించి విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే ఆ స్వామి సంవత్సరంలో ఆర్నెల్లపాటు కృష్ణమ్మ ఒడిలో దాగుంటాడు. ఆ సమయంలో స్మామిని దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. కృష్ణమ్మ వరద తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. అంటే, ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.
శివలింగానికి ఝటాఝూటం
శివుడిని ఝటాఝూటంతో చూస్తాం. కానీ, లింగరూపంలో వున్న స్వామిని ఝటాఝూటంతో చూడగలమా... సాధ్యమే... అలా ఆ స్వామి దర్శనం కావాలంటే, తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల వెళ్ళాలి మనం. అక్కడ శివుడు శ్రీ ఉమా కొప్పులింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తాడు. హరుడి తలపై కొప్పు, పక్కన అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ కనిపిస్తారక్కడ.
తోజోలింగ స్వరూపం
తేజోలింగ రూపంలో ఆ హరుడిని దర్శించుకోవాలనుకుంటే గుంటూరు జిల్లా చందోలు వెళ్ళాలి. లింగోద్భవ క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రంలో 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివలింగం వుంది. అతి ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఆ తేజోలింగం ఆరుబయట మనకి దర్శనమిస్తుంది. లింగంపై హంస రూపంలో బ్రహ్మ, అడుగుభాగాన వరాహ రూపంలో విష్ణుమూర్తి రూపాలు కనిపిస్తాయి.
శివలింగంపై గంట్లు
నర్సరావుపేట పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేజెర్ల కపోతేశ్వరాలయం గురించి విన్నారా? ఇక్కడ లింగంపై గంట్లు కనిపిస్తాయి. అలాగే ఈ లింగానికి కుడి -ఎడమలలో రెండు బిలాలుంటాయి. కుడి బిలంలో ఒక బిందె నీరు పడుతుంది. కానీ ఎడమ బిలంలో ఎంత నీరు పోసినా నిండనే నిండదు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కపోతేశ్వరుడిని కుడికంటితో వీక్షించడం ఇక్కడి మరో ప్రత్యేకత. దాన చక్రవర్తి శిబి లింగ రూపాన వెలసిన క్షేత్రం ఇది అంటారు. పావురాన్ని కాపాడటం కోసం శిబి తన దేహం నుంచి మాంసాన్ని కోసిన దానికి గుర్తుగా ఇక్కడ లింగానికి గంట్లు కనిపిస్తాయని భక్తుల విశ్వాసం.
శివలింగంపై పావురాలు
శివలింగం పైభాగంలో రెండు పావురాలు, మంటపంలో నంది వెనుక భాగంలో వేటగాడు... ఇంకెక్కడా కనిపించని ఈ విశేషం కేవలం తూర్పుగోదావరి జిల్లా కడలి కపోతేశ్వరాలయంలో మాత్రమే మనకి దర్శనమిస్తుంది.
లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరులు
శిలారూపంలో పార్వతీ పరమేశ్వరుల దర్శనం కావాలన్నా, కోరిన కోర్కెలు నెరవేరాలన్నా కర్ణాటక రాష్ట్రంలోని సూర్య గ్రామం వెళ్ళాల్సిందే. కర్ణాటక రాష్ట్రం దక్షణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో వుంది ఈ సూర్య గ్రామం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలకు 12 కిలోమీటర్ల దూరంలో వుందీ క్షేత్రం. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి. దేవాలయానికి సమీపంలో ఒక ఉద్యానవనం వుంటుంది. ఇందులో రెండు శిలారూపాలుంటాయి. వీటినే శివపార్వతులుగా భావించి పూజిస్తారు భక్తులు. ఇక్కడి విశేషం.... మనం కోరిన కోర్కె తీరితే ఆ కోర్కెని బొమ్మ రూపంలో స్వామికి మొక్కుగా చెల్లించాలి. అంటే, ఇల్లు కట్టుకోవాలన్న కోర్కె తీరితే ఇంటి బొమ్మ, పిల్లలు కావాలన్న కోర్కె తీరితే పసివాడి బొమ్మ... ఇలా ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన ఒక మట్టిబొమ్మను ఇక్కడి స్వామికి ఇస్తుంటారు భక్తులు. అలాగే ఇక్కడి ఉద్యానవనం దాటి లోపలకి వెళ్తే గుట్టలు గుట్టలుగా ఉన్న రకరకాల బొమ్మలు కనిపిస్తాయి మనకి.

No comments:

Post a Comment