శ్రీశైల క్షేత్రమునందలి ప్రధాన స్థానములు

 మధూక కుండము, పాలధార, పంచధారలు, హాటకేశ్వరము, ఆరామ వీరభద్ర స్థానము, బ్రహ్మగిరి, ఘంటాసిద్ధేశ్వరము, బోగేశ్వరము, ఇష్టకామేశ్వరము, సప్తమాతృకలు, కదళీవనము మొదలైనవి. పార్వతీ ప్రాణ వల్లభుడు మదనాంతకుడైన మల్లికార్జున స్వామి విడువక ఈ పర్వతమునందు నివసించి ఉంటాడు. ఈ క్షేత్ర మహిమను ప్రస్తుతించుట బ్రహ్మకైనను వశము కాదు. ఈ కొండయందలి గండశిలలన్నియును శివలింగములు. ఇచ్చటి చెంచులందరును సిద్ధమునులు. చావనిదే యెవ్వరికిని కాశీక్షేత్రము ముక్తులనీయదు. ఈ శ్రీశైలము శిఖరసందర్శన మాత్రముననే ఎల్లరకును ముక్తులనిచ్చును.

శ్రీశైలాది తీర్థముల వలన ముక్తి కలుగునని పురాణములు చెప్పుచున్నవి. ముక్తి కారణములని చెప్పబడిన సకలతీర్థములయొక్క ప్రశస్తి విషయములో రెండవయూహ లేదు. నిస్సంశయముగా అవియన్నియుని ముక్తి ప్రదములు. ఎట్లనగా వానిని సేవించినందువల్ల కలిగెడు సుకృతఫలమువల్లనే కాశీప్రాప్తి కలుగును. ఇట్లు కాశీప్రాప్తికి కారణములైనందువల్లనే వానిని పురాణములు కైవల్యప్రదములని వర్ణించినవి. అవి కాశీప్రాప్తి ద్వారా పరంపరాసంబంధము చేత ముక్తిప్రదములు. కాశీక్షేత్రము సాక్షాత్తుగా మోక్షకారణము. త్రివేణీ సంగమం, నైమిశారణ్యం, సరస్వతీనది ప్రవహించిన ప్రదేశము (కురుక్షేత్రము), హిమాలయమునుండి గంగానది దిగినచోటు, ఉజ్జయిని, అయోధ్యానగరం, ఉత్తర మధుర, బృందావన ప్రాంతము శ్రీకృష్ణ జన్మస్థానము, దక్షిణ మధుర, పాండ్యుల రాజధాని శ్రీమీనాక్షీ సుందరేశ్వరుల నివాసము (మధుర), ద్వారక(సముద్రములో విలీనమైనది), సరస్వతీనది - అంతః ప్రవాహిని, సహ్యపర్వతము - కృష్ణానది పుట్టిన పర్వతము, గంగాసాగర సంగమము, కామాక్షీ నిలయము, నాసికా త్రయంబకము - గోదావరి పుట్టినచోటు, దాక్షారామము, బదరికాశ్రమము (నరనారాయణులు తపస్సు చేసిన చోటు) హిమాయలములలోనిది, నర్మదాతీరములోని ఓంకారు, పూరీజగన్నాథము, దక్షిణ సముద్రతీరములోని గోకర్ణము, శ్రీశైలము - ఇవి మోక్షహేతువులైన గొప్ప తీర్థములు.

శివానుగ్రహము సమకూరని నాడు మనస్సులో తీర్థయాత్ర చేయవలయుననెడి సంకల్పమే యుదయించదు. తీర్థయాత్రయందు శ్రద్ధలేని నాడు ప్రతిబంధకములైన పాపములు తొలగిపోవు. పాపములు తొలగిపోని నాడు కాశికి పోవలెనన్న యుత్సాహమే పుట్టదు. కాశీ క్షేత్ర నివాసము లేనినాడు విజ్ఞాన దీపము తన కాంతిని విస్తరింపజేయదు. జ్ఞానమువలన గాని కైవల్యము సంభవించదు. జ్ఞానమనగా ఉపనిషద్వాక్యములచేత సంభవించునది. దానినే విజ్ఞానమనీ అందురు.

No comments:

Post a comment