రామేశ్వర జ్యోతిర్లింగం:

భగవంతుడగు విష్ణువు రామావతరమునందు రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళెను. అప్పుడు సుగ్రీవుని 18 పద్మముల వానర సైన్యమును తీసుకొని శ్రీరాముడు సముద్రతీరమునకు వచ్చెను. సముద్రమును దాటుట ఎట్లు? రావణుని ఎట్లు జయించవలెను? అని ఆ స్వామి ఆలోచింపసాగెను. ఇంతలో రామచంద్రునకు దప్పిక కలిగెను. ఆ ప్రభువు నీరును అడిగెను. వానరులు మంచినీటిని తెచ్చిరి. శ్రీరాముడు ప్రసన్నుడై ఆ జలమును తీసుకొనెను. "నేను నా స్వామియు భగవంతుడగు శంకరుని దర్శించకుండా జలమునెట్లు గ్రహించగలను" అని తలంచెను. అట్లు భావించి ఆ స్వామి జలమును త్రాగలేదు. జలమునచట ఉంచి రఘునందనుడు పార్థివపూజ చేసెను. ఆవాహనాది పదహారు ఉపచారములను సమర్పించి మిగుల భక్తితో శివుని అర్చించెను. ప్రణామములు, దివ్యస్తోత్రముల ద్వారా ప్రయత్నపూర్వకముగా శంకరుని సంతోషపరచి భక్తిభావముతో ఆ స్వామిని ప్రార్థించెను. ’జయశంకర జయశివ’ అని పలుకుచూ ఆయనను స్తుతించెను. తదుపరి ఆ స్వామి మంత్ర జపమునందు, ధ్యానమునందు తత్పరుడయ్యెను. తదుపరి మరలా పూజించి శివుని యెదుట నృత్యము చేయసాగెను. అప్పుడు ఆయన హృదయము ప్రేమతో ద్రవించెను. శివుని సంతుష్టపరచుటకు ఆనంద పారవశ్యములో బిగ్గరగా కేకలు వైచుచు శివస్తుతి గావించెను. అప్పుడు భగవంతుడగు శంకరుడు ఆయన యెడల మిగుల ప్రసన్నుడయ్యెను. జ్యోతిర్మయుడగు మహేశ్వరుడు వామాంగభూతయగు పార్వతితో పార్షదగణములతో శాస్త్రోక్త నిర్మల రూపమును ధరించి అచటకు వచ్చెను.శ్రీరాముని భక్తివలన సంతోషచితుడై మహేశ్వరుడు ఇట్లు పలికెను. "శ్రీరామా! నీకు మేలగుగాక! వరమునడుగుము’. అప్పుడా స్వామి రూపమును జూచి అచటనున్న వారందరును పవిత్రులైరి. శివధర్మ పరాయణుడగు రామచంద్రుడు స్వయముగా ఆయనను పూజించెను. తదుపరి రకరకములగు స్తుతులు ప్రణామములు చేయుచు లంకయందు రావణునితో జరుగు యుద్ధమున తనకు విజయమును చేకూర్చమని ఆ దేవదేవుని ప్రార్థించెను. అప్పుడు ఆ రాముని భక్త్కి మెచ్చి "మహారాజా! నీకు జయమగుగాక!" అని శివుడు పలికెను. భగవంతుడగు శివుడొసగిన విజయపూర్వక వరమును స్వయముగా యుద్ధమునకు ఆదేశమేనని రామచంద్రుడు భావించెను. నతమస్తకుడై చేతులు జోడించి ఆయనను మరల ఇట్లు ప్రార్థించెను.
శంకరా! మీరు సంతుష్టులైనచో జగత్తునందలి ప్రజలను పవిత్రులను చేయుటకు, ఇతరుల కుపకారమొనర్చుటకు మీరిచటనే స్థిరనివాసమేర్పరచుకొనుడు.
శ్రీరాముడిట్లు పలుకగా భగవంతుడగు శివుడు జ్యోతిర్లింగ రూపమున అచట సంస్థితుడయ్యెను. ముల్లోకములయందు రామేశ్వరుడను పేరుతో ఆ స్వామి ప్రసిద్ధి చెందెను. ఆ స్వామి ప్రభావముచేత అనాయాసముగా సముద్రమును దాటి లంకను చేరెను. రావణాది రాక్షసులను సంహరించెను. తన ప్రియురాలగు సీతాదేవిని పొందెను. అప్పటినుండి యీ భూతలమున రామేశ్వరుని అద్భుతమహిమ అన్నిచోట్లా వ్యాపించెను. భగవంతుడగు రామేశ్వరుడు సదా భోగమోక్షములను ప్రసాదించును. భక్తుల కోరికలను తీర్చును. దివ్యగంగాజలముతో రామేశ్వరునకు స్నానమొనరించువాడు జీవన్ముక్తుడే. అట్టి వాడు ఈ లోకమున దేవదుర్లభమగు సమస్త భోగములను అనుభవించి చివరకు ఉత్తమ జ్ఞానమును పొంది నిశ్చితముగా కైవల్య మోక్షమును పొందును. తన మహిమను వినువారి సకల పాపములను హరించును.

No comments:

Post a comment