పుష్కరంలో ఏం చేయాలి?

పుష్కరుడి కథ - పుష్కరమంటే ఏమిటి?

పుష్కరం అంటే "పోషయతి అథవా పుష్ణాతీత పుష్కరం" పుష్టినిచ్చి పోషించేది అని అర్థం. పుష్కరాన్ని గురించి పరంపరగా ఎన్నో గాథలున్నాయి. బహుజన వ్యాప్తిలోని ఒక కథ ఇలా ఉంది. "ముద్గలుడనే మహర్షి పరమశివుణ్ణి గురించి మహాతపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ మహర్షి మరేమీ కోరుకోకుండా శివునిలో తనను లీనం చేసుకోమన్నాడు. శివుడు అతడ్ని తన అష్టమూర్తులలో ఒకటైన జలమూరతితో లీనం చేసుకుంటూ ఆ మహర్షికి పుష్కరుడని పేరుపెట్టాడు. అంతేకాక విశ్వంలోని మూడున్నర కోటి తీర్థాలకు రాజును చేశాడు. భూతత్వాన్ని కమండలంగా చేసి పుష్కరుని అందులో ఉంచి బ్రహ్మదేవునికిచ్చాడు. ఆ కమండల జలమే పుష్కరతీర్థంగా మారింది. మూడున్నరకోట్ల పుణ్య తీర్థాలతో దేవతలతో అందులో ఉంటూ అక్కడ స్నానాదులు చేసిన వారిని తరింపజేస్తున్నాడు.

ఆ పుష్క్రర తీర్థాన్ని గూర్చి తెలుసుకుందాం. పూర్వం హిమాచలంలో 'సరస్వతి' అనే నది పుట్టినది. అది వేదకాలం నాటికే ప్రసిద్ధి చెంది ఉంది. మహర్షులు ఆ నదీ తీరంలో ఉండగా వేదాలను దర్శించారు. ఆ తీరంలో వేదోక్త యజ్ఞకర్మలు ఆచరించారు. అక్కడ నుంచే ప్రపంచానికి వేదవిజ్ఞానాన్ని చాటారు. ఆ నదీ జలాల మహిమను తెలుసుకున్న మహర్షులు ఆ సరస్వతిని విద్యాధి దేవతగా గుర్తించారు. ఆ నది దక్షిణ దిశగా ప్రవహించి 'దృషద్వతి - అ వయా' అనే రెండు నదులతో కలిసి రాజస్థాన్‌ ద్వారా పశ్చిమ సముద్రం (అరేబియా సముద్రంలో) కలుస్తుండేది. తర్వాత కొన్ని వేల ఏళ్ళ క్రిందట రాజస్థాన్‌లో జరిగిన భూపరిణామాల వల్ల సరస్వతి ప్రవాహం పైకి పారకుండా భూమిలో ఇంకిపోయి సమీపంలో ఉండే యమునా నదిలో కలిసిపోయింది. ప్రయాగలో ప్రస్తుతం గంగ, యమునలు కలుస్తున్న యమునలో సరస్వతి అంతర్వాహినిగా ఉన్న సంగతిని తెలుసుకున్న ఋషులు సరస్వతిని కలుపుకొని త్రివేణీ సంగమమని అంటున్నారు. సరస్వతి ఇప్పుడు కొన్ని మడుగులుగా మారి మిగిలిపోయింది. ఆ మడుగులో పుష్కర తీర్థం ఒకటి. 'మహా భారతంలో పుష్కర తీర్థ ప్రస్తావన ఉంది.

" కురుక్షేత్రే గయాం గంగాం! ప్రభాసం పుష్కరం చ యత్‌
ఏతాని పుణ్యతీర్థాని! ధ్యాత్వా మోక్షమవాప్నుయాత్‌"

నారద పద్మ పురాణంలో గూడా పుష్కర తీర్థం వర్ణించబడింది. ప్రసిద్ధ బౌద్ధక్షేత్రమైన 'సాంచీ'లో దొరికిన 3వ శతాబ్దినాటి శిలాశాసనంలో పుష్కర తీర్థ ప్రశంస ఉన్నది. రాజస్థాన్‌లోని అజ్మీరుకు 36 కి.మీ దూరంలో ఉన్న పెద్ద సరస్సును ఆ ప్రజలు 'పోఖరా' అంటున్నారు. అదే పుష్కర తీర్థం. వేదరాశి జన్మించిన పవిత్రనదీ భాగమైనందున మహాపవిత్రమైంది.

పుష్కరుడంటే వరుణదేవుడని ఒకచోట, మహాపుణ్య పురుషుడని ఒకచోట, పుష్కరమంటే తీర్థమని, సరస్సు అనీ పురాణాలు రకరకాలుగా వర్ణించాయి. పుష్కరుడ్ని బ్రహ్మ సృష్టి చేసాడని, అతడు శివుడి కోసం తపస్సు చేశాడని కూడా కొన్ని పురాణాలు వివరించాయి. పుష్కరుడ్ని తీర్థరాజు అని పిలుస్తారు. ఈలోకంలో నదులన్నీ తమలో స్నానం చేసిన వారి పాపాలన్నింటినీ స్వీకరించడం మూలంగా వాటి పవిత్రత క్షీనించడాన్ని గమనించి పుష్కరుడు చాలా చింతించేవాడు.

ఒకనాడాయన పరమశివుడి కోసం తపస్సు చేసి నదుల దోషాలన్నింటినీ ప్రక్షాళనం చేసే మార్గాన్ని అర్థించాడు. శివుడికి గల ఎనిమిది దేహాలలో జలరూపమైన దేహాన్ని తనకనుగ్రహించమని కోరాడు. దాని ప్రభావం వల్ల పుష్కరుడికి అనంతమైన శక్తి ప్రాప్తించింది. నదులలో పాపాలన్నింటినీ తొలగించగల ప్రభావం లభించింది. అందుకే నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివసించవలసిందిగా అభ్యర్థించసాగాయి. అటు పిమ్మట పన్నెండు పుణ్యనదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. ఈ ఏర్పాటు సురగురువైన బృహస్పతి సంచారాన్ని అనుసరించి నిర్ణయమైనది. అంటే మేషరాశి, వృషభరాశి, మిధునరాశి, ఇలా వరుసగా 12 రాసులలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో అప్పుడే పుష్కరుడు కూడా ఆయా నదులలో నివసించేలా ఏర్పాటయింది. కనుక ప్రతీ నదికీ 12 ఏళ్ళకోసారి పుష్కరుడి ఆగమనం సంభవిస్తుంది. అంటే ప్రతినదీకి 12 ఏళ్ళకు ఓసారి పుష్కరాలు వస్తాయి.

పుష్కరాలు వచ్చినపుడు ఆనదిలో స్నానం చేస్తే మూడున్నరకోట్ల తీర్థాలలో స్నానంతో సమానం అన్నమాట. ఇలా పన్నెండు పుణ్యనదులకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలొచ్చే క్రమం ఇదిగో ఈ వరసలో ఏర్పాటయింది.

శ్లోకం|| మే షే గంగా వృషే రేవా గతేయుగ్మే సరస్వతీ
యమునా కర్కటేచైవ గోదాసింహం గతేపిచ
కన్యాయాం కృషవేణీచ కావేరీచ తులాగతే
వృశ్చికేస్యాద్భీమరథీ చాపే పుష్కరవాహినీ
మృగే తుంగా ఘటే సింధుః ప్రణీతా తటనీ ఝషే
తిష్ఠన్న బ్దాత్సురగురుః క్రమాత్సర్యే మునీశ్వరాః

సురగురువగు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపుడు గంగానదీ పుష్కరము, వృషభరాశినందు ప్రవేశించినపుడు నర్మదానదీ పుష్కరము, మిధున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరము, కర్కటరాశి యందున్నచో యమునా నదికి, సింహరాశి యందున్న గోదావరికీ నదికీ, కన్యారాశియందు కృష్ణానదికి, తులయందు కావేరి నదికి, వృశ్చికరాశి యందు బీమరథీనదికి, ధనూరాశి నందు పుష్కరనదికి, మకరము నందు తుంగభద్రానదికి, కుంభమందు సింధునదికి, మీనరాశియందు ప్రణీతానదికి పుష్కరం.

పుష్కరంలో ఏం చేయాలి?

పరమ పవిత్రము, దుర్లభము అయిన పుష్కరము నదులకు వచ్చినపుడు ఆస్తిక జనులు తప్పక ఆచరించవలసిన కొన్ని కర్మలను శాస్త్రకర్తలు విధించినారు. వాటిని శ్రద్ధతో ఆచరిస్తే విశేష ఫలములు కలుగుతాయి. ఆ విధులు ఇలా ఉన్నాయి.

1. స్నానం: నదిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేసి విధిప్రకారం కొందరు దేవతలకు ఆర్ఝ్యాదులు వదలవలెను.

2. పుష్కరాదుల పూజ: స్నానం చేసి బయటకి వచ్చి ఒక సమతల ప్రదేశంలో కూర్చుని యధావిధిగా నదికి - బృహస్పతికి - పుష్కరరాజుకు విడివిడిగా షోడశోపచార పూజలు చేయవలెను. నదిలో అనుకూలముండదు. తొందర అవుతుంది.

3. పితరులకు శ్రాద్ధ తర్పణాలు: పుష్కర కాలంలో నదీతీరంలో తమ పితరులకు శ్రాద్ధకర్మలు చేయవలెను. అందువల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ శ్రాద్ధకర్మ వల్ల మరణించిన వారికి పుణ్యలోక ప్రాప్తి చేసిన వారికి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలకు పిండాలు పెట్టి శ్రాద్దం చేయలేని వాళ్ళు పెద్దల పేరు మీద నువ్వులు నీళ్లతో తర్పణాలైనా వదలవలెను.

4. దానాలు: పుష్కర సమయంలో తమ తమ శక్తికి తగినట్లు దశదానాలలో వేటినైనా దానం చేయవలెను.

దశదానాలంటే - 1. గోదానము, 2. భూదానము, 3. హిరణ్యదానము (బంగారు), 4. రౌప్యదానము (వెండి), 5. వస్త్రదానము (పంచలుగాని, సెల్లాగాని), 6. తిలదానము (నూవులు), 7. ఆజ్యదానము (పాత్రలో నెయ్యి వేసి చ్చుట), 8. ధాన్యదానము (ఒక పాత్రలో బియ్యం పోసి ఇవ్వడం), 9. గుడదానము (బెల్లం), 10. లవణదానము (ఉప్పు) ఈ దానాలు శక్తి ఉన్నవాళ్లకు, లేనివాళ్ళకూ అనుకూలంగా ఉన్నాయి. ఈ విధులు ఆచరించుటతో పుష్కరంలో కర్తవ్యం నిర్వహింనట్లు కాగలదు.

పుష్కర స్నానం - నియమాలు

పుష్కరస్నానానికి గాని, తీర్థస్నానానికి గాని వెళ్ళినపుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు పాటించడం ఉత్తమం.

తీర్థ స్థలానికి చేరిన రోజు ఉపవాసం చేయడం వాటిలో ఒకటి.

దంపతులు కలిసే స్నానం చేయాలి. బ్రహ్మముడి వేసుకుని ఈ స్నానం చేయాలి.

పురుషులు శిఖమాత్రమే ఉంచుకుని శిరోమండనం చేయించుకోవాలి. స్త్రీలు శిరోమండనం చేయించుకోరాదు.

తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.

పుష్కర దినాలలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.

సమీప బంధువులకు, పిండ ప్రదానం చేయవచ్చు. తర్పణం విడవవచ్చు. స్నేహితులకూ ఆత్మియులకూ పిండ ప్రదానం చేస్తే సరిపోతుంది.

పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.

తీర్థాల సమీపంలో మలమూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, బట్టలు ఉతకడం చేయరాదు.

స్నానం చేసే సమయంలో నిట్టనిలువుగా మూడు సార్లు మునకలు వేయాలి.

సంప్రదాయం కోసమే కాకుండా ఆరోగ్య కరమైన వాతావరణం కోసం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

ఏ రోజు ఏ దానం

మొదటి రోజు - సువర్ణ, రజిత, ధాన్య, భూదానలు.

రెండోవ రాజు - వస్త్ర, లవణ, ధేను, రత్న ధానాలు.

మూడవ రోజు - అశ్య, శాక, ఫల దానాలు.

నాల్గవ రోజు - ఘృత, తైల, క్షీర, మధు దానాలు.

ఐదవ రోజు - ధాన్య, శకట, మహిష, వృషభ, హల దానాలు.

ఆరవ రోజు - ఔషద, కర్పూర, కస్తూరి, చందన దానాలు.

ఏడవ రోజు - గృహ, పీఠ, శయ్య, ఆందోళికా దానాలు.

ఎమిదవ రోజు - చందన, పుష్పమాల, మూల ఆథృక దానాలు.

తొమ్మిదవ రోజు - పిండ, దాసీ, కన్య, కంబళ దానాలు.

పదవ రోజున - శాక, సాలగ్రామ, పుస్తక దానాలు.

పదకొండవ రోజు - గజాది దానాలు.

పన్నెండవ రోజు - తిల అజాది దానాలు

దాన ఫలితాలు

సువర్ణ, రజత దానాలతో - సుఖ భోగాలు

భూ దానం - భూ పతిత్వం

వస్త్రదానం - వసులోక ప్రాప్తి

గోదానం - రుద్ర లోక ప్రాప్తి

అజ్వదానం - ఆయుర్వృద్ధి

ఔషధ దానం - ఆరోగ్యం

సాలగ్రామ దానం - విష్ణులోకం

గృహదానం - ధన సౌఖ్యం

శయ్యా దానం - స్వర్గ సుఖాలు

తిలదానం - ఆపదల నివారణ

No comments:

Post a Comment