విఘ్నేశ్వర పూజ

మనకి దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉన్నది శేన్బక్కమ్ అని. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసురసంహారానికి బయలుదేరాడు. రథం కదలలేదు. ఎందుకు కదలలేదు అని ఆశ్చర్యపోయాడు. విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు. పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు. చేశాక రథం కదిలింది. చిత్తూరు దగ్గరలో షేన్బక్కమ్ అని ఊరు ఉంది. ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన మంత్రిగారు ఒకాయన రథంలో వెళ్ళిపోతున్నాడు. ప్రదోషవేళ కొంచెం చీకటిపడింది. రథచక్రానికి ఏదో తగిలి విరిగిపోయింది అని ఆయన రథం దిగాడు. రథచక్రం నెత్తుటితో తడిసిపోయి ఉన్నాయి. ఆయన హడలిపోయి ఇదేమిటి ఇంత పెద్ద నెత్తుటి ప్రవాహం వచ్చింది అని చెప్పి దీపాలు తెప్పించి జాగ్రత్తగా చూశాడు. చూస్తే భూమిలోనుంచి ఒక తలలాంటిది పైకి వచ్చింది. దానికి దెబ్బ తగిలింది. ఆయన మనస్సు చిన్నబుచ్చుకొని రేపు ప్రొద్దున ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకొని పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. "ఈ క్షేత్త్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను. ఎనమండుగురు వినాయకులుగా ఉన్నాను. ఇవ్వాళ నీ రథ చక్రం వెళ్ళడానికి ముందు వర్షం పడింది. తల మొన పైకొచ్చింది. నీయొక్క రథచక్రం తగలడం చేత నా శిరస్సు భిన్నమైంది. కాబట్టి నీరథం ఆగిపోయింది. రేపటిరోజున సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తరువాత వెళ్ళు." అన్నాడు. ఆయన మరునాడు భూమినంతటినీ జాగ్రత్తగా మట్టితీయించి చూశాడు. అష్టవినాయక స్వరూపాలు భూమిలోనుంచి పైకి వచ్చి ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పైన అంతా ఇనుప ఊచలతో ఉంటుంది. వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది. ఎనమండుగురు మూర్తులకీ కూడా పూజ చేస్తారు. ఎంత క్లేశంలో ఉన్నవాళ్ళూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అ కష్టంనుంచి వినిర్ముక్తులౌతూంటారు. చిత్తూరు దాటి జ్వరహరేశ్వర క్షేత్రం అని ఉంది. అది దాటి వెళుతూంటే కనపడుతుంది. అంతగొప్ప క్షేత్రం. కర్తవ్యంలో మినహాయింపులుండవు ఆయనకి.
తమిళదేశంలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. ఎవరికైనా ఆ రోజు తలపగిలిపోవలసి ఉంది అనుకోండి అటువంటి వాడి తలపగిలిపోకుండా పెద్ద దెబ్బ తగిలికూడా వాడు బ్రతికి ఉండాలి అంటే వాడు అంతకుముందు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఉంటే వదిలిపెట్టేస్తాడు.
కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వర స్వరూపులు, ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారికి. ఒకానొకప్పుడు ఈ క్షేత్రం దగ్గర మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతున్నారు ముందు. వెనక జయేంద్రసరస్వతీ స్వామి వారు ఏనుగుమీద వెళ్తున్నారు. మహాస్వామి వేగంగా నడుస్తూ ఇంచుమించు ఒక మైలు దూరం ముందుకు వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఏనుగుకి పిచ్చెక్కినట్లు అయిపోయి పైనుంచి జయేంద్రసరస్వతీ స్వామి వారు క్రిందపడిపోతారేమోనని పరివారమందరూ భయపడ్డారు. పరుగుపరుగున పరివారమంతా మహాస్వామి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. మహాస్వామి వారు వెంటనే కళ్ళుమూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు ఎందుకలా జరిగింది అని. కళ్ళు తెరిచి అన్నారు -"కొద్ది దూరంలో శేన్బక్కం క్షేత్రం ఉంది. దానిని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేశాను. వెనక చిన్నస్వామి కూడా విచ్చేశారు. అందుకే విఘ్నేశ్వరుడు ఆ ఏనుగుకి భ్రాంతి కలిగేటట్లు చేశాడు. వెంటనే వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టండి" అన్నారు. మనం సాధారణంగా కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తాం. ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు. రెండు ముక్కలకన్నా ఎక్కువ ముక్కలవ్వాలి. అలా అయ్యి పిల్లలు కానీ దానిని తీసుకుంటే పీడాపరిహారం. విఘ్నేశ్వరుడొక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. అవమాన భారంతో ఇక పదిమందితో తిరగలేడు; తల చిట్లిందా ప్రాణములు నిర్గమిస్తాయి. అటువంటి వాడిని కొబ్బరికాయ చిట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బ్రతికించేస్తాడాయన. ఒక కొబ్బరికాయకు ఒక తలకాయ నిలబెడతాడు. అంతటి అనుగ్రహశీలి.

No comments:

Post a comment