కలౌ కపిః

కలి ప్రభవాన విపరీత,వైచిత్ర్య దృక్కులు గల మనుజునికూడా అనుగ్రహించి సమాధాన పరచగల భక్త సులభుడు,దయాళువు ఒక్కడే ఒక్కడు ..ఆయనే మన ఆంజనేయ స్వామి వారు..అందుకే కలౌ కపిః అన్నారు.

ఆంజనేయః పూజితశ్చేత్ పూజితస్సర్వ దేవతాః 
హనుమన్మ హిమశక్యో బ్రహ్మణాపిన వర్ణితుం 

బ్రహ్మదేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ ! ఆయనను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే.
రామాయణ మహాయఙ్ఞంలో రాముడు "యాజి" కాగా ,సహకార్య నిర్వాహణ పరతంత్రుడైన శ్రీ ఆంజనేయస్వామి ఋత్విజుడయ్యాడు.

శ్రీ హనుమంతుడు ఒక మంత్రి ( సుగ్రీవునకు) , సేనానాయకుడు (వానర సేనకు) సలహాదారుడు (విభీషణునకు అభయమిచ్చినప్పుడు) , దౌత్య నీతివేత్త (హనుమద్రాయబారం),మహాసత్త్వుడు (వార్ధిలంఘనం),కార్యశీలి (సంజీవన పర్వత హరణం) , ఘనకార్యనిర్వాహణతంత్రయఙ్ఞుడు ( అహిరావణుని బంది నుండి రామలక్ష్మణులను విడిపించుట) ,గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త (కోసలరాజు కోశాగారం నింపుట) , ఆడిన మాట తప్పని సత్య శీలి ( యయాతి రక్షణ) , వినయశీలి ( తనకన్న హీనసత్వులైన జాంబవాదుల గౌరవించుట) , కర్తవ్యవిమూఢత నెఱుగని మహాతపస్వి ( శ్రీ రామ దాస్యత్వం) , సత్య సౌర్యధుని, స్థితి ప్రఙ్ఞుడు , కళానిధి , ప్రఙ్ఞాధౌరేయుడు.
తన జీవితమంతా ఇతరుల సేవలో వినియోగించిన నిస్స్వార్ధ జీవి !
ఆయన మనకు ఆదర్శప్రాయుడు,ఇదే హనుమ తత్త్వం. ఇదే హనుమద్ధర్మం. ఈ హనుమ తత్త్వాన్ని అవగాహన చేసుకుని, ఈ సద్గుణ సిద్ధికి నిత్య సాధకులమై, ఆయన మార్గాన మనోవాక్కాయ కర్మలచే చరించడమే సత్యమైన హనుమత్సేవ!
ఆ త్రిమూర్త్యాత్మకుని అనుగ్రహాన్ని పొందడానికి ఇదే ఎకైక సాధన.


ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ సంభూత! వానరనాయక! సకల వేదశాస్త్ర పారగ! సంజీవి పర్వతోత్పాటన! లక్ష్మణ ప్రాణరక్షక! గుహప్రాణదాయక! సీతాదుఃఖ నివారణ! ధాన్యమాలీ శాపవిమోచన దుర్దండీ బంధవిమోచన! నీలమేఘ రాజ్యదాయక! సుగ్రీవ రాజ్యదాయక! భీమసేనాగ్రజ! ధనంజయ ధ్వజవాహన! కాలనేమి సంహార! మైరావణ మర్దన! వృతాసుర భంజన! సప్త మంత్రిసుత ధ్వంసన! ఇంద్రజిద్వధకారణ! అక్షకుమార సంహార! లంకిణీ భంజన! రావణమర్దన! కుంభకర్ణ వధపరాయణ! జంబూ మాలి నిషూదన! వాలినిర్హరణ! రాక్షసకుల దాహన! అశోకవన విదారణ! లంకాదాహక! శతముఖవధకారణ! సప్తసాగర వాలసేతు బంధన! నిరాకార నిర్గుణ సగుణ స్వరూప! హేమవర్ణ పీతాంబరధర! సువర్చలా ప్రాణనాయక! త్రయస్తింశత్కోట్యర్బుద రుద్రగణపోషక! భక్తపాలనచతుర! కనకకుండలాభరణ! రత్న కిరీట హార నూపుర శోభిత! రామభక్తి తత్పర! హేమరంభావన విహార! వక్షతాంకిత మేఘవాహక! నీలమేఘశ్యామ! సూక్ష్మకాయ! మహాకాయ! బాలసూర్యగ్రసన! ఋష్యమూక గిరి నివాసక! మేరు పీఠకార్చన! ద్వాత్రింశతాయుధధరా! చిత్రవర్ణ! విచిత్ర సృష్టినిర్మాణకర్తా! అనంతనామ! దశావతార! అఘటన ఘటనా సమర్థ! అనంతబ్రహ్మన్! నాయక! దుర్జనసంహార! సుజనరక్షక! దేవేంద్రవందిత! సకలలోకారాధ్య! సత్యసంకల్ప! భక్తసంకల్పపూరక! అతిసుకుమారదేహ! అకర్దమ వినోదలేపన! కోటి మన్మథాకార! రణకేళిమర్దన! విజృంభమాణ! సకలలోక కుక్షింభర! సప్తకోటి మహామంత్ర తంత్ర స్వరూప! భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన! శివలింగ ప్రతిష్ఠాపనకారణ! దుష్కర్మ విమోచన! దౌర్భాగ్య నాశన! జ్వరాది సకలరోగహర! భుక్తి ముక్తిదాయక! కపటనాటక సూత్రధారీ! తలావినోదాంకిత! కళ్యాణ పరిపూర్ణ! మంగళప్రద! గానప్రియ! అష్టాంగయోగ నిపుణ! సకల విద్యా పారీణ! ఆదిమధ్యాంతరహిత! యజ్ఞకర్త! యజ్ఞభోక్త! షణ్మత వైభవసానుభూతి చతుర! సకల లోకాతీత! విశ్వంభర! విశ్వమూర్తే! విశ్వాకార! దయాస్వరూప! దాసజన హృదయకమల విహార! మనోవేగగమన! భావజ్ఞ నిపుణ! ఋషిగణగేయ! భక్తమనోరథదాయక! భక్తవత్సల! దీనపోషక దీనమందార! సర్వస్వతంత్ర! శరణాగత రక్షక! ఆర్తత్రాణ పరాయణ! ఏక అసహాయవీర! హనుమాన్! విజయీభవ! దిగ్విజయీభవ! దిగ్విజయీభవ!

No comments:

Post a comment