కలరా, మసూచి మొదలగు సాంక్రామిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండునట్లు గ్రామవాసులు పూజించు నిలువున నాటిన పెద్దరాయి. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా గ్రామ మధ్యమున నెలకొల్పిన శిల. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల బ్రాహ్మణులు, మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమున యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు.
గ్రామదేవతలు
మనదేశంలో మాతృదేవతా స్వరూపాలైన గ్రామదేవతలు గ్రామాలలో స్థిరపడి, వారు నిర్వహించే విధులననుసరించి విభిన్న పేర్లతో చలామణి అవుతున్నారు. గ్రామదేవతల్లో స్త్రీ దేవతలే గాక పురుష దేవతలు కూడా వున్నారు. వీరితో పాటు వృక్ష , జంతు సంబంధమైన దేవతలు కూడ పూజింపబడుచున్నారు. అయితే జానపదులు స్ర్తీ దేవతకు ఇచ్చినంత ప్రాముఖ్యత పురుష గ్రామదేవతలకు యివ్వలేదు. గ్రామీణుల దృష్టిలో మాతృదేవత అందరికంటే అధికురాలు, గ్రామీణులచే శక్తి దేవతగా పూజింపబడుతున్న మతృ దేవత అంబిక, భద్రకాళి, చాముండి, కాళి, కామాక్షి, కన్యాకుమారి, మహేశ్వరి అనబడు పేర్లతో భారతదేశమంతటా పూజింపబడుతోంది.
నాదృష్టిలో గ్రామదేవతలు ముక్కోటి దేవతలలోవారే. ముక్కోటి అంటే ఒక పరిమిత సంఖ్య అని కాదు. అనంతమని అర్థం. గ్రామదేవతలు - శిష్ట దేవతలు అనికొందరు దేవతలను విభజిస్తారు. సామాన్యంగా గ్రామదేవతలు జన సామాన్యంపూజించేవి. ఇక్కడ వైదిక, ఆగమ, పౌరాణిక సంబంధమైన పూజలు, సంస్కృతమంత్రాలు ఉండవు.ఒకప్పుడు విరివిగా జంతుబలులు ఉండేవి. ఒకొకఊరిలో ఒకొక కులం వారు పూజారులుగా ఉంటారు. కాని గ్రామంలో అందరూ ఆదరిస్తారు. పూర్వం మశూచి, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు "అమ్మవారు పోసింది" అనేవారు.వేపమండలు రోగి గదివద్ద కట్టేవారు. ఆ సమయాల్లో అమ్మవారికి ముడుపులు కట్టేవారు.
No comments:
Post a Comment