తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు.
ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికి పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని దూషిస్తున్నావు ? ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దూషణలను చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షమించమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు.
శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" అని హితోబోధ చేసారు.
No comments:
Post a Comment