"ఒకానొక సమయమందు విష్ణ్వంశ తో ఒక కుమారుని పుట్టించాలని సంకల్పించిన బ్రహ్మకు హృదయ స్థానం నుంచి నవ యవ్వన విలాసిని యైన ఓ కన్య ఆవిర్భవించింది. ఆమె పేరే సంధ్య.
ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన దక్ష - మరీచ్యాదులు అక్కడే ఉన్నారు. ఆ కన్యను చూసి అంతా ఆశ్చర్య పోతుండగా, అంత లోనే ఆమెకు కవల సోదరుడా అన్నట్టు బ్రహ్మ హృదయ కమలం నుంచి ఒక నవ యువకుడూ ఊడి పడ్డాడు అక్కడ.
స్త్రీల కన్నా సమ్మోహన కారుడై, అత్యంత దర్ప విలసితుడై ఉన్న ఆ యువకుడు చెరకువిల్లు నూ, పంచ సంఖ్య కలిగిన బాణాలనూ ధరించి ఉన్నాడు. జన్మిస్తూనే బ్రహ్మకు నమస్కరించి తనకొక పేరూ పదవీ కావాలన్నాడు. ఏదో ఒక వ్యాపకం కల్పించ మంటూన్న ఆ యువకుడిని చూస్తుంటే ఎవరికీ నోరు మెదపాలని కూడా అనిపించక నిర్నిమేషులై అలా చూడ సాగారు. తెలియని ఏదో చిత్రమైన వికారానికిలోను కా సాగారు అందరూ.
ముందుగా ఆ మోహం లోంచి కాస్త తెప్పరిల్లాడు బ్రహ్మ. దర్శించినంత మాత్రాన మోహం పుట్టిస్తున్నావు. ఇక నీకు వేరే వ్యాపకం అనవసరం! ఆ పనే చేస్తుండు. నీకున్న పూలబాణాలతో సర్వప్రాణుల్నీ సమ్మోహన పరుస్తుండు. స్త్రీ, పురుషులు నీ బారినపడి, కామంలో చిత్త చాంచల్యం కలగజెయ్యి. నీ రహస్య సంచారానికి తిరుగు లేదు. భావజుడవు నీవు. తలచినంత మాత్రాన వచ్చి వ్రాలగలవు. నీధాటికి త్రిమూర్తులైనా చలించాల్సిందే! పుడుతూనే మనోచాంచల్య కారకుడవు కనుక మన్మథుడు అనే పేరు నీకు సరిపోతుంది. కామోద్దీపకుడవు కనుక, నిన్ను కామదేవుడనీ అనగలం. గొప్పదర్పం కలిగిన వాడవు కనుక కందర్పుడనీ వ్యవహరిస్తాం. మదనుడు, మారుడు, సుమశరుడు, పుష్ప చాపుడు, పంచశరుడు, స్మరుడు, మనసిజుడు, పుష్పధన్వుడు, ఆత్మభువు... ఇవన్నీ నీ పేర్లే. అని అక్కడ సభలోనున్నవారంతా వివిధరీతుల మదన కుమారుడ్ని శ్లాఘించారు.
తనకంటూ ఒక వ్యాపకం కల్పించగానే, అది అక్కడికక్కడే నిర్వర్తించబోయాడా అత్యుత్సాహి. చకచకా పూలబాణాలను అక్కడున్న వారిమీద ఎడాపెడా ప్రయోగించేశాడు. అన్నిటికంటే పెద్ద చిక్కొచ్చి పడింది బ్రహ్మదేవుడికి. సరిగ్గా అంతకు కొద్దిసేపటి క్రిందటే, మన్మథునితో పాటే జన్మించిన నవయువతి, కుసుమకోమలి, బ్రహ్మ మానసపుత్రి మీదనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ అవస్థ బ్రహ్మకు కూడా తప్పలేదు.
ఘోరమైన తప్పిదం జరగకుండా ధర్మదేవత సకాలంలో స్పందించి అడ్డుపడబట్టి సరిపోయింది. తక్షణమే అక్కడ మృత్యుంజయుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మనూ, ఆయన మానస పుత్రులనూ మందలించాడు. వావివరసలు మరచి కామించబోయిన వారందరికీ కామోపసంహారం చేసి అదృశ్యుడయ్యాడు మహాదేవుడు.
బ్రహ్మకు ముచ్చెమటలు పోశాయి. చిరాకు అధికమైంది. శివునితో చెప్పించుకోవలసి వచ్చినందునకు లజ్జితుడై, ఆ చిరాకును మన్మథుని మీద ప్రసరింపచేశాడు. 'నాలుగు ముఖాలున్నా ఏం లాభం? పరువుపోయక ఏ ముఖం పెట్టుకుని దేవతలందరికీ పెద్దదిక్కుగా వ్యవహరించగలను? ఇదంతా నీ వల్లనే జరిగింది కనుక - పరమశివుడంతటి వాడిని రప్పించేలా, నాకు నీతులు చెప్పించేలా చేశావు కనుక ఆ ముక్కంటి మూడోకంటి అగ్ని చేత నీవు దహింపబడెదవుగాక!' అని శపించేశాడు విధాత.
ఉద్యోగధర్మ నిర్వహణ చేశానంటాడు మన్మథుడు. అయినప్పటికీ వావివరసలు చూడకూండా కామవికారం పుట్టించావు అంటాడు ప్రజాపతి.
తనతప్పు లేదంటాడు కాముడు. అసలు... కామం యొక్క గుణమే అంత! దాని స్వభావం అది, ఎలా అతిక్రమిస్తుంది? కుమారుడి వాదనలో బలం ఉందని గ్రహించిన చతురాననుడు, చతురంగా తన శాపాన్ని సమర్థించుకున్నాడు . సరే! నీవు త్రినేత్రుడి ధాటికి మాడిమసైనా, నీ ప్రమేయమే లేకుంటే సృష్టి జరగదు కనుక, అ పరమేశ్వరానుగ్రహాన తిరిగి నీవు జీవించగల్గుతావు అని శాపోపహతి చెప్పాడు స్రష్ట. అంతలో - బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుని స్వేదం నుంచి ఓ మనోహరాంగి ఉద్భవించింది. శృంగార సీమలకు పట్టపురాణి అనదగ్గ ఆ కన్యకామణికి 'రతి' అని నామకరణం చేసి, మదనుడి వంక చూశారందరూ.
సర్వులనూ మోహింపచేసే మన్మథునికే, మదనవికారం కలిగించేలా ఉన్నది అ రమణీయమూర్తి. కామకారకుడికి కొంతవరకు అతని వృత్తి ఉధృతిని తప్పించగల తరుణీమణి ఆమెయే అని తోచింది అందరికీ. స్త్రీ పురుషలు సంభోగించడానికి ఎన్ని పద్ధతులున్నాయో అన్నిటినీ ప్రయోగిస్తూ వారిరువురూ ఆనంద డోలికల్లో ఊగసాగారు. అంతేకాక ఎన్నో కొత్తరీతులను ఆవిష్కరించే ప్రయత్నాల్లోనూ పడ్డారు. అదీ మన్మథగాథ! ఈ గాథ ఆసాంతం విన్నా, చదివినా, శృంగార సీమల్లో విహరించు వారి సర్వాభీష్టములు నెరవేరునట్లు బ్రహ్మ అనుగ్రహించాడు. అయితే మన్మథదహనం అంత స్వల్పకాలిక వ్యవధిలోనే జరుగలేదు. ఈ నడిమి కాలంలో మరికొంత కథ నడిచింది" అన్నాడు సూతుడు.
అది కూడా సవిస్తరంగా వినిపించమని కోరారు శౌనకాది మహర్షులు.
No comments:
Post a Comment