హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు.
శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
No comments:
Post a Comment