మాండవ్యుడు ( 'చేసిన పాపానికి శిక్ష అనుభవింపక తప్పదు' --అని తెలియచెప్పే కధ)



మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య, ధర్మములను ఆయన బహునిష్టతో ఆచరించేవాడు. మౌన వ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలో గల ఒక చెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అలా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు అ అశ్రమ ప్రాంతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుము కుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమీ చేయడానికి తోచలేదు. వారి వద్ద నున్న దొంగలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యుని అశ్రమంలో దాచి పారిపోయారు. రాజభటులు తర్వాత అచ్చటకు చేరారు. దొంగలు ఆశ్రమంలో దాగియుంటారని భావించి ఆ ఆశ్రమాన్ని వెదికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించాయి. బయట వెదికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్వివలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌన వ్రతంలో నున్న ముని మాట్లాడలేదు.
వారు పిదప దొంగలనందరునూ బంధించి వారితో మునిని కూడా బంధించి తీసుకువెళ్లారు. అందరినీ రాజసమ్ముఖంలో నిలబెట్టారు. ఆ చక్రవర్తి చౌర్య నేరానికి వారందరకూ మరణదండన విధించాడు. అందరితోబాటు మహర్షిని కూడా అ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కాని అ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహారపానియాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తి వల్ల జీవించి ఉన్నాడు. అట్లే ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర ఋషులను పిలవసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపు నందుకుని పక్షిరూపాలలో రాత్రిపూట వచ్చి అ మహాత్మునికి కల్గిన దుస్థితికి విచారించి, "మహర్షీ ! ఏ కారణం చేత నీకీ స్థితి కల్గినది?" అని ప్రశ్నించారు. ఆ ధర్మశీలి తన ప్రారబ్ధమునకు మరొకరిపై నిందారోపణ చేయదల్చుకోలేదు. శిక్ష వేసినా మహర్షి మరణించకపోవడం,రాత్రిపూట పక్షులు వానితో సంభాషించడం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వారు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమార్పణ చెప్పుకుని అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగబోయారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకుని మిగి లిన భాగాన్ని నరికివేశాడు. శూలాగ్ర బాగాన్ని "అణి " అని పిలుస్తారు. అణి శరీరమందు కలవాడు కాన ఆయన అణి మాండవ్యుడైనాడు. శరీరంలో శూలమున్నా ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు.
ఒకనాడు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచి, "యమధర్మరాజా! నాకు ఊహ తెల్సిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాత దశలో చేసిన ఏ పాపానికి నాకు శిక్ష వేశారో చెప్ప" మని కోరాడు. అంత యమధర్మరాజు మహర్షీ! మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దాని వల్ల మీకు ఈ స్థితి కల్గిందని చెప్పాడు. చూడండి! అల్ప దానం మహా ఫలాన్నిచ్చినట్లే స్వల్ప పాపం కూడా అత్యంత కష్టాలనిస్తుంది గదా!

No comments:

Post a Comment