వ్రతాలలో పూజించినటువంటి వినాయకుడు హరిద్రా గణపతి. "తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్" - విఘ్నాలన్నీ తొలగించుకోవడం కోసమని తొలుతగా గణపతిని పసుపు ముద్దలో అర్చిస్తూ ఉంటాం. ఈ గణపతిని అర్చించే సమయంలో కొంతమంది పసుపు ముద్ద రూపంలో అర్చించగా మరికొంతమంది వక్క రూపంలో కూడా అర్చిస్తూ ఉంటారు. ఏమైతేనేం? గణపతిని అర్చించిన తర్వాత ఆ గణపతి పసుపు ముద్దను "గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర" అంటూ ఆయనను పంపించివేశారు. అంతటి మహాశక్తి ఈ పసుపుముద్దలో వచ్చింది, కేంద్రీకృతమైంది, మనలను అనుగ్రహించింది, తిరిగి విశ్వంలోఉండే చైతన్యభాగంలో లీనమైంది అనుకున్నప్పటికీ ఆ పసుపు ముద్దలో ఇంకా చైతన్య స్వరూపం మిగిలే ఉంటుంది. కనుక సంపూర్ణమైన గౌరవంతో ఆ పసుపు ముద్దను ఇల్లాలి చేతికి అప్పగించాలి. ఇల్లాలు ఆ పసుపుముద్దను ముఖంపైన అలదుకోవచ్చును. లేదా ఆ పసుపుముద్దను తీసుకువెళ్ళి తులసికోటలో పెట్టవచ్చు. రోజూ నీళ్ళు పోస్తూ వుంటే కోటలో కలిసిపోతుంది.
No comments:
Post a Comment