ఓషధులు అమృతం వంటివి. పూలు పూచే చెట్లు శ్రేష్ఠమైనవి. పూలతో పూజించేవారికి మంచి మనస్సు కలుగుతుంది. అందుకే పూలను ’సుమనస్సులు’ అంటారు. పూలతో పూజించే మానవుల కోర్కెలను దేవతలు మంచి మనస్సుతో తీరుస్తారు. అందుకే వారికి ’సుమనస్కులు’ అని పేరు వచ్చింది. పూలవాసనలతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులూ, వాటి అనుభవంతో పాములూ, ఆ మూడు పద్ధతులతో మానవులూ ప్రీతి పొందుతారు. పూల పూజలతో దేవతలు వెంటనే భక్తుల కోర్కెలు తీరుస్తారు. ధూపం వలన భక్తుడు పుష్టినీ, ఆయువునూ పొందుతాడు. దీపం వెలిగించటమంటే వెలుగును ప్రసాదించడం. దీపారాధన వల్ల భక్తుడు హృదయం పరమాత్మ ధర్మాలను చూచే స్వభావం కలది అవుతుంది. బాటలోని చావడిలో, దేవాలయం మీదా, కొండమీదా దీపం పెట్టిన వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆవునేయితో దీపం వెలిగించి దానం చేస్తే జ్యోతిర్లోకసిద్ధీ, కులప్రకాశం, మహాజ్ఞాన వికాసం కలుగుతాయి. దేవతలకు మొదట నైవేద్యం ఇచ్చి తరువాత భక్తుడు భుజించాలి. లేకఫోతే బుద్ధిహీనుడూ, రాక్షసుడూ కావడం తథ్యం. నివేదనతో అర్పించే వ్యక్తికి గృహదేవతలు సకల శుభాలు కలిగిస్తారు. నహుషుడు ధూపదీప దానాదులు చేయడం వల్లనే ఇంద్రపదవి పొందాడు. బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్ళినట్లు వెళ్ళాడు. దానాలన్నిటిలో దీపదానం శ్రేష్ఠమైనది.
No comments:
Post a Comment