స్కాంద
పురానామ్తర్గతంగా శివాష్టోత్తర శతనామావళిని పార్వతీ దేవికి ఉపదేశించి
అమ్మవారు అయ్యవారిలో అర్థభాగాన్ని పొందడానికి కావలసిన నామములను ఉపదేశము
చేసినటువంటి ఖ్యాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది. మరి ఎందుకు
శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు? అది
మంగళకర స్వరూపమా? అమంగళకర స్వరూపమా? ఎందుకు అలా ఉంటారు? నిజంగా ఒక స్వరూపం
అలా ఉండడం సాధ్యమయ్యే విషయమా? ఎవడైనా శ్మశానంలో ఉంటాడా? శంకర
భగవత్పాదులైతే శివానందలహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు.
స్వామీ! మీ దగ్గరికి వస్తాం, ఒక నమస్కారం చేస్తాం. కానీ మాకుమాత్రం ఎప్పుడూ
పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగండి అని అడగకండి
అన్నారు. ఎందుకని? పరమశివుడి ఇంటికి వెళ్లాం అనుకోండి. మన ఇంటికి వస్తే ఏం
చేస్తాం? అయ్యో పెద్దలు వచ్చారు అని ఒక కప్పు కాఫీ త్రాగండి అంటాం. అలా
పరమశివుడు ఇంటికి వెళ్తే స్వామి కూడా ఏమోయ్ శంకరా! వచ్చావా? అని తను
త్రాగుతున్నటువంటి హాలాహలం కొంచెం ఇస్తావేమో! “అశనం గరళం - నువ్వు
త్రాగేది చూస్తే గరళం. నాకెందుకు స్వామీ ఇది వద్దు. పోన్లేవయ్యా నా మెళ్ళో
హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తాను అంటావేమో – అసలొద్దు. ఫణీకలాపో – మెడలో
చూస్తే పాములు వేసుకొని ఉంటావు. వసనం చర్మ చ – పోన్లేవయ్యా నీకు ఒక బట్టల
జత పెడతాను అంటావేమో ఓ ఏనుగు చర్మం, ఓ పులిచర్మం ఇస్తావు నాకు. అసలొద్దు.
వాహనం మహోక్షః - పోన్లేవయ్యా నీకు ఒక వాహనం ఇస్తాను అంటావేమో. ఎప్పటినుంచీ
ఎక్కి తిరుగుతున్నావు ఆ ఎద్దు. అసలొద్దు నాకు. దానికిప్పుడు spares
దొరుకుతాయో లేదో కూడా అనుమానం. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ
భక్తిమేవ దేహి – నాకేమీ వద్దు కానీ శంకరా! నీపాదములయండు చెక్కు చెదరని
భక్తిని ప్రసాదించు” అని అడిగారు. నిజంగా శంకరుడు అంత కానివాడైతే ఆయన దగ్గర
పుచ్చుకోవలసింది లేకపోతే, ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు
పరమశివుని పాదములయందు భక్తి ఎందుకు అడిగారు? అదీ పరమశివునియొక్క స్వరూపం
అంటే. అది పైకి దొరికేది కాదు. పైకి చూస్తే ఒకలా ఉంటుంది. లోపల చూస్తే ఒకలా
ఉంటుంది. అంత చిత్రమైనటువంటిది శివస్వరూపం. శివ స్వరూపంలో అన్నింటికన్నా
చాలా గొప్ప విశేషం ఎవ్వరికీ లేని పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది
‘మహాదేవుడు’. ఒక్క శ్రీమహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడు అని పేరు.
మహాదేవుడు అన్న పేరు పరమశివునికి రావడానికి కారణాన్ని వేదం శ్రుతి మాట
చెప్పింది. “తమీశ్వారాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం! “ –
స్వామీ! నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడవు. నియామకులకు నియామకుడవు. ఎందుచేత? ఈ
సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తుట్టతుదకు తనలోనికి లయం చేసుకుంటాడు
శంకరుడు. సృష్టి, స్థితి, లయ, తిరోభావము, అనుగ్రహము అని అయిదు చేస్తాడు.
అందుకే అమ్మవారికి “పంచకృత్య పరాయణా” అని పేరు. తిరోధానం అంటే సమస్త
బ్రహ్మాండము లను తనలోనికి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని
తిరోధానం అంటారు. తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు. ఆ
ప్రక్రియకు అనుగ్రహం అని పేరు. ఇవన్నీ పరమశివుడు మాత్రమే చేస్తాడు. అందుకే
ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితి కర్త, ఆయనే లయకర్త. పైకి కనపడడానికి ఆయన
లయకారకుడిగా చెప్పబడతాడు. కానీ సమస్తమూ ఆయనలోంచే వస్తోంది, ఆయనలోకే
వెళ్ళిపోతోంది, ఆయన చేత నిలబెట్టబడుతున్నది. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు,
ఆయనే సదాశివుడు. అందుకే పోతన గారు అంటారు
“మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు, భేదమగుచు తుదకి అబేధ్యమయ్యావు బ్రహ్మము నీవే ఫాలనయనా!!” అని. స్వామీ! నీకు మూడో కన్ను ఉంది ఎవ్వరికీ లేదు. ఈమాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి. ఇతరమైన ఏ దేవతకు మూడవకన్ను ఉండదు. ఒక్క శంకరుడికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది. మూడవ కన్ను ఉండడానికి కారణం ఏమిటి? అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము అనే మూడింటిని నేత్రముగా కలిగి ఉంటాడు. ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషించబడుతున్నాయి.
“మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు, భేదమగుచు తుదకి అబేధ్యమయ్యావు బ్రహ్మము నీవే ఫాలనయనా!!” అని. స్వామీ! నీకు మూడో కన్ను ఉంది ఎవ్వరికీ లేదు. ఈమాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి. ఇతరమైన ఏ దేవతకు మూడవకన్ను ఉండదు. ఒక్క శంకరుడికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది. మూడవ కన్ను ఉండడానికి కారణం ఏమిటి? అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము అనే మూడింటిని నేత్రముగా కలిగి ఉంటాడు. ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషించబడుతున్నాయి.
No comments:
Post a Comment