వచ్చే ఏడాది జులైలో గోదావరి పుష్కరాలు

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జులైలో తొలిసారి వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ జిల్లాలో మేడారం జాతర తరహాలో సకల ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని గోదావరి పుష్కరాలకు నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఏటూరునాగారం, మండపేట మండలాల్లో పుష్కరఘాట్లు


జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పుష్కరఘాట్‌లపై కసరత్తు మొదలుపెట్టారు. సర్వే నిర్వహించిన అధికారులు నాలుగు ప్రాంతాల్లో 13 కోట్ల 56 లక్షల అంచనాలతో 410 మీటర్ల పొడవున స్నానఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు
2003లో 12 రోజుల పాటు జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. అప్పటి ప్రభుత్వం అరకొర సౌకర్యాలతోనే పుష్కరాలు నిర్వహించాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోపించింది. తాము గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్పడమే గాకుండా బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జూన్‌లోగా పనులను పూర్తి చేస్తామని అధికారులంటున్నారు. జూలైలో గోదావరి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతంగా ఉన్నా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నాన ఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment