కుమారస్వామి అవతారం అత్యంత విశేషం. ఎప్పటికప్పుడు కుమార స్వామిని తలంచుకోవాలి. అసుర శక్తులు తీవ్రంగా విజృంభించిన దశ కుమారస్వామి ఆవిర్భవించడానికి ముందుంది. అంత అసుర శక్తి విజృంభణ యుగాలలో ఎక్కడా జరుగలేదుట. అంత భయంకరమైన అసురశక్తులు. ఆఖరికి అప్పుడున్న బ్రహ్మగారు, యే దేవతల వల్ల కాదు. కొత్త దేవత రావాలి. కొత్త దేవత వస్తాడా? రాడు. కనుక అనాదియైన బ్రహ్మము శక్తితో కలిసి యథాతథంగా రావలసిందే అన్నారు. అందుకు దేవతలకంటే పూర్వమున్న మహాతేజస్సే మళ్ళీ రావాలి. అందుకు బ్రహ్మగారు కూడా నా సృష్టిలో ఉన్నదేదీ చేయలేదు అన్నాడట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎందరు రాక్షసులు అంటే మనకు తెలిసి తారకాసురుడు, వాడితో కలిసి శూరపద్ముడు, భానుగోపుడు మొదలగు అనేక భయంకరమైన రాక్షస శక్తులు - వీళ్ళ ధాటి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ సమయంలో రావలసిన వాడాయన. పైగా దేవతలకి శక్తి ఉంది కానీ చెట్టుకి, పుట్టకీ చెదిరిపోయారు - Scattered. వాళ్ళకి Collective force రావడం లేదు, వాళ్ళకి బలం రావట్లేదు. అందరికీ బలం ఉంది. కానీ గుమికూడలేక పోతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి అదే. దేవతలకి Unity తగ్గిపోతూ ఉంటుందిట కలికాలం లాంటి కాలంలో. దేవతలంటే దివ్యగుణాలు. మనలో కూడా మంచి భావాలు పుడుతూంటాయి చెల్లాచెదురుగా. కానీ అవన్నీ collect చేసి నడిపించేవాడు ఒకడు రావాలి. అప్పుడు ఈ దేవతల బలానికి బలాన్నిచ్చి దేవతలనే సేనలుగా చేసుకున్నవాడు ఒకడు రావలసిందే. వాడెవడు అంటే శివశక్త్యాత్మకమైన మహానుభావుడు. ఆయన వచ్చి మొత్తం దేవతలను సేనలుగా చేశాడు. 33కోట్ల దేవతలను సేనలుగా చేసుకున్న మహానుభావుడు. ఆయన బయలుదేరి జగతికి కుత్సితము అంటే చెడు గతులు కలిగిస్తున్న వాళ్ళని మారణం చేశాడు. "కుత్సితాన్ మారయతీతి కుమారః" - కుత్సితులైన దుర్మార్గులైన అసుర శక్తులను ధ్వంసం చేశాడు కనుక కుమారుడు. అంతేగానీ పుత్రుడు అని మాత్రమే కాదు. కుమార శబ్దానికి దుష్టశక్తులను దునుమాడు వాడు.
No comments:
Post a Comment