చంద్రుడు మృగశిరా నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం

Photo: ఋతువుల్లో వసంత ఋతువును, చందస్సులలో గాయత్రిని...' అంటూనే మాసాల్లో మార్గశిరాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. అంతటి విశిష్టమైనది మార్గశిరం. సుబ్రహ్మణ్య షష్ఠి, దత్తజయంతి, గీతాజయంతి, హనుమద్ర్వతం, కాలబైరవాష్టమి...దాదాపు రోజుకో వ్రతం జరిగే ఈ మాసం ఆసాంతం దేవాలయాల్లో సందదే సందడి.
చంద్రుడు మృగశిరా నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో ప్రతీక్షణం 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికీ ఇష్టమేనని భక్తుల విశ్వాసం. అందుకే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం నాడు 'మార్గశిర లక్ష్మీవార వ్రతం' భక్తితో ఆచరిస్తారు.
ధనుర్మాసం
సకల చరాచర సృష్టికీ చైతన్యాన్ని ప్రసాదిస్తున్న సూర్యుడు మార్గశిరంలో వృశ్చికరాశిలోంచి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే నెలపట్టడం అంటారు. అప్పట్నుంచి మేషసంక్రమణం వరకూ...అంటే సంక్రాంతి వరకూ 30 రోజుల్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెలంతా తెలవారకముందే తెలిమంచులోనే ఇళ్లముందు పేడకళ్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్దుతూ గొబ్బెమ్మలు పెట్టే కన్నెపిల్లలతో వీధులన్నీ కళకళలాడిపోతూంటాయి.
రోజూ పండుగే
మార్గశిర మాసానికున్న మరో ప్రత్యేకత..నెల్లో దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక పవిత్రతను ఆపాదించారు మన పెద్దలు. మార్గశిర శుద్ధపాడ్యమి నాడు గంగాస్నానం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నానఫలితం లభిస్తుందన్నారు. తదియనాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు. చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు. పంచమినాడు చేసే నాగపంచమి వ్రతం, మర్నాటి సుబ్రహ్మణ్య షష్టి గురించి అందరికీ తెలిసిందే. శుద్ధ సప్తమినాడు సూర్యారాధన పేరుతో ఆ ప్రత్యక్షనారాయణుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ అష్టమిని 'కాలభైరవాష్టమి'గా వ్యవహరిస్తారు. శివుడు కాలభైరవుణ్ణి సృష్టించిందీ రోజేనని పురాణ కథనం నవమినాడు...త్రివిక్రమ, త్రిరాత్రవ్రతం జరుపుతారు. దశమి రోజున కొన్ని ప్రాంతాల్లో పదార్థవ్రతం, ధర్మవ్రతం చేసే అచారం ఉంది.
ఆ మర్నాడు, ఏకాదశి ప్రత్యేకత గురించి చెప్పనే అక్కర్లేదు. ఏకాదశి తిథులన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఈ మాసంలో వచ్చే తిథిని మోక్షొకాదశి, సౌఖ్యదా ఏకాదశిగా పిలుస్తారు. ఒకవేళ అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి ఏకాదశి (వైకూంఠ ఏకాదశి) అవుతుంది. చంద్రమానాన్ని బట్టి ఇది ఒక్కొక్కసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. శుక్లపక్ష ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉంది. కురుక్షేత్రంలో తాతతండ్రులునూ బంధుగణాల్నీ చూసి అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీతాబోధ చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును 'గీతాజయంతి'గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని పూజించి, గీతాపరాయణ చేస్తే మంచిదని ప్రతీతి.
ఇక, మర్నాటి ద్వాదశిని మత్స్యద్వాదశి అంటారు. ఆ తర్వాత రోజు..అంటే మార్గశిర శుద్ధ త్రయోదశినాడు భయ, పీడ నివారణార్థం హనుమద్ర్వతం త్రయోదశీ వ్రతం జరుపుతారు. ఈ మాసంలో శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు. పౌర్ణమి...దత్తాత్రేయుడు అవతరించిన రోజు. ఆ రోజున దత్తచరిత్ర పారాయణ చేస్తారు చాలమంది. ఈ పున్నమికే కోరలపున్నమి,నరక పూర్ణిమ అని పేరు. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రాత్రి మినపరొట్టెలు చేసి వాటిని ఓ మూల కొరికి మొత్తం కుక్కలకు వేస్తారుం ఒంట్లో, కోరల్లో(పళ్లల్లో)ఉండే విషమంతా ఆరోజు బయటకొచ్చేస్తుందని నమ్మిక. ఈ పౌర్ణమినాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిదంటారు పండితులు.
కృష్ణపక్షంలో:
మార్గశిర కృష్ణ పాడ్యమినాడు శిలావ్యాప్తి వ్రతం, సప్తమినాడు ఫలసప్తమీ వ్రతం, అష్టమికి అనఘాష్టమీ, కాలాష్టమీ వ్రతాలు, నవమినాడు రూపనవమి వ్రతం, ఏకాదశి రోజు వైతరణీ వ్రతం, ధనద వ్రతం, సఫల ఏకాదశీ వ్రతం, ద్వాదశి తిథి రోజు మల్లద్వాదశి, కృష్ణద్వాదశీ వ్రతాలు, ఆ మర్నాడు యమత్రయోదశి వ్రతం..ఇల కృష్ణపక్షంలోనూ రోజుకో వ్రతం. చివర్లో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి ఉండనే ఉంటుంది. ఆఖరు రోజైన అమావాస్యనాడు బహుళమావాస్య వ్రతంతో మార్గశిరం పూర్తవుతుంది. తెలుగు మాసాలన్నింటిలోనూ ఇన్ని వ్రతాలు ఆచరించేది ఈ నెల్లోనే! అందుకే మార్గశిరం అంటే భగవంతుడి మాసం, ప్రకృతి మాసమే కాదు...వ్రతాల మాసం కూడా!

No comments:

Post a Comment