ఎందుకు దీపం పెట్టాలి? కార్తిక సోమవారం అండీ, కార్తిక సోమవారం అంటారు. అలా అనడానికి కారణం ఏమిటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యే రోజుకు సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ ఒక రోజులో ఎనిమిది హోరలు మూడు పర్యాయాలు తిరుగుతాయి. మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు. మొట్టమొదటి హోర, అన్నింటికన్నా ప్రారంభంలో వుండే హోర సూర్య హోర. తరువాత వచ్చేది శుక్ర హోర. తరువాత వచ్చేది బుధ హోర. తరువాత వచ్చేది చంద్ర హోర, తరువాత శని హోర, తరువాత గురు హోర, తరువాత కుజ హోర. ఎనిమిది హోరలు. అందుకే ఆ హోరలు మూడు ఎనిమిదుల ఇరవై నాలుగు పూర్తీ, మళ్ళీ ఇరవై అయిదవ హోర వచ్చేటప్పటికి హోర ప్రారంభం అవుతుంది కాబట్టి దానికా పేరు. సోమవారం ఉందనుకోండి చంద్ర హోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారమనుకోండి సూర్యహోరతో ప్రారంభం అవుతుంది. సూర్య హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆదివారము, భాను వారము అని పిలుస్తాము. ఈ ఎనిమిదే ఇరవై నాలుగు గంటలలో పూర్తి అయిపోతాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు. 'చంద్రమా మనసో జాతః' అని పిలుస్తుంటారు. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు. హృదయ స్పందనే మనుష్య ప్రాణి జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటుందో అంతసేపు బ్రతికి ఉన్నాడంటారు. గుండె ఆగిపోయింది అనుకోండి 'ఆయన వెళ్ళిపోయాడండీ' అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనే దానికి హృదయమునందు హృదయనాడి అనే నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కనపడేది కాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహమయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు దేనికి ఎక్కువ ప్రీతి పొందుతాడంటే నువ్వులనూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వట్టి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్ఠమవుతుంది. యమధర్మరాజు పీల్చి వదులుతాడు. ఆయుఃకారకమవుతుంది. హృదయనాడి నిలబడుతుంది. అందుకని కార్తికమాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూతకోటికి ఉపకారం చెయ్యమని. వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని. బాహ్యమునందు ప్రతిపాదన చేయడానికి ఆవునేతితో కానీ, నువ్వులనూనెతో పెట్టిన దీపమే పెట్టమని చెప్పటానికి వెనకవున్న తార్కికమైన కారణమది.
No comments:
Post a Comment