కార్తీక పౌర్ణమి(

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘త్రిపుర పూర్ణిమ’గా లేదా ‘దేవ దీపావళి’గా వర్ణించుకుంటారు.

కార్తీకమాసం మొదలైన రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం వేళ దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారాలను, పౌర్ణమి రోజును పవిత్రంగా భావించి, విశేష పూజలను నిర్వహించుకుంటారు. ఇలా నెలమొత్తం ప్రతిరోజు పూజలను నిర్వహిస్తూ కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేసుకుంటారు.
మహాభారతంలోని కథనం ప్రకారం... కార్తికేయుడు తారకాసురుడిని సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. అప్పట్లో తారకాసురుడు ప్రజలను అనేక రకాలుగా విసిగిస్తున్న నేపథ్యంలో కార్తికేయుడు అతనిని సంహరించాడు. దీంతో అప్పటి ప్రజలు ఆనందంతో దీపాలను వెలిగించి, సంబరాలను చేసుకున్నారు.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైన రోజు. ఈరోజున దీపాలను వెలిగించడంతో తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విశిష్ట రోజున సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేయస్కరం.
ముఖ్యంగా కార్తీకపౌర్ణమినాడు ఉదయాన్నే లేవగానే.. సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం ఎంతో శుభప్రదమైంది. ఇకవేళ ఇలా స్నానం చేయడం కుదరకపోతే ఉదయాన్నే లేచి... స్నానాలు చేసిన తరువాత స్నాన జపాలు ముగించుకుని, ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు.
ఈ కార్యక్రమాలను ముగించుకున్న తరువాత రోజంతా ఉపవాసం వుండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. ఈ వత్తులు మొత్తం రోజుకు ఒకటి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడంవల్ల ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలం దక్కుతుందని కూడా నమ్ముతారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తారు.

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా ఒక విశిష్టమైన పర్వదినం. ఎందుకంటే.. గురునానక్ జయంతి కూడా ఈరోజే కాబట్టి. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవాలను కూడా నిర్వహిస్తారు.

No comments:

Post a Comment