కార్తీక మాసము

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.
ఉత్థాన ఏకాదశి
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది మంచిది.ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.
కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
కార్తీక సోమవారాలు - నదీస్నానాలు
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.
కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

No comments:

Post a Comment