లోలార్క ఆదిత్య - ద్వాదశాదిత్యులు:

ఒకనాడు శివ భగవానుడు సూర్యునితో “సప్తాశ్వ వాహనా! నీవు మంగళకారియైన కాశీ పురమునకు వెళ్ళుము. అచట రాజు పరమ ధార్మికుడు. అతని పేరు దివోదాసుడు. రాజు ధర్మ విరుద్ధమైన పనులు చేసిన కాశీ పాడుబడి నిర్జనమగును. అదెట్లు జరుగునో నీవు అచటికి వెళ్ళి ఉపాయమాలోచించుము. రాజునకు అవమానము మాత్రము కలిగించకు. ఎందుకనగా ధర్మాచరణయందు మునిగివున్న సత్పురుషుని అవమానించిన అది తిరిగి వారిపైనే పదును. అట్లొనరించిన మహా పాపము కలుగును. అందువలన నీవు బుద్ధి బలముతో రాజుని ధర్మచ్యుతుని గావిన్చావలెను. అప్పుడు నీవు నీ కిరణములతో నగరమును దగ్ధము చేయుము. నేనింతకు మునుపు దేవతలను, యోగులను ఈ పనిమీద కాశీ నగరమునకు పంపితిని. కాని వారు దివోదాసుని అధర్మ మార్గమున పెట్టలేక తిరిగి వచ్చిరి. దివాకరా! ఈ జగత్తునందు ఎన్ని జీవరాశులున్నవో, వాని చేష్టలన్నియూ నీకు తెలియును. అందుచేతనే నిన్ను లోక చక్షువందురు. అందువలన నా కార్యసిద్ధికి నీవు శీఘ్రముగా వెళ్ళుము. ఖాళీగా నున్న కాశీ నగరమున నేను నివసిమ్పవలేనని కోరుకొనుకొంటిని.” అని చెప్పెను.
సూర్యభగవానుడు కాశీ నగరమునకు వెళ్ళెను. రాజుని పరీక్షించుటకు అచట లోపల వెలుపల సంచరింప సాగెను. కాని రాజునందు ఏ మాత్రము అధర్మము గోచరించుట లేదు. సూర్యుడు అనేక రూపములు ధరించి కాశీ యందుండ సాగెను. ఎన్ని విధముల ప్రయత్నించిననూ కాశీయందున్న నరనారీలు ధర్మము వీడుట లేదు.
కాశీని ఎవరు విడువ గలరు? ఈ జగత్తునందు భార్యాపుత్రులు, ధనము లభించును గాని, కాశీపురము లభించదు. ధర్మమయమైన కాశీ నగరమును గాంచిన సూర్య భగవానునకు తానునూ కాశీ యందుండవలెనని కోరిక కలిగెను. సూర్యుని మనస్సు గలిగిన ‘లోల’ (మనస్సు చలించి కోరిక కలుగుట) వలన యితడు కాశీ నగరమందు ‘లోలార్క’ నామముతో ప్రసిద్ధిగాంచెను. కాశీకి దక్షిణ దిశయండు అసీ సంగమ సమీపమున లోలార్కుడుండెను. యితడు సదా కాశీయందుండి కాశీ నివాసుల యోగ క్షేమములను చూచుచుండును.
మార్గశిర మాసమున షష్ఠీ, సప్తమీ తితులతో కూడిన ఆదివారమునాడు కాశీయాత్ర చేసి లోలార్కుని దర్శించిన సమస్త పాపములు తొలగిపోవును. ఆదివారమునాడు లోలార్క సూర్యుని దర్శించి వాని చరణామ్రుతమును సేవించిన ఎత్తి దుఃఖములు కలుగవు మరియు తామర రోగము, దురద, కురుపులు మొదలగు రోగములు గలుగవు. లోలార్క మహాత్మ్యము చదివిననూ, వినిననూ వారికి ఎప్పటికినీ దుఃఖము కలుగదు.


No comments:

Post a Comment